ఉక్రెయిన్​పై రష్యా భీకర దాడి

  • వంద డ్రోన్లు, వంద మిసైళ్లతో అటాక్​
  • పవర్​ ప్లాంట్లు​, ఆయిల్​ రిఫైనరీలే లక్ష్యం 
  • ముగ్గురు ఉక్రెయిన్​ పౌరులు మృతి
  • భారీ పేలుళ్లతో భయాందోళనలో ప్రజలు
  • రష్యాపై ఉక్రెయిన్ ​డ్రోన్​ అటాక్​

కీవ్: రష్యా, ఉక్రెయిన్​ మధ్య మళ్లీ ఉద్రిక్త వాతావరణం నెలకొన్నది. ఉక్రెయిన్​పై రష్యా సోమవారం డ్రోన్లు, మిస్సైల్స్​తో భీకర దాడికి దిగింది. ఇంధన మౌలిక వసతులే లక్ష్యంగా వంద డ్రోన్లు, వంద క్షిపణులను ప్రయోగించింది. ఈ దాడిలో ముగ్గురు ఉక్రెయిన్​పౌరులు మృతిచెందారు. పశ్చిమ లుట్స్క్, తూర్పు డ్నిప్రో, దక్షిణ జపోరిజ్జియా ప్రాంతాల్లో ఈ మరణాలు నమోదయ్యాయి.

లుట్స్క్‌‌‌‌‌‌‌‌ నగరంలో ఒక అపార్ట్‌‌‌‌‌‌‌‌మెంట్ దెబ్బతిన్నది. ఆదివారం అర్ధరాత్రి నుంచి ప్రారంభమైన దాడి.. సోమవారం మధ్యాహ్నం వరకు కొనసాగింది. బాంబు పేలుళ్ల చప్పుళ్లతో ప్రజలు భయాందోళనకు గురయ్యారు. కాగా, ఈ దాడిని ఉక్రెయిన్ కూడా​ధ్రువీకరించింది.

పవర్, వాటర్​సప్లైకి అంతరాయం

క్రూయిజ్, బాలిస్టిక్​ మిస్సైల్స్ దాడి తర్వాత ఉక్రెయిన్​ తూర్పు,  ఉత్తర, దక్షిణ, మధ్య ప్రాంతాలపై అనేక రకాల డ్రోన్లు విరుచుకుపడ్డాయని ఉక్రెయిన్​ ఎయిర్​ఫోర్స్​ తెలిపింది. కీవ్​లో భారీ పేలుళ్ల శబ్దాలు వినిపించాయని పేర్కొన్నది. ఈ దాడితో విద్యుత్​, నీటి సరఫరాకు అంతరాయం కలిగిందని కీవ్​ మేయర్​ చెప్పారు.ఈ నేపథ్యంలో ప్రజలు ఆశ్రయం పొందేందుకు ఇప్పటికే ఏర్పాటు చేసిన షెల్టర్ ​టైప్​ ఇన్విన్సిబిలిటీ పాయింట్లను ఓపెన్​ చేస్తున్నట్టు వివరించారు.

సాయం చేయండి: జెలెన్​స్కీ

తమ దేశంపైకి రష్యా వదులుతున్న డ్రోన్లు, క్షిపణులను కూల్చేసేందుకు సాయం చేయాలని యురోపియన్ ​దేశాలను ఉక్రెయిన్ ​ప్రెసిడెంట్ జెలెన్ స్కీ అభ్యర్థించారు. ఈమేరకు ఓ వీడియో సందేశం రిలీజ్​ చేశారు. ‘‘ఈ ఉదయం నుంచి దాదాపు 100కు పైగా డ్రోన్లు, 100 మిస్సైల్స్​తో రష్యా దాడి చేస్తున్నది. ఇంధన మౌలిక సదుపాయాలను లక్ష్యంగా చేసుకుని విరుచుకుపడుతున్నది. ఈ దాడిలో ప్రాణనష్టం కూడా జరిగింది. చాలాచోట్ల విద్యుత్, నీటి సరఫరాకు అంతరాయం ఏర్పడింది.

మా బలగాలు దాడిని అడ్డుకుంటున్నాయి” అని పేర్కొన్నారు. ‘‘యురోపియన్ దేశాలు ఎయిర్​ డిఫెన్స్​కు సహకారం అందిస్తే ఇంకా ఎన్నో ప్రాణాలను కాపాడగలం. మిడిల్​ఈస్ట్​లో దేశాలు ఐకమత్యంగా కలిసి పనిచేసినప్పుడు.. మన యురోపియన్​లో ఎందుకు పనిచేయకూడదు? ఎక్కడైనా ప్రాణం ఒక్కటే కదా? ” అని వ్యాఖ్యానించారు.

రష్యాపైకి ఉక్రెయిన్ ​డ్రోన్లు

ఉక్రెయిన్​పై రష్యా విరుచుకుపడ్డ సమయంలోనే తమ దేశంపై ఉక్రెయిన్​ డ్రోన్లతో దాడి చేసిందని రష్యా తెలిపింది. ఈ దాడిలో సరటోవ్​ రీజియన్​లో నలుగురు గాయపడ్డట్టు పేర్కొన్నది. ఎంగెల్స్​నగరంలోని ఓ బిల్డింగ్​పై కూడా దాడి జరిగినట్టు తెలిపింది. ఈ బిల్డింగ్​పై ఇంతకుముందు కూడా దాడి జరిగిందని, ఇందులో మిలిటరీ ఎయిర్​ఫీల్డ్​ ఉందని పేర్కొన్నది.

ఆదివారం రాత్రిపూట నుంచి సోమవారం ఉదయం వరకు రష్యాలోని సరటోవ్, యారోస్లావల్ ప్రాంతాలతో సహా 8 రష్యన్ ప్రాంతాలపై మొత్తం 22 ఉక్రేనియన్ డ్రోన్లను తాము అడ్డుకున్నామని రష్యా రక్షణ మంత్రిత్వ శాఖ వర్గాలు వెల్లడించాయి.