మాస్కో: రష్యా, ఉక్రెయిన్ మధ్య యుద్ధం పతాకస్థాయికి చేరింది. ఈ రెండు దేశాలు రికార్డు స్థాయిలో పరస్పరం స్ట్రైక్ డ్రోన్లతో దాడులు చేసుకుంటున్న పరిస్థితి నెలకొంది. శనివారం రాత్రి 145 స్ట్రైక్ డ్రోన్లతో రష్యా ఉక్రెయిన్పై విరుచుకుపడింది. ఉక్రెయిన్ను టార్గెట్ చేస్తూ రష్యా స్ట్రైక్ డ్రోన్ల వర్షం కురిపించింది.
ఒక్క రాత్రిలో ఇన్ని డ్రోన్లతో దాడి చేయడం రష్యా, ఉక్రెయిన్ యుద్ధంలో ఇదే తొలిసారి కావడం గమనార్హం. రష్యా 145 స్ట్రైక్ డ్రోన్లతో గత రాత్రి (శనివారం, నవంబర్ 09, 2024) దాడి చేసినట్లు ఉక్రెయిన్ అధ్యక్షుడు వ్లాదిమిర్ జెలెన్ స్కీ ఆదివారం ప్రకటించారు. రష్యా డ్రోన్ల దాడికి ఉక్రెయిన్ కూడా బదులిచ్చింది.
— ??The Informant (@theinformant_x) November 10, 2024
రష్యా రాజధాని నగరం మాస్కోను టార్గెట్ చేసి ఉక్రెయిన్ 34 డ్రోన్లతో దాడి చేసింది. ఈ డ్రోన్లను విజయవంతంగా కూల్చేసినట్లు రష్యా సైన్యం చెబుతోంది. ఉక్రెయిన్ చేసిన ఈ డ్రోన్ల దాడులతో మాస్కోలోని మూడు విమానాశ్రయాలను తాత్కాలిక మూసివేశారు. 52 సంవత్సరాల వయసున్న ఒక మహిళ ఈ డ్రోన్ల దాడిలో గాయపడింది. మాస్కో ప్రాంతంలోని స్టాన్ ఒవియెలోని ఒక గ్రామంలో రెండు ఇళ్లు అగ్నికి ఆహుతయినట్లు రాయిటర్స్ రిపోర్ట్ చేసింది.
70 ఉక్రెయిన్ డ్రోన్లు రష్యాను టార్గెట్ చేసి వచ్చినట్లు రష్యా రక్షణ మంత్రిత్వ శాఖ తెలిపింది. ఈ 70 డ్రోన్లలో 34 డ్రోన్లు మాస్కో ప్రాంతంలో, మిగిలిన డ్రోన్లను బ్రయాన్స్క్, ఓర్లోవ్, కలుగ, తులా, కుర్స్క్ ప్రాంతాల్లో గుర్తించినట్లు పేర్కొంది. 2022లో రష్యా, ఉక్రెయిన్ మధ్య యుద్ధ వాతావరణం నెలకొన్న నాటి నుంచి ఉక్రెయిన్ ఇంత పెద్ద స్థాయిలో డ్రోన్లతో దాడులకు దిగడం ఇదే తొలిసారి.