నాగర్​ కర్నూల్​లో హోరాహోరి

బీజేపీ నుంచి పోతుగంటి భరత్​
బీఆర్ఎస్, బీఎస్పీ పొత్తుతో రంగంలోకి ఆర్ఎస్​ప్రవీణ్​కుమార్​ 
బలమైన అభ్యర్థిని దింపే యోచనలో కాంగ్రెస్​

నాగర్​ కర్నూల్, వెలుగు: వచ్చే లోక్​సభ ఎన్నికల్లో నాగర్​కర్నూల్​ (ఎస్సీ) నియోజకవర్గంలో త్రిముఖ పోరు తప్పేలా లేదు. ప్రధానంగా మూడు పార్టీల మధ్య హోరాహోరీ జరిగే అకాశాలు కనిపిస్తున్నాయి. కాంగ్రెస్​ నుంచి టికెట్ రేసులో మాజీ ఎంపీ మల్లు రవి, ఏఐసీసీ కార్యదర్శి సంపత్​కుమార్​తో పాటు టీపీసీసీ అధికార ప్రతినిధి చారగొండ వెంకటేశ్​ఉన్నారు. బీఆర్ఎస్ ​నుంచి తమ పార్టీలో చేరిన సిట్టింగ్ ​ఎంపీ పోతుగంటి రాములు కొడుకు పోతుగంటి భరత్​ప్రసాద్​ను బీజేపీ బరిలోకి దింపింది. ఇక బీఆర్ఎస్​ తరపున మాజీ ఎమ్మెల్యే గువ్వల బాలరాజు పేరు వినిపించినా బీఎస్పీతో పొత్తు కుదరడంతో ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్ఎస్​ ప్రవీణ్​కుమార్ ​పోటీలో ఉంటారని తెలుస్తోంది. నియోజకవర్గ సమీక్షా సమావేశాల్లో కూడా తానే పోటీలో ఉండబోతున్నానని ప్రవీణ్​కుమార్​ చెప్పడం ఇందుకు ఊతమిస్తోంది.

జోష్​ మీద కాంగ్రెస్.. 

నాగర్​ కర్నూల్​ లోక్​సభ నియోజకవర్గం పరిధిలో ఏడు అసెంబ్లీ సెగ్మెంట్లు ఉండగా ఇటీవల జరిగిన​ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్​ ఐదు చోట్ల విజయం సాధించింది. బీఆర్ఎస్​  కేవలం రెండు స్థానాలతో సరిపెట్టుకుంది. పార్లమెంట్​నియోజకవర్గ పరిధిలో మెజారిటీ స్థానాలను కైవసం చేసుకోవడంతో పాటు రాష్ట్రంలో అధికారాన్ని దక్కించుకున్న కాంగ్రెస్ మంచి​ జోష్​లో ఉంది. లక్షకు పైగా ఓట్ల మెజారిటీ రావడంతో ఆ పార్టీ టికెట్​ఎవరికి ఇచ్చినా గెలుస్తారన్న ప్రచారం జరుగుతోంది. ఉమ్మడి పాలమూరు  సీఎం రేవంత్​ సొంత జిల్లా కావడంతో అటు మహబూబ్​నగర్​, ఇటు నాగర్​కర్నూల్​లో విజయాన్ని ఆ  పార్టీ ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఈ క్రమంలో ఇప్పటికే  ఆరు అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఎన్నికల సన్నాహక సమావేశాలు నిర్వహించిన ఆ పార్టీ నేతలు మండల, గ్రామ స్థాయి నాయకులను, కార్యకర్తలను ​ఎన్నికలకు సమాయాత్తం చేశారు.  

కోల్పోయిన సీటును సాధించాలనే లక్ష్యంతో.. 

1998లో మల్లు రవి గెలిచిన తర్వాత 2009 వరకు జరిగిన ఎన్నికల్లో నాగర్ కర్నూల్ పార్లమెంట్ ​స్థానం నుంచి కాంగ్రెస్ గెలవలేదు. 1999లో కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం అవిశ్వాసంలో ఓడిపోయాక జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్​ నుంచి పోటీ చేసిన మల్లురవిపై టీడీపీ అభ్యర్థి మంద జగన్నాథం గెలిచారు. 2004లో టీఆర్ఎస్, కాంగ్రెస్​ పొత్తుతో హస్తం పార్టీకి పోటీ చేసే అవకాశమే రాలేదు. 2009లో టీడీపీ నుంచి కాంగ్రెస్​లో చేరి పోటీ చేసిన మంద జగన్నాథం విజయం సాధించారు. 2014లో రాష్ట్రం ఏర్పడి టీఆర్ఎస్​ ప్రభుత్వం వచ్చాక జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్​ నుంచి నంది ఎల్లయ్య గెలిచారు. 2019లో బీఆర్ఎస్ అభ్యర్థి  పోతుగంటి రాములు విక్టరీ కొట్టారు. దీంతో ఈసారి ఎలాగైనా నాగర్​కర్నూల్​ సీటును తన ఖాతాలో వేసుకోవాలని కాంగ్రెస్​ పట్టుదలతో ఉంది. ప్రస్తుత వాతావరణం కూడా ఆ పార్టీకి అనుకూలంగా ఉండడంతో  కాంగ్రెస్​ ఎమెల్యేలు, సెకండ్​ క్యాడర్..  గెలుపే లక్ష్యంగా పనిచేస్తున్నారు.  రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలో ఉండడం, ఆరు గ్యారెంటీల అమలు,  జాబ్స్​ నోటిఫికేషన్ తో తమ గెలుపు నల్లేరుపై నడకే అని ఆపార్టీ లీడర్లు అంటున్నారు.  సీఎం రేవంత్​రెడ్డి స్వగ్రామం కూడా నాగర్​కర్నూల్​లోక్​సభ నియోజకవర్గ పరిధిలోని వంగూరు మండలం కొండారెడ్డి పల్లి కావడం తమకు కలిసి వస్తుందని చెప్తున్నారు. 

కారు, ఏనుగు పొత్తు కలిసివచ్చేనా ? 

అసెంబ్లీ ఎన్నికల్లో  ఓటమితో డీలాపడ్డ  బీఆర్ఎస్​ నుంచి సిట్టింగ్​ ఎంపీ చేజారడం ఆ పార్టీకి  మైనస్​గా మారింది. దీటైన అభ్యర్థి లేకపోవడంతో డైలామాలో పడింది. ఈ క్రమంలో ఆ పార్టీ బీఎస్పీతో పొత్తు పెట్టుకుంది. బీఎస్పీ రాష్ట్ర చీఫ్​ ఆర్ఎస్​ ప్రవీణ్​కుమార్​ నాగర్​కర్నూల్ ​లోక్​సభ నుంచి పోటీ చేయడానికి ఆసక్తి చూపడంతో బీఆర్ఎస్​కు అభ్యర్థిని వెతికే పని తప్పింది.  నియోజకవర్గ పరిధిలో సన్నాహక సమావేశాలు పెడుతున్న ప్రవీణ్ పనిలో పనిగా బీజేపీ, కాంగ్రెస్​పై విమర్శనాస్త్రాలు ఎక్కుపెడుతున్నారు. అయితే, గత అసెంబ్లీ ఎన్నికల ముందు బీఆర్ఎస్ ​ప్రభుత్వ విధానాలను, పాలనను, మాజీ సీఎం కేసీఆర్​ను, ఆయన​ కుటుంబాన్ని ప్రవీణ్​కుమార్​తీవ్రంగా విమర్శించారు. బీఆర్ఎస్ ​అవినీతి ప్రభుత్వమని, దొరల పాలనలో బడుగులు బానిస బతుకులు బతకాల్సి వస్తుందన్నారు. కానీ,  ఇప్పుడు పొత్తు పెట్టుకోవడంతో ప్రవీణ్​కుమార్​ పోటీ చేస్తే అదే బీఆర్ఎస్​ను పొగడాల్సిన పరిస్థితి రావచ్చు. దీనిని ఓటర్లు రిసీవ్​ చేసుకుంటారా అన్నది పెద్ద ప్రశ్న. మరోవైపు ఉమ్మడి పాలమూరులోని గద్వాల జిల్లా అలంపూర్ ​నియోజకవర్గానికి చెందిన ప్రవీణ్​కుమార్ ​పోటీలో ఉంటే స్థానికులతో పాటు బీఎస్పీ ఐడియాలజీ ఫాలో అయ్యేవాళ్లు, బీఆర్ఎస్​ ఓటు బ్యాంకు కలిసి వస్తుందని లెక్కలేసుకుంటున్నారు. కాగా, ఎన్నికల్లో ప్రవీణ్​కు బీఆర్ఎస్​మాజీ ఎమ్మెల్యేలు ఎంత వరకు మద్దతిస్తారనేది తేలాల్సి ఉంది.

కాన్ఫిడెంట్​గా ఉన్న బీజేపీ ...

2019 పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసిన బంగారు శృతి మూడోస్థానానికి పరిమితమయ్యారు. ఈ క్రమంలో ఇప్పుడు శృతిని కాదని, ఆ పార్టీ బీఆర్ఎస్​ నుంచి చేరిన సిట్టింగ్​ఎంపీ పోతుగంటి రాములు కొడుకు పోతుగంటి భరత్​ ప్రసాద్​ను  బీజేపీ అభ్యర్థిగా ప్రకటించింది.  వెటరన్​ లీడర్​గా, వివాదరహితుడిగా ఎంపీ రాములుకు పేరుంది. ఆయనకున్న పరిచయాలు, అయోధ్యలో రామ మందిరం ప్రారంభం, ప్రధాని మోడీ చరిష్మా భరత్​ప్రసాద్​కు కలిసివస్తాయనే అంచనాలో బీజేపీ ఉంది. కీలకమైన పాలమూరు–రంగారెడ్డికి జాతీయ హోదా, శ్రీశైలానికి నల్లమల ఫారెస్ట్​ నుంచి ఎలివేటెడ్​ కారిడార్​, గద్వాల–రాయచూర్​ వయా మాచర్ల రైల్వే లైన్​, హార్టికల్చర్​యూనివర్సిటీ వంటి వాటికి అనుమతిచ్చే అధికారం కేంద్ర పరిధిలోనిది కావడంతో తమకు కలిసి వస్తుందని ఆ పార్టీ లీడర్లు చెబుతున్నారు.