జగిత్యాల వైద్యవిధాన పరిషత్​లో రూ.50 లక్షలు పక్కదారి

  •    ఉద్యోగుల ఖాతాల్లో వేయాల్సిన డీఏ, ఏరియల్స్ నిధుల మళ్లింపు
  •     వోచర్లను మార్చి చెక్కులను దిద్ది వేరే అకౌంట్లలోకి ట్రాన్స్​ఫర్​ 
  •     ఉద్యోగి, ఆఫీసర్​ పాత్ర?
  •     టీవీవీపీ కమిషనర్ కు డీసీహెచ్ఎస్ ఫిర్యాదు

జగిత్యాల, వెలుగు:  జగిత్యాల జిల్లా వైద్య విధాన పరిషత్ పరిధిలో పని చేసే ఉద్యోగుల జీపీఎఫ్, సీపీఎఫ్ ఖాతాల్లో వేయాల్సిన నిధులను కొందరు అక్రమార్కులు వోచర్లను మార్చి, చెక్కులను దిద్ది పక్కదారి పట్టించినట్టు తెలిసింది. డీఏ, ఏరియర్స్,​ సీపీఎస్ ఏరియర్స్, రెగ్యులర్​సీపీఎస్, వివిధ డిడక్షన్స్ కు సంబంధించిన నిధులు జమ  చేయకుండా దాదాపు రూ.50 నుంచి రూ. 60 లక్షల నిధులను మరో అకౌంట్​లోకి ట్రాన్స్​ఫర్​ చేసుకున్నారు. ఈ తతంగం నాలుగైదేండ్లుగా నడుస్తున్నట్టు తెలుస్తుండగా రెండు రోజుల కింద జగిత్యాల డీసీహెచ్ఎస్​సుదక్షిణా దేవికి తెలిసింది. దీంతో ఆమె వెంటనే టీవీవీపీ కమిషనర్ కు ఫిర్యాదు చేయడంతో పాటు కలెక్టర్ దృష్టికి తీసుకువెళ్లారు. 

చెక్కులను దిద్దినా నో అబ్జక్షన్​

వైద్య విధాన పరిషత్ సూపరింటెండెంట్​ఆకౌంట్ లో జమయిన నిధులను ఆయా ఉద్యోగులకు సంబంధించిన జీపీఎఫ్ ఖాతాల్లో జమ చేస్తుంటారు. ఇందులో భాగంగా ఉద్యోగుల డబ్బుల వివరాలు, అకౌంట్ వివరాలను నమోదు చేసి చెక్​తో పాటు వోచర్లను జత పరిచి ఎంప్లాయీస్ ​బ్యాంక్ ఖాతాల్లో జమ చేస్తుంటారు. కానీ, వైద్య విధాన పరిషత్​ ఆఫీసులో పని చేసే ఓ ఉద్యోగి..ఆఫీస్ సూపరింటెండెంట్​ఖాతాలో జమ చేయకుండా అతడి కుటుంబసభ్యులు, తెలిసిన కింది స్థాయి సిబ్బంది అకౌంట్లలో జమ చేసినట్లు తెలిసింది. 

ఈ విషయం ఎలాగో డీసీహెచ్ఎస్​ సుదాక్షిణా దేవి, ఆర్ఎంవో రామకృష్ణకు తెలియడంతో రెండు రోజుల కిందే బ్యాంకులో వివరాలడిగి తెలుసుకున్నారు. మరిన్ని డిటెయిల్స్​ ఇవ్వాలని కోరగా సెలవులు రావడంతో మంగళవారం ఇస్తామని చెప్పినట్టు తెలిసింది. నిధుల మళ్లింపులో టీవీవీపీ ఆఫీసులో పని చేసే ఓ ఆఫీసర్ హస్తం కూడా ఉందన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. అయితే, రూ.8 వేల చెక్కును రూ.8 లక్షలుగా మార్చినట్లు తెలుస్తుండగా.. ఎలాంటి కరెక్షన్స్ ఉన్నా చెక్కులను రిజెక్ట్ చేసే బ్యాంకర్లు ఎలా అప్రూవ్​చేశారన్న దానిపై అనుమానాలు కలుగుతున్నాయి.