రుద్రూర్‌‌‌‌ వ్యవసాయ పాలిటెక్నిక్‌‌‌‌ కళాశాలలో.. వీడని స్టూడెంట్‌‌‌‌‌‌‌‌ మృతి మిస్టరీ

  • తల్లిదండ్రులు రాకుండానే పోస్టుమార్టంకు మృతదేహం తరలింపు
  • సీసీటీవీ పుటేజీ మాయం వెనుక ఆంతర్యం ఏంటీ?
  • కళాశాల ప్రిన్సిపాల్‌‌‌‌‌‌‌‌, వార్డెన్‌‌‌‌‌‌‌‌పై అనుమానాలు
  • మీడియా,విద్యార్థి సంఘాలను అనుమతించని అధికారులు 
  • బాధ్యులను శిక్షించాలన్న  కేటీఆర్‌‌‌‌‌‌‌‌

వర్ని,వెలుగు: నిజామాబాద్‌‌‌‌ జిల్లా రుద్రూర్‌‌‌‌ వ్యవసాయ పాలిటెక్నిక్‌‌‌‌ కళాశాలలో శనివారం మృతిచెందిన మొదటి సంవత్సరం స్టూడెంట్‌‌‌‌ రక్షిత (15) మృతి మిస్టరీగా మారింది.  తోటి స్టూడెంట్స్‌‌‌‌తో రాత్రి 11 గంటల వరకు చదువుకున్న ఆమె తెల్లారే సరికి విగతజీవిగా కనిపించడం సందేహాలకు తావిస్తుంది.  ఆగష్టు 27 న  కళాశాలలో చేరిన నాలుగు రోజుల్లోనే శవమై తేలడంపై పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.

మృతిపై అనుమానాలు

రక్షితది బలవన్మరణమే అయితే తల్లిదండ్రులు వచ్చే వరకు ఆగకుండా మృతదేహాన్ని హాస్పిటల్‌‌‌‌కు ఎందుకు తరలించాల్సి వచ్చిందన్న ప్రశ్న తలెత్తుతోంది. తాము వచ్చే వరకు మృతదేహాన్ని తరలించవద్దని రక్షిత తల్లిదండ్రులు  సీఐ జయేశ్‌‌‌‌రెడ్డిని కోరినా బలవంతంగా ఎందుకు తరలించాల్సి వచ్చింది,  రుద్రూర్‌‌‌‌ ఎస్‌‌‌‌ఐ సాయన్న రాకముందే  సీఐ దర్యాప్తు పేరుతో కళాశాల సిబ్బందితో చర్చలు జరపడం,  మీడియాను, విద్యార్థి సంఘాల నాయకులకు సమాచారం ఇవ్వకుండా  మృతదేహాన్ని  తరలించడంపై  పలువురు అనుమానాలు వ్యక్తం చేశారు.   రక్షిత తల్లిదండ్రులు, బంధువులు  ఆందోళన దిగడంతో  తప్పని పరిస్థితులో సీసీటీవీ పుటేజీ చూపించారు. అందులో ఎలాంటి దృశ్యాలు రికార్డు కాకపోవడం  తమకు మరిన్ని అనుమానాలు కలుగుతున్నాయని బాధితులు తెలిపారు. 

ప్రిన్సిపాల్‌‌‌‌, వార్డెన్‌‌లను సస్పెండ్‌‌‌‌ చేయాలి

రుద్రూర్‌‌‌‌ వ్యవసాయ పాలిటెక్నిక్‌‌‌‌ కళాశాల ప్రిన్సిపాల్‌‌‌‌ బాలాజీనాయక్‌‌‌‌, వార్డెన్‌‌‌‌ నరేందర్‌‌‌‌లను వెంటనే సస్పెండ్‌‌‌‌ చేయాలని స్టూడెంట్స్‌‌‌‌ తల్లిదండ్రులు, విద్యార్థి సంఘాల నాయకులు డిమాండ్‌‌‌‌ చేస్తున్నారు.  ఉన్నతాధికారులు విచారణ జరిపితే అతడి వ్యవహారాలు బయటపడతాయంటున్నారు.  

కళాశాల ముట్టడికి యత్నం

వర్ని,వెలుగు: నిజామాబాద్‌‌‌‌‌‌‌‌ జిల్లా రుద్రూర్‌‌‌‌‌‌‌‌ వ్యవసాయ పాలిటెక్నిక్‌‌‌‌‌‌‌‌ కళాశాల ముట్టడికి విద్యార్థి ఐక్య కార్యాచరణ కమిటీ  (జేఏసీ) ఆధ్వర్యంలో సోమవారం ముట్టడికి యత్నించగా పోలీసులు అడ్డుకున్నారు.  స్టూడెంట్‌‌‌‌‌‌‌‌  మృతిపై సీబీఐ చే విచారణ జరిపించాలని వారు డిమాండ్‌‌‌‌‌‌‌‌ చేశారు. 

బాధిత కుటుంబానికి న్యాయం జరగాలి: ట్విట్టర్‌‌‌‌‌‌‌‌లో కేటీఆర్‌‌‌‌‌‌‌‌

 రక్షిత మృతిపై బీఆర్‌‌‌‌‌‌‌‌ఎస్‌‌‌‌‌‌‌‌ వర్కింగ్‌‌‌‌‌‌‌‌ ప్రసిడెంట్‌‌‌‌‌‌‌‌ కేటీఆర్‌‌‌‌‌‌‌‌ ట్విట్టర్‌‌‌‌లో  స్పందించారు.  స్టూడెంట్​​ కుటుంబానికి బీఆర్‌‌‌‌‌‌‌‌ఎస్‌‌‌‌‌‌‌‌ పార్టీ అండగా ఉంటుందన్నారు. రక్షిత మృతిపై విచారణ జరిపి బాధ్యులను కఠినంగా శిక్షించాలని డిమాండ్‌‌‌‌‌‌‌‌ చేయడం సోషల్‌‌‌‌‌‌‌‌ మీడియాలో వైరల్‌‌‌‌‌‌‌‌ అవుతోంది.