ర్యాలంపాడు ఆయకట్టుకు మరోసారీ 2 టీఎంసీలే..!

  • ర్యాలంపాడు పూర్తి ఆయకట్టుకు నీళ్లు కష్టమే
  • సర్వేలు తప్పితే రిజర్వాయర్​కు రిపేర్లు లేవు
  • ముందు నుంచీ చిన్నచూపు చూసిన బీఆర్ఎస్ సర్కారు
  • మూడేండ్లుగా సగం ఆయకట్టుకే నీళ్లు
  • 1.36 లక్షల ఆయకట్టుపై ఎఫెక్ట్

నెట్టెంపాడు లిఫ్టులోని ర్యాలంపాడు రిజర్వాయర్​ పూర్తిస్థాయి ఆయకట్టుపై నీలి నీడలు వీడట్లేదు. సర్వేలు, తనిఖీల పేరుతో కాలయాపన చేస్తున్నారు తప్పితే రిపేర్లు చేయకపోవడంతో ఈసారీ రెండు టీఎంసీల నీరే నిల్వ ఉండనుంది.  ఫలితంగా1.36 లక్షల ఎకరాల ఆయకట్టు ప్రమాదంలో పడింది.

గద్వాల, వెలుగు : కృష్ణా బ్యాక్ వాటర్​ను ఎత్తిపోసే విధంగా నెట్టెంపాడు ఎత్తిపోతల పథకాన్ని రూపకల్పన చేశారు. ఇందులో భాగంగా ర్యాలంపాడు, గుడ్డం దొడ్డి, ముచ్చోని పల్లి, సంగాల, నాగర్ దొడ్డి రిజర్వాయర్లను నిర్మించారు. ఇందులో మొత్తం10 టీఎంసీల నీరు నిలువ చేసుకోవాల్సి ఉంది. నెట్టెంపాడు లిఫ్టులో అతిపెద్దదైన ర్యాలంపాడు రిజర్వాయర్​ను మొత్తం నాలుగు టీఎంసీల సామర్థ్యంతో నిర్మించారు. లెఫ్ట్ కెనాల్ కింద 25 వేల ఎకరాలు, రైట్ కెనాల్ ద్వారా 1.11 లక్షల ఎకరాల ఆయకట్టు ఉంది. కానీ, ప్రస్తుతం రెండు టీఎంసీలే నిల్వ ఉంచనుండడంతో సగం ఆయకట్టుకు నీళ్లిచ్చేది అనుమానమే.

ముందు నుంచీ చిన్నచూపే..

నెట్టెంపాడు ఎత్తిపోతల పథకంపై అప్పటి బీఆర్ఎస్ సర్కారు ముందు నుంచీ చిన్నచూపు చూసింది. కనీసం మెయింటెనెన్స్​కు నిధులు ఇవ్వకపోవడంతో రిజర్వాయర్లు, కెనాల్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ దెబ్బతిన్నాయి. బుంగలు పడి ర్యాలంపాడు రిజర్వాయర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కట్ట నుంచి నీళ్లు లీక్ అవుతున్నాయని 2019లోనే గుర్తించారు.  కానీ, ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంతో సీపేజ్​ మరింత పెరిగింది. రైతులు నిరసనలకు దిగడంతో  2021లో రిటైర్డ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఇంజినీర్ల బృందం రిజర్వాయర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను పరిశీలించింది. పూర్తిస్థాయిలో నింపితే కట్టకు ప్రమాదమని సామర్థ్యాన్ని సగానికి తగ్గించారు.  దీంతో గత మూడేండ్ల నుంచి రెండు టీఎంసీల నీటినే నింపుతున్నారు.

గట్టు లిఫ్ట్ ఓపెనైతే.. పరిస్థితి మరింత దారుణం

ర్యాలంపాడు రిజర్వాయర్​కు బుంగలు పడ్డప్పటినుంచి రిపేర్లు ఇప్పుడు అప్పుడంటూ కాలయాపన చేస్తూనే ఉన్నారు. రిపేర్లపై గంపెడాశలు పెట్టుకున్న రైతులకు చివరికి అడియాశలే మిగిలాయి. రిజర్వాయర్​కు రిపేర్లు చేయకపోవడంతో రైతులు తమ పంటలకు పూర్తిస్థాయిలో నీరు అందుతుందో లేదో అని అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. గట్టు మండలంలో నిర్మాణంలో ఉన్న గట్టు ఎత్తిపోతల పథకానికి ర్యాలంపాడ్ రిజర్వాయర్ నుంచే నీటిని ఎత్తిపోయాలి. దీంతో గట్టు లిఫ్ట్ ఓపెన్ చేస్తే పరిస్థితి మరింత దారుణంగా తయారయ్యేలా ఉంది.  

కట్ట బలహీనంగా ఉండడం వల్లే..!

రిటైర్డ్ ఇంజినీర్ల బృందం రిజర్వాయర్లను పరిశీలించి వెళ్లిన అనంతరం లీకేజీల కంట్రోల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కోసం ఇరిగేషన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఆఫీసర్లు చేపట్టిన సర్వేకు ఏడాది పట్టింది. సర్వే పనులను టెండర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ద్వారా హైదరాబాద్​కు చెందిన శ్రీసాయి గణేశ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కంపెనీకి అప్పజెప్పగా, బుంగలు ఎలా పడ్డాయి? ఎలా పూడ్చాలి? అనే అంశాలపై వారు రిపోర్ట్ ఇచ్చారు. ఈ రిపోర్ట్​ను ఆఫీసర్లు సీడీవో (సెంట్రల్ డిజైన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఆఫీస్)కు పంపారు. కానీ, సర్వే చేసి ఇన్నేండ్లు గడిచిపోయినా రిపేర్లు చేస్తామని గానీ, రిపోర్ట్​లో ఏముదని గానీ చెప్పని పరిస్థితి. కట్ట బలహీనంగా ఉండడం వల్లే సీపేజీ వచ్చిందని, ఉన్న రివీట్మెంట్ తొలగించి మళ్లీ కట్టాలని సూచించినట్లు సమాచారం. అదేవిధంగా కట్ట పైభాగం నుంచి గ్రౌటింగ్ చేయాలని సర్వే చేసిన కంపెనీ రిపోర్ట్ ఇచ్చినట్లు తెలుస్తోంది.

ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాలి

సర్వే కంప్లీట్ అయ్యింది. నివేదిక పంపించాం. ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. ఈసారి కూడా రెండు టీఎంసీలు నిలువ చేస్తాం. నెట్టెంపాడు ఎత్తిపోతల పథకంలోని ఆయకట్టుకు ఇబ్బందులు రాకుండా చూస్తాం. వచ్చే సీజన్ నాటికి నాలుగు టీఎంసీలు నీరు నిల్వ ఉండేలా చర్యలు తీసుకుంటున్నాం.

 ఈఈ వెంకటేశ్వరరావు, ర్యాలంపాడు రిజర్వాయర్ ఇన్​చార్జి