విమాన ప్రమాదం వెనుక రష్యా మిసైల్ దాడి..!

బకు: కజకిస్తాన్‎లో అజర్ బైజాన్ ఎయిర్ లైన్స్ విమానం కుప్పకూలడానికి రష్యానే కారణమనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. రష్యా ప్రయోగించిన మిసైల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ వల్లనే విమానం కూలిపోయి ఉంటుందని ఇంటర్నేషనల్ మీడియా కథనాలు పేర్కొంటున్నాయి. ఈ నెల 25న అజర్ బైజాన్‎లోని బాకు నుంచి రష్యాలోని గ్రోజ్నీకి వెళ్తున్న విమానం.. కజకిస్తాన్‎లోని అక్టౌ ఎయిర్ పోర్టులో ఎమర్జెన్సీ ల్యాండింగ్‎కు ప్రయత్నిస్తుండగా కుప్పకూలింది. ఈ ఘటనలో 38 మంది చనిపోయారు. అదే రోజు ఉక్రెయిన్‎పై రష్యా భీకర దాడులు చేసింది. 

ఆ టైమ్‎లో ఉక్రెయిన్ డ్రోన్ యాక్టివిటీ ఉన్న ఎయిర్ స్పేస్‎లోకి విమానం వెళ్లిందని, దీంతో అది ఉక్రెయిన్ డ్రోన్ అనుకుని రష్యా పొరపాటున మిసైల్ దాడి చేసి ఉంటుందనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మరోవైపు విమానం కుప్పకూలిన తర్వాత రెండు ముక్కలైంది. ఆ శిథిలాలను పరిశీలిస్తే, వాటిపై రంధ్రాలు ఉన్నాయి. ఏదో షార్ప్ ఆబ్జెక్ట్ ఢీకొట్టిన ఆనవాళ్లు ఉన్నాయి. మిసైల్ ఢీకొడితేనే ఇలాంటి డ్యామేజీ జరుగుతుందని నిపుణులు చెబుతున్నారు. ఉక్రెయిన్‎పై దాడిలో భాగంగా రష్యా యాంటీ ఎయిర్ క్రాఫ్ట్ మిసైల్ సిస్టమ్ పొరపాటున విమానాన్ని పేల్చి వేసి ఉంటుందని అంటున్నారు. ఇటీవల రష్యాలోని గ్రోజ్నీపై ఉక్రెయిన్ డ్రోన్ దాడులు చేసింది. దీంతో రష్యా అక్కడ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ ఏర్పాటు చేసింది.

జపాన్ ​ఎయిర్​ లైన్స్‎పై సైబర్ దాడి

జపాన్ ఎయిర్ లైన్స్‎పై గురువారం సైబర్ అటాక్ జరిగింది. ఉదయం సంస్థ సిస్టమ్స్ పని చేయలేదు. కొన్ని గంటల్లోనే సమస్యను పరిష్కరించా మని జపాన్ ఎయిర్ లైన్స్ తెలిపింది. సైబర్ దాడి వల్ల 20 డొమెస్టిక్ ఫ్లైట్స్ ఆలస్యంగా నడిచాయని పేర్కొంది. తమ దగ్గరి నుంచి సైబర్ నేరగాళ్లకు ఎలాంటి డేటా లీక్ కాలేదని చెప్పింది.