సంస్కృతి, సంప్రదాయాల ప్రతీక సదర్​

ఆచార వ్యవహారాలకు, సంస్కృతి, సంప్రదాయాలకు తెలంగాణ ప్రాంతం ప్రాచుర్యాన్ని  పొందినది.  నేడు ప్రపంచ వ్యాప్తంగా ప్రసిద్ధికెక్కిన పండుగలలో బోనాల పండుగ, బతుకమ్మ..మానవునికి, ప్రకృతికి మధ్య గల సంబంధాన్ని చాటి చెప్తున్నాయి. అదేవిధంగా మూగ జీవులకు తాము ఇచ్చే ప్రాధాన్యతను తెలిపేందుకు సదర్‌ ఉత్సవాలను ఏటేటా ఘనంగా తెలంగాణ ప్రజలు జరుపుకుంటున్నారు.  దీపావళి సందర్భంగా వచ్చే సదర్‌ సంబురాలు ప్రధానంగా యాదవ సామాజిక వర్గానికి చెందిన ప్రజలు ఎంతో ఉత్సాహంగా జరుపుకుంటారు. వ్యవసాయ అనుబంధ రంగాల వెల్లువను చాటే ఉత్సవం సదర్‌.  పాడి పరిశ్రమల అభివృద్ధిలో దున్నపోతుల పోషణ కీలకమైనది.

పాడి పరిశ్రమ ద్వారా ఉపాధి పొందుతున్న యాదవులు పశువుల సంతతి పెరగడానికి  మూలాధారమైన దున్నపోతులను పవిత్రంగా చూడడం  ఈ  సదర్‌  సమ్మేళనం ప్రత్యేకత. యాదవులు  యమ ద్వితీయ నాడు వారి పాడి పరిశ్రమకు మూలాధారమైన  దున్నపోతులను అలంకరించుకొని డప్పు చప్పుడులతో వాడవాడలా తిప్పుకుంటూ.. అందరూ ఒక్క దగ్గర ప్రధాన సదర్‌ను కలిసి వారి ఆశీస్సులు తీసుకోవడం ఆనవాయితీగా సదర్​ సమ్మేళనం జరుగుతున్నది. 

దున్నపోతులకు ప్రత్యేక అలంకారం

బలమైన కండపుష్టి భారీ కాయం, డొప్పలాంటి చెవులు, మెలికలు తిరిగిన కొమ్ములతో కూడిన దున్నపోతును నున్నగా చేసి కేశాలను వివిధ ఆకృతులలో (డిజైన్‌ కటింగ్‌) కత్తిరించి, నూనెతో మసాజ్‌ చేసి, కొమ్ములకు వివిధ రకాల రంగులను రుద్ది, తల మీద నెమలి ఈకలతో, మెడకు గంటలను గవ్వ పేర్లను వేసి, పూలతో అలంకరించి, నుదుటన పసుపు, కుంకుమ తిలకం పెట్టి, వినూత్నంగా, అందంగా తీర్చిదిద్దుతారు.   యాదవ బ్యాండ్‌ దరువులతో, పెద్దపులి ఆటలతో నృత్యాలు చేస్తూ విభిన్నమైన విన్యాసాలను చేస్తారు. దున్నపోతులతో సలామీ చేయిస్తూ ఉదయం వేళలో యాదవులు వారి పరిసర ప్రాంతాల బంధువుల, అక్కా చెల్లెళ్ల ఇండ్లకు దున్నపోతులను తీసుకువెళతారు.  ఇంటి యజమానులు వచ్చిన దున్నపోతులకు సాక పెట్టి కొబ్బరికాయ కొట్టి పూల మాల వేసి పూజలు చేసి, దున్నపోతుల యజమానులకు 'ఇనాం'గా కొంత డబ్బును ఇస్తారు.  సాయంత్రం వేళలో ఇలా కొన్ని వందల దున్నపోతులను ర్యాలీగా తీసుకువస్తూ  యజమానులు వాటి పైన నిలకడగా నిల్చొని  విన్యాసాలను ప్రదర్శిస్తారు. వినూత్న ప్రదర్శన కనబరచిన దున్నపోతులకు బహుమతులను అందించి దున్నపోతుల ప్రాధాన్యతకు పట్టం  కడతారు.  ద్వాపర యుగంలో  గోకుల యాదవులు వారికి సంబంధించిన పశు సంపదను పూజించారు. ఈ విధంగానే సదర్‌ ఉత్సవాలలో దున్నపోతులను పూజించడం ఆనవాయితీగా మారిందని పెద్దలు చెబుతుంటారు. 

నిజాం కాలం నుంచి సదర్‌ ఉత్సవాలు

మార్మండేయ పురాణంలో యమ ద్వితీయ  ప్రాధాన్యత మనకు కనబడుతుంది.  యముని వాహనమైన దున్నపోతుని చక్కగా అలంకరించి వాడవాడలలో తిప్పుతూ  పూజలు చేసి ధర్మాన్ని పాలించే యముడి వలె సదర్‌ల ఆశీర్వాదం తీసుకోవడం యాదవుల తాత్త్విక చింతనకు నిదర్శనం.  సదర్‌ అనేది ఉర్దూపదం. నిజాం కాలం నుంచి సదర్‌ ఉత్సవాలను తెలంగాణ ప్రాంతాలలో జరుపుకుంటున్నారు. నిజాం ప్రభువులు సదర్‌ ఉత్సవాలను హైదరాబాద్‌లోని మలక్‌పేట్‌ చంచల్‌గూడ ప్రాంతాలలో నిర్వహించేవారు.   ఉమ్మడి రాష్టంలో సదర్‌ ఉత్సవం అంతగా ప్రాధాన్యతను సంతరించుకో లేకపోయినది.  తెలంగాణ రాష్ట్రం ఏర్పడి మన ఆత్మగౌరాన్ని కాపాడుకునే క్రమంలో యాదవుల సంస్కృతి, సంప్రదాయాలకు  ప్రతీక అయిన సదర్‌ ఉత్సవాలను జరిపి పాడి పరిశ్రమ అభివృద్ధి చెందాలంటే బర్రెలతో పాటు మేలురకం దున్నపోతులు కూడా ముఖ్యమైనవి.  ఈ మేరకు అవగాహన, చైతన్యాన్ని కల్పించి ఆర్థిక  సహకారం అందించి ఆహార ఉత్పత్తిని ప్రోత్సహించవలసిన బాధ్యత ప్రభుత్వంపై ఉంది. బతుకమ్మ పండుగ తరహాలోనే ప్రభుత్వం అధికారికంగా ట్యాంక్‌బండ్‌ పైన ఈ సదర్‌ ఉత్సవాలను నిర్వహించాలని యాదవులు కోరుకుంటున్నారు.

- వరకాల వసుమతి యాదవ్‌, వేదం ఆర్ట్స్‌ అకాడమీ,  నల్లకుంట