రాయి కాదు, బలమైన వస్తువు.. సబర్మతి ఎక్స్‌ప్రెస్ ప్రమాదం వెనుక కుట్ర కోణం!

శనివారం తెల్లవారుజామున ఉత్తర్‌ప్రదేశ్‌లోని కాన్పూర్‌ వద్ద సబర్మతి ఎక్స్‌ప్రెస్‌(Sabarmati Express, 19168) రైలు పట్టాలు తప్పిన విషయం తెలిసిందే. తెల్లవారుజామున 2.35 గంటల ప్రాంతంలో కాన్పూర్-భీమ్‌సేన్ రైల్వే స్టేషన్ మధ్య రైలు పట్టాలు తప్పింది. ట్రాక్‌పై ఉన్న ఓ బలమైన వస్తువును ఢీకొనడంతో ఈ ప్రమాదం చోటుచేసుకున్నట్లు రైల్వే అధికారులు వెల్లడించారు. పోలీసులు, ఐబీ సంయుక్తంగా ఈ ఘటనపై దర్యాప్తు చేపట్టాయి. ఇంజిన్‌ ఢీకొన్న వస్తువు ఆనవాళ్లను అధికారులు భద్రపరిచారు.

ఈ ఘటన ప్రమాదవశాత్తూ జరిగినదని కాదని, ట్రాక్‌పై ఉంచిన వస్తువును ఇంజిన్ ఢీకొట్టడం కారణంగానే రైలు పట్టాలు తప్పిందని అధికారులు ప్రాథమికంగా నిర్ధారించారు. ఈ ప్రమాదం వెనుక సంఘవిద్రోహుల ప్రమేయాన్ని పరిశీలిస్తున్నట్లు రైల్వే బోర్డు అధికారులు తెలిపారు. రైలు 16వ కోచ్ దగ్గర తమకు ఒక విదేశీ మెటీరియల్ లభించినట్లు ఉన్నతాధికారులు వెల్లడించారు. 

"రైలు 16వ కోచ్ దగ్గర మాకొక విదేశీ మెటీరియల్ దొరికింది. ఇంజన్‌లోని దెబ్బతిన్న భాగాన్ని పరిశీలిస్తే, దొరికిన విదేశీ వస్తువును ఢీకొట్టి పట్టాలు తప్పినట్లు తెలుస్తోంది.." అని అధికారి ఒకరు తెలిపారు.

సాక్ష్యాలు భద్రపరచాం: కేంద్ర రైల్వే శాఖ మంత్రి

ఈ ఘటన పట్ల కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ సైతం అనుమానాలు వ్యక్తం చేశారు. దీని వెనుక కుట్ర కోణం దాగి ఉన్నట్లు కేంద్ర మంత్రి తెలిపారు. షార్ప్ హిట్ మార్కులు స్పష్టంగా కనిపిస్తున్నాయన్నారు. ఇప్పటికే సాక్ష్యాలు సేకరించామన్న మంత్రి.. ఐబీ, యూపీ పోలీసులు విచారణ చేపట్టారన్నారు. అధికారుల నివేదిక ఆధారంగా చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.