క్రిస్మస్ వేళ.. ఉక్రెయిన్ పై రష్యా భీకర దాడి

  • 70 మిసైళ్లు, 100 డ్రోన్లు ప్రయోగం

 కీవ్/మాస్కో: క్రిస్మస్ పండగ వేళ ఉక్రెయిన్​పై రష్యా భీకర దాడులకు పాల్పడింది. బుధవారం ఒక్క రోజే ఏకంగా 70 మిసైళ్లు, 100 డ్రోన్లతో విరుచుకుపడింది. దేశవ్యాప్తంగా పవర్ సప్లైని దెబ్బతీయడమే లక్ష్యంగా ఈ దాడులు జరిగినట్టు ఉక్రెయిన్ ఆరోపించింది. నల్ల సముద్రం నుంచి రష్యా ప్రయోగించిన క్రూయిజ్, బాలిస్టిక్ మిసైళ్లు ఖార్కీవ్ సిటీతోపాటు ప్రెసిడెంట్ జెలెన్ స్కీ సొంత నగరం కిరివియ్ రిహ్ లోని జనావాసాల్లోనూ పడ్డాయని, ఈ దాడుల్లో అనేక మంది చనిపోయారని సైనిక అధికారులు తెలిపారు. 

రష్యా దాడులతో అనేక ప్రాంతాల్లో కరెంట్ సరఫరాకు ఆటంకం కలుగుతోందని, వినియోగం తగ్గిస్తూ సప్లై పునరుద్ధరణకు చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. ఈ దాడులపై ఉక్రెయిన్ ప్రెసిడెంట్ జెలెన్ స్కీ స్పందిస్తూ.. క్రిస్మస్ పండగ వేళ రష్యా అమానవీయ దాడులకు పాల్పడిందని మండిపడ్డారు. ఎనర్జీ గ్రిడ్​ను దెబ్బతీయడమే లక్ష్యంగా 70కిపైగా మిసైళ్లు, 100 డ్రోన్లతో రష్యా దాడి చేసిందన్నారు. 

ఇతర దేశాలు పండగ జరుపుకుంటుంటే ఉక్రెయిన్ ప్రజలు మాత్రం భయంతో గడుపుతున్నారని మానవ హక్కుల సంస్థ అంబుడ్స్ మన్ దిమిత్రో లుబినెట్స్ ఆవేదన వ్యక్తం చేశారు. కాగా, ఉక్రెయిన్ బుధవారం రష్యాపైకి ప్రయోగించిన 59 డ్రోన్లను కూల్చేశామని రష్యా రక్షణ శాఖ ప్రకటించింది. అయితే, నల్ల సముద్రం నుంచి ఉక్రెయిన్ పైకి క్షిపణి దాడులపై మాత్రం ఎలాంటి వివరాలు వెల్లడించలేదు.