చేతిలో మూడు వందల రూపాయలతో ఇల్లు విడిచి వెళ్లిపోయిన ఓ పదిహేనేండ్ల అమ్మాయి. ఇప్పుడు కోట్లు విలువ చేసే ఒక జువెలరీ బ్రాండ్‌కి యజమాని. మూడు పూటలా కడుపునిండా తినడానికి ఇబ్బంది పడిన ఆ అమ్మాయే ఇప్పుడు ఎంతోమందికి ఉపాధిని ఇస్తోంది. ఏటా నలభై కోట్లకు పైగా సంపాదిస్తోంది. చిను కలా తన కలలను సాకారం చేసుకునేందుకు మొదలుపెట్టిన రూబన్స్ కంపెనీ ఫ్యాషన్ రంగంలో టాప్ జువెలరీ కంపెనీల్లో ఒకటిగా ఎదిగింది.
చిను కలా 1981 అక్టోబర్‌లో పుట్టింది. 15 ఏండ్ల వయసులో కుటుంబంలో గొడవల వల్ల ఇంటి నుంచి వెళ్లిపోయింది. అప్పుడామె చేతిలో 300 రూపాయలు, కాళ్లకు ఒక జత చెప్పులు, రెండు సల్వార్ సూట్లు మాత్రమే ఉన్నాయి. ఏం పని చేయాలి? భవిష్యత్తు ఏంటి? ఏమీ తెలియదు. రెండు రోజులు ముంబై రైల్వే స్టేషన్‌లో పడుకుని, రెండు పూటలా వడపావ్ మాత్రమే తిని కడుపు నింపుకుంది. మూడో రోజు ఉద్యోగం దొరికింది. ఇంటింటికి వెళ్లి కోస్టర్లు, కత్తులు.. లాంటివి అమ్మే సేల్స్‌గర్ల్‌గా జీవితం మొదలుపెట్టింది.
ఎందుకంటే... ఆమె వయసుకు, చదువుకు అంతకుమించి ఉద్యోగం దొరకలేదు. ఆ ఉద్యోగమే ఆమెను కష్ట కాలంలో ఆదుకుంది. ఆమె రోజంతా చేసిన సేల్స్‌కి అదే రోజు సాయంత్రం కమీషన్ ఇచ్చేవాళ్లు. ఒక్క ప్రొడక్ట్ అమ్మితే 20 రూపాయలు వచ్చేవి. మొదటి రోజు కేవలం మూడు వస్తువులు మాత్రమే అమ్మగలిగింది. వాటితోనే ఆమెకు కావాల్సిన వస్తువులు కొనుక్కుంది. రోజూ ఫుడ్‌కి కూడా ఆ కమీషన్ మీదే ఆధారపడేది.
అలా రోజులు గడుస్తున్నాయి. కానీ.. ఆదాయం పెరగలేదు. దాంతో ఒక రెస్టారెంట్‌లో వెయిట్రెస్‌గా చేరింది. ఉదయం నుంచి సాయంత్రం వరకు సేల్స్ గర్ల్‌గా చేసి, సాయంత్రం నుంచి రాత్రి వరకు రెస్టారెంట్‌లో పనిచేసేది. కొన్నేండ్లు గడిచాక టాటా ఇండికామ్ ప్రాంచైజీలో కస్టమర్ కేర్ ఎగ్జిక్యూటివ్‌గా చేరింది. ఆ ఆఫీస్‌లోనే ఆమె భర్త అమిత్ కలా పరిచయమయ్యాడు.
బిగ్ బ్రేక్
చిను 2004లో పెండ్లి చేసుకుంది. ఆ తర్వాత 2006లో ‘భరత్ అండ్ డోరిస్’లో మేకప్ ఆర్టిస్ట్ కోర్సు చేసింది. ఆ తర్వాత ఇంట్లోనే సొంతంగా ఒక సెలూన్ పెట్టుకుంది. కష్టపడి పనిచేయడంతో సెలూన్‌కు వచ్చేవాళ్ల సంఖ్య రోజురోజుకూ పెరిగింది. అదే టైంలో ఆమెకు ‘గ్లాడ్రాగ్స్ మిసెస్ ఇండియా’ పోటీల గురించి తెలిసింది. అందులో పాల్గొనాలని 2007లో నిర్ణయించుకుంది. అందులో పార్టిసిపేట్ చేసి టాప్ ఫైనలిస్ట్‌లో చోటు దక్కించుకుంది. అది ఆమె లైఫ్‌కు బిగ్ బ్రేక్ అనే చెప్పాలి.
జువెలరీ
గ్లాడ్రాగ్స్ మిసెస్ ఇండియాలో పాల్గొన్నప్పుడు ఆమెకు ఫ్యాషన్ పరిశ్రమలో జువెలరీ ఇంపార్టెన్స్ గురించి అర్థమైంది. ఒక జువెలరీ వ్యక్తి రూపాన్ని ఎలా మారుస్తుందో తెలుసుకుంది. అందుకే జువెలరీ బిజినెస్ మొదలుపెట్టాలని నిర్ణయం తీసుకుంది. అప్పుడే సొంత ఫ్యాషన్ జువెలరీ బ్రాండ్ ‘రూబన్స్ యాక్సెసరీస్’ మొదలుపెట్టింది. జువెలరీ బిజినెస్ మొదలుపెట్టాలన్న ఆలోచన 2007లో వస్తే... దాన్ని ఇంప్లిమెంట్ చేయడానికి మరో ఏడేండ్లు పట్టింది. చివరకు 2014లో బిజినెస్ మొదలుపెట్టింది.
మొదట్లోనే అడ్డంకి
బిజినెస్ పెట్టిన మొదట్లోనే ఒక పెద్ద అడ్డంకి ఎదురైంది. అదేంటంటే.. అప్పట్లో రిటైల్ బిజినెస్ మాత్రమే ఎక్కువగా ఉండేది. ఆన్‌లైన్‌లో అమ్మకాలు చాలా తక్కువ. అలాంటి టైంలో ఎక్కువగా మాల్స్‌లోనే జువెలరీ అమ్మకాలు జరిగేవి. కానీ.. ఆమెకు బిజినెస్ పెట్టడానికి మంచి లొకేషన్ దొరకలేదు. దాంతో ఒక మాల్‌లో షాప్ పెట్టాలి అనుకుంది. అయితే.. మాల్‌లో మంచి లొకేషన్‌లో స్టోర్ పెట్టడానికి మూడేండ్లు ఎదురు చూడాల్సి వచ్చింది. అంతేకాదు.. మాల్‌లో షాప్ పెట్టడం చాలా ఖర్చుతో కూడుకుంది.
భారీగా డిపాజిట్ చేయాల్సి వచ్చింది. అంత డబ్బు ఆమె దగ్గర లేదు. సంపాదించిన మొత్తం డబ్బుని ప్రొడక్ట్స్ డిజైనింగ్, మేకింగ్ కోసం ఖర్చు చేసింది. షాపులో అమ్మడానికి కావాల్సినంత స్టాక్ మాత్రమే ఉంది. దాంతో డిపాజిట్ చెల్లించడానికి నెల రోజులు టైం అడిగింది. ప్రొడక్ట్స్ మీద ఆమెకు పూర్తి నమ్మకం ఉంది. నెల రోజుల్లో ప్రొడక్ట్స్ అమ్ముడుపోయి మళ్లీ స్టాక్ కొనడానికి, డిపాజిట్ చేయడానికి సరిపడా డబ్బు వస్తుందని నమ్మింది చిను.
ఆమె అనుకున్నట్టుగానే కస్టమర్లు డిజైన్స్‌ని బాగా ఇష్టపడ్డారు. సేల్స్ పెరిగాయి. నెల రోజుల్లోనే రూబన్స్ యాక్సెసరీస్ లాభాలతో మాల్ మేనేజ్‌మెంట్‌కు డిపాజిట్ ఇచ్చేసింది. రికార్డ్ స్థాయి అమ్మకాలు జరగడంతో చాలా తక్కువ టైంలోనే మరికొన్ని స్టోర్స్ పెట్టారు. ఇప్పుడు రూబెన్స్ జువెలరీ, యాక్సెసరీస్ ఇండియన్స్ పెండ్లిళ్లలో, ఈవెంట్లలో తళుక్కుమంటున్నాయి. ముఖ్యంగా సంప్రదాయ డిజైన్‌లను లగ్జరీ కలెక్షన్స్‌గా అందిస్తున్నారు. అందుకే మార్కెట్‌లో వీళ్ల జువెలరీకి డిమాండ్ బాగా పెరిగింది.
ఆన్‌లైన్‌లో ...
స్టోర్‌ల ద్వారా ఆఫ్‌లైన్ బ్రాండ్‌గా బాగా పేరొచ్చిన తర్వాత రూబన్స్ ఆన్‌లైన్‌లో సేల్స్ చేయడం
మొదలుపెట్టింది. ప్రస్తుతం కొచ్చిలోని లులు మాల్‌లోని కంపెనీ స్టోర్‌తో పాటు మింత్రా, ఫ్లిప్‌కార్ట్ లాంటి ఆన్‌లైన్ పోర్టల్స్ ద్వారా రిటైల్ చేస్తోంది. ఈ బ్రాండ్‌కి సొంత వెబ్‌సైట్ కూడా ఉంది. దాన్లో కూడా ప్రొడక్ట్స్ అమ్ముతున్నారు. దేశంలోని టైర్–II , III సిటీల్లో ఈ ప్రొడక్ట్స్ అందుబాటులో ఉన్నాయి.
తక్కువ ధర
మార్కెట్‌లో తక్కువ టైంలోనే బ్రాండ్‌కి ఇంతలా పేరు రావడానికి కారణం ఏంటని చినుని అడిగితే.. ‘క్వాలిటీ, రీజనబుల్ ప్రైస్’ అని చెప్తుంది. ఈ రెండిటి వల్లే వాళ్ల ప్రొడక్ట్‌కి మార్కెట్‌లో డిమాండ్ పెరిగింది. కంపెనీ మార్కెటింగ్ కోసం పెద్దగా ఖర్చు చేయదు. అయినా జనాలకు ఈ ప్రొడక్ట్స్ గురించి బాగా తెలుసు. దానికి కారణం మౌత్ పబ్లిసిటీ. కొన్న వాళ్లకు ప్రొడక్ట్ క్వాలిటీ, ధర నచ్చితే వాళ్లు మళ్లీ రావడమే కాకుండా మరో నలుగురికి చెప్తారు. అదే చిను బిజినెస్ సీక్రెట్. పైగా రూబన్స్‌లో ఎప్పుడూ కొత్త డిజైన్స్ వస్తుంటాయి. అంతేకాదు.. ప్రతి ఏడాది రెండుసార్లు లిమిటెడ్ ఎడిషన్ కలెక్షన్స్ అందిస్తారు. అందుకోసం ప్రత్యేకంగా ఇన్‌హౌస్ క్రియేటివ్ టీమ్ కూడా ఉంది. మరిచిపోయిన సంప్రదాయ జువెలరీని మళ్లీ మార్కెట్‌లోకి తీసుకురావడం వల్ల ఈ జనరేషన్ వాళ్లు బాగా ఇష్టపడుతున్నారు.
అంచెలంచెలుగా ...
చిను స్టోర్ పెట్టిన మొదటి ఏడాది 2014లో 12 లక్షల రూపాయల వార్షిక అమ్మకాలు జరిగాయి. కేవలం నాలుగేండ్లలోనే అది కోట్లకు చేరింది. 2018–19 సంవత్సరంలో 7.01 కోట్ల రూపాయల విలువైన జువెలరీని అమ్మారు. 2021 నాటికి పాన్ ఇండియా మార్కెట్‌లోకి దూసుకుపోవాలనే లక్ష్యంతో అమ్మకాలను పెంచారు. రూబన్స్ యాక్సెసరీస్ 2024లో100 కోట్ల రూపాయల వార్షిక ఆదాయాన్ని సాధించాలనే లక్ష్యంతో పనిచేస్తోంది. ప్రస్తుతం కుందన్, పోల్కి, హ్యాండ్‌క్రాఫ్ట్ హెరిటేజ్, హ్యాండ్ పెయింటెడ్ జువెలరీ, నెక్లెస్, ఇయర్ రింగ్స్, బ్యాంగిల్స్ లాంటి వాటి అమ్మకాల మీద ఎక్కువ దృష్టి పెట్టింది.
అగ్ని ప్రమాదం
సక్సెస్ అనేది కొన్నేండ్ల కల. అలాంటి కలను సాకారం చేసుకున్నాక అది బూడిదగా మారితే తట్టుకోవడం కష్టం. కానీ.. చిను తట్టుకుని నిలబడింది. ఆ ఘటన గురించి ఆమెని అడిగితే ‘‘2019 జూలై 4 ఉదయం, 6 గంటలకు ఆఫీస్ హెడ్ ఆఫ్ ఆపరేషన్ నుంచి ఫోన్ కాల్ వచ్చింది. ‘ఫైర్ యాక్సిడెంట్ జరిగింది. ఆఫీస్ మంటల్లో తగలబడిపోతోంది’ అని. కొద్దిసేపు నా మైండ్ పనిచేయలేదు. ఆ తరువాత తేరుకున్నా. టైం వేస్ట్ చేయకుండా కొన్నేండ్ల నా కష్టం బూడిదగా మారడాన్ని చూడటానికి పరుగెత్తా. మా ఆఫీస్‌లు, గోడౌన్‌లు అన్నీ ఒకే చోట ఉన్నాయి. అక్కడే మా ప్రొడక్ట్స్‌ని స్టోర్ చేశాం. చూస్తుండగానే అన్ని కాలి బూడిదయ్యాయి. కానీ.. నేను మాత్రం ఇది అంతం కాదు.
పెద్ద అడ్డంకి మాత్రమే అనుకున్నా. ఈ పరిస్థితిని ఎలాగైనా అధిగమించాలకున్నా. మా అన్ని వనరులు, ఇన్వెంటరీని కోల్పోయాం. కానీ.. రూబన్స్ టీం నాతోనే ఉంది. అదే రాత్రి, నా టీమ్‌ని ‘ఇవి కష్ట సమయాలు. మనందరం కలిసి వాటిని అధిగమించాలి. వెనక్కి తగ్గేది లేదు’ అని చెప్పా. ఆఫీస్ కాలిపోయింది. దాంతో తెలిసినవాళ్ల నుంచి కొన్ని ల్యాప్‌టాప్‌లు తెచ్చి, ఇంటి నుంచే పని మొదలుపెట్టాం. నాలుగు నెలల్లో అగ్నిప్రమాదానికి ముందు ఉన్న దానికంటే రెండు రెట్లు ఎక్కువ ప్రొడక్ట్స్ తెచ్చి వాటిని అమ్మగలిగాం. అందుకోసం నా టీమ్ చాలా కష్టపడాల్సి వచ్చింది. ఇది రాత్రికి రాత్రే వచ్చిన సక్సెస్ కాదు. ఎన్నో పరీక్షలు ఎదుర్కొని నిలబడితే వచ్చిన సక్సెస్” అని చెప్పిందామె.
ప్రత్యేకతలు
మింత్రా ఉత్తమ జువెలరీ బ్రాండ్‌గా గుర్తించింది. ఫ్రాంచైజ్ ఇండియా వాళ్లు రూబన్స్ యాక్సెసరీస్‌కు డెబ్యూటెంట్ రిటైలర్ అవార్డు ఇచ్చారు. తక్కువ ధరలో దొరుకుతాయి. అయినా.. క్వాలిటీ, గ్లామర్ విషయంలో కాంప్రమైజ్ కావాల్సిన అవసరం లేదు. మారుతున్న వినియోగదారుల ప్రవర్తన, కొనుగోలు అలవాట్లను అనుగుణంగా డిజైన్స్‌లో మార్పులు చేస్తుంది.
కష్టాల నుంచి నేర్చుకుంది
నీ సక్సెస్‌కి కారణమేంటని చినుని ఎవరు అడిగినా ‘నా కష్టాలు నేర్పిన అనుభవమే నాకు సక్సెస్ తెచ్చిపెట్టింద’ని చెప్తుంది. ఎందుకంటే.. ఆమె ఉద్యోగం చేసేటప్పుడు చాలా ఇబ్బందులు ఎదుర్కొంది. కొన్నిసార్లు కడుపునిండా తినడానికి కూడా ఇబ్బంది పడేది. సేల్స్ గర్ల్‌గా ఉద్యోగం చేస్తున్నప్పుడే వ్యాపారం చేయడం రాకెట్ సైన్స్ కాదనే విషయం తెలుసుకుంది. జనాల అవసరాలను తీర్చే వస్తువులకు ఎప్పుడూ డిమాండ్ ఉంటుందని గ్రహించింది. పెద్దగా చదువుకోలేదు. కాబట్టి పెద్ద పెద్ద ఉద్యోగాలు రావు. అందుకని ఏదైనా బిజినెస్ పెట్టి సక్సెస్ కావాలని డిసైడ్ అయ్యింది.