తెలంగాణలో రైతుబంధు అమలు ఎలా ఉండాలి?

పంటల సహాయం, సాగు కోసమే కాకుండా భవిష్యత్తులోనూ వ్యవసాయ రంగం సుస్థిరమైన దిశగా ఉండాలి.  ప్రకృతిని కాపాడుకోవాలి,  మానవ మనుగడ  ప్రమాదకరం కాకూడదని ప్రధాన ఉద్దేశంతో  తెలంగాణ రాష్ట్రంలో ‘రైతుబంధు’  అమలు చేయడంపై  మేం పరిశోధన చేశాం.  

కొన్ని నిర్దిష్టమైన సూచనలు, సలహాలు, పరిమితులను  పరిశోధన పత్రం ద్వారా ప్రభుత్వానికి ఇవ్వడం జరిగింది.  ‘రైతుబంధు’పై  పరిశోధించి రాసిన రీసెర్చ్ పేపర్ ఇంటర్నేషనల్ జర్నల్  ‘అగ్రికల్చరల్ రీసెర్చ్ కమ్యూనికేషన్ సెంటర్ లోని భారతీయ కృషి అనుసంధాన పత్రిక ( "United States Dept of Agriculture- National Agricultural Library" , Indian science Abtract"  " Indexed in EBSCO" and  "CAB"  abstracts )   పత్రికల్లో ప్రచురితం కావడం గమనార్హం.   ఈ రీసెర్చ్  జర్నల్ ను  భారత  ప్రభుత్వానికి చెందిన ‘నేషనల్ అకాడమీ ఆఫ్ అగ్రికల్చరల్  సైన్సెస్’  రేటింగ్​ ఇవ్వడం జరుగుతుంది. 

 రైతుబంధు అమలుపై  పరిశీలించాల్సిన అంశాలు 

1. వ్యవసాయ భూముల్లో పంటలు పండించేందుకుగాను సేంద్రియ వ్యవసాయ పద్ధతులను పాటించాలి.  అందులో భాగంగా ప్రతి రెండు సంవత్సరాలకు ఒకసారి పంట మార్పిడి విధానాన్ని పాటించాలి.  మెట్ట భూముల్లో పంటల మధ్యలో  మరో పంటను వేయాల్సి ఉంటుంది. 
2. సాగు భూమిని  ట్రాక్టరుతో  లేదా ఇతర ఉపకరణాల ద్వారా  దున్నినప్పటికీ  5  ఇంచుల  లోతు కంటే ఎక్కువగా దున్నకూడదు.
3.  ప్రతి సంవత్సరం ఖరీఫ్,  రబీ పంట ప్రారంభానికి ముందు  సాగుభూమిలో పశువులకు సంబంధించిన లేదా  మేకలు, గొర్రెలకు సంబంధించిన సంప్రదాయక ఎరువులను సాగుభూమిలో వేయాలి. 
4. ప్రతి వ్యవసాయదారుడు లేదా రైతు వారి ఇంటిలో కచ్చితంగా రెండు ఎడ్లు, వీటితోపాటు ఒక ఆవు లేదా ఒక బర్రె  పెంచుకోవాలి. 
5. సాగు భూమిలో  క్రిమిసంహారక మందులను, రసాయనిక ఎరువుల  వాడకాన్ని తగ్గించాలి.  అలాగే గడ్డి మందులను ఎట్టి పరిస్థితుల్లోనూ సాగుభూమిలో వాడకూడదు. 
6.  పంటలలో  వచ్చే కలుపును కూలీలతో కానీ లేదా సంప్రదాయ ఉపకరణాల ద్వారా గాని మాత్రమే తీసివేయాలి.
7. పంట చేతికి వచ్చిన తర్వాత ఆ పంట వ్యర్థాలను  సాగుభూమిలో తగలబెట్టకుండా భూమి లోపల  నిల్వ ఉంచాలి . 
8. మెట్ట భూముల్లో  మెయిన్ పంటతో  పాటు పురుగులను ఆకట్టుకుని రోగాలు మెయిన్ పంటకు తగలకుండా ఉండేందుకు  ట్రాప్ క్రాప్ ను వేయాలి. 
9. వర్షాకాల సమయంలో వానలు పడినప్పుడు సాగు భూమి  కోతకు గురికాకుండా ఉండడానికి సాగు భూమి లో వంపు ఉన్న ప్రాంతాల్లో  స్లోపు కట్టలు నిర్మించాలి.
10. పై నిబంధనలు  లేదా పద్ధతులను పాటించిన వారికే రాష్ట్ర ప్రభుత్వం రైతుబంధు ఇవ్వాల్సిన అవసరం ఉంది.  అలాగే ఈ నిబంధనల ద్వారా పంట పండించిన రైతుల పంటలను  లేదా ఉత్పత్తులను రాష్ట్ర ప్రభుత్వం ఎమ్మెస్పీకి 30 శాతం అదనంగా ధర కల్పించి కొనుగోలు చేయాల్సిన అవసరం ఉంది. 
11. సాగుభూముల్లో  సంప్రదాయ ఎరువులను రైతులు కొనుగోలు చేయడానికి కొంత సబ్సిడీని రాష్ట్ర ప్రభుత్వం అందించాల్సిన అవసరం ఉంది. 
12. ఎరువులు,  క్రిమిసంహారక మందుల సబ్సిడీని తగ్గించాల్సిన అవసరం ఉంది. 
13.  ప్రతి జిల్లాల్లో  ఒక పర్యవేక్షక బృందాన్ని ఏర్పాటుచేయాలి. సాగుభూముల్లో వారు పర్యటించి ఎప్పటికప్పుడు రైతులకు అవగాహన కల్పించాలి. 
14. ఈ పద్ధతులను పాటిస్తున్న రైతులకు  రైతుబంధును వర్తింపచేయాలి.  ఈ పద్ధతులు పాటిస్తున్నారా లేదా అనేది ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ వారికే  రైతుబంధు అమలు జరిగేలా ప్రభుత్వం కృషి చేయాలి. 
15. రైతులకు కేవలం ఆర్థిక సహాయం చేయడమే కాకుండా  తగిన పద్ధతులు,  షరతులు విధించినప్పుడే  సరైన విధానంతో  రైతులు పంటలు పండించగలరు. 

నిబంధనలు సూచించడానికి  ప్రధాన కారణాలు 

ప్రపంచవ్యాప్తంగా ఇప్పటివరకు ఉన్న వ్యవసాయ  సాగుభూమిలో 40 శాతం  సహజ ఉత్పత్తి సామర్థ్యాన్ని కోల్పోయింది.  దీనికి కారణం సాగుభూమిలో వాడుతున్న  క్రిమిసంహారక మందులు, రసాయనిక ఎరువులు. ఇప్పుడు  ప్రపంచవ్యాప్తంగా 800 కోట్ల జనాభా ఉండగా,  రానున్న 2050  సంవత్సరం నాటికి 1000 కోట్ల జనాభాకు చేరనుందని జనాభా శాస్త్రవేత్తల అంచనా.

అయితే, 1000 కోట్ల జనాభాకు తగిన ఆహారం అందించాలంటే ఇప్పుడున్న సాగుభూమి సహజమైన ఉత్పత్తి శక్తిని పెంచాల్సిన అవసరం ఉంది.  లేదంటే  ప్రపంచ ప్రజలు  ఆకలిబాధతో అలమటించే అవకాశం ఉన్నది.  ఆహార  పంటలపై  క్రిమిసంహారక మందులు, రసాయనిక ఎరువులు వాడడం వల్ల మానవాళి అనేక రోగాల బారిన పడటమే కాకుండా క్యాన్సర్ లాంటి  మహమ్మారిలను కూడా  కొని తెచ్చుకుంటున్నట్లయితుంది. అలాగే సహజ పద్ధతులను కాకుండా అసహజ పద్ధతులను ప్రయోగించడం వల్ల వాతావరణంలో మార్పులు చేసుకుంటూ క్లైమేట్ చేంజ్ కు  కారణం అవుతున్నాయి.  తీవ్రమైన ఎండలు,  సమయానికి వానలు పడకపోవడం,  వడగాడ్పులు తీవ్రంగా రావడం మొద లైనవి సంభవిస్తున్నాయి.  

మానవాళి చేసే చేష్టల కారణంగా  ప్రకృతి దారి తప్పుతూ తిరిగి మానవాళికే నష్టం జరిగేలా అవుతున్నది.  భూమి ఆరోగ్యాన్ని   కాపాడుకోకపోవడం వల్ల  భూమిపై మానవాళి మనుగడ ప్రమాదకరంగా మారింది. ఈ నేపథ్యంలో వ్యవసాయ రంగంపై,  సాగుభూములపై  కేంద్ర,  రాష్ట్ర ప్రభుత్వాలు తగిన పాలసీలను రూపొందించాలి.  తగిన పథకాలను  ప్రవేశపెట్టి కచ్చితంగా అమలు చేయాలి.  వ్యవసాయ భూమిని కాపాడుకోవడంతో పాటు సుస్థిర వ్యవసాయరంగం దిశగా  భవిష్యత్తులో  ప్రకృతిని కాపాడుకోగలుగుతాం.  దీంతో మానవ సమాజం ఆరోగ్యంగా ఉండడానికి  సరైన మార్గం ఏర్పడుతుంది.

కత్తెరసాల శ్రీనివాస్, ఓయూ సీనియర్ రీసెర్చ్ ఫెలో 

డాక్టర్  భీణవేణి రామ్ షెఫర్డ్,  ఓయూ సోషియాలజీ బిఓఎస్ చైర్మన్