ఎనిమిది ఇండ్లలో చోరీ .. రూ. 10 లక్షల విలువైన సొత్తు అపహరణ

జోగిపేట, వెలుగు: తాళం వేసి ఉన్న ఎనిమిది ఇండ్లలో దొంగలు చోరీ చేశారు. ఈ ఘటనలో సుమారు రూ. 10 లక్షల విలువైన బంగారు ఆభరణాలు చోరీకి గురయ్యాయి. ఈ ఘటన ఆందోల్‌‌‌‌‌‌‌‌ మండల పరిధిలోని ఎర్రారం గ్రామంలో ఆదివారం అర్ధరాత్రి జరిగింది. గ్రామానికి చెందిన బోయిని పెంటయ్య తన చెల్లెలికి ట్రీట్‌‌‌‌‌‌‌‌మెంట్‌‌‌‌‌‌‌‌ కోసం హైదరాబాద్‌‌‌‌‌‌‌‌లో హాస్పిటల్‌‌‌‌‌‌‌‌కు వెళ్లాడు. రాత్రి తాళం పగులగొట్టి ఇంట్లోకి వచ్చిన గుర్తు తెలియని వ్యక్తులు ఐదున్నర తులాల బంగారు ఆభరణాలు, రూ.11 వేలు, 30 తులాల వెండి వస్తువులను దొంగిలించారు. ఎర్కల లక్ష్మయ్య అనే వ్యక్తి హైదరాబాద్‌‌‌‌‌‌‌‌లో ఉంటున్నాడు. గ్రామంలో చేసిన అప్పు తీర్చేందుకు డబ్బు తీసుకొని గ్రామానికి వచ్చాడు.

 ఇతడి ఇంట్లో తులంన్నర బంగారం, రూ. 1.80 లక్షలు చోరీ అయ్యాయి. వడ్ల పార్వతమ్మ భర్త ఇటీవల చనిపోవడంతో నిద్ర చేసేందుకు బంధువుల ఇంటికి వెళ్లింది. అర్ధరాత్రి ఇంట్లోకి వచ్చిన దుండగులు నాలుగున్నర తులాల బంగారు అభరణాలు, రూ.40 వేలు ఎత్తుకెళ్లారు. అలాగే శివచందర్‌‌‌‌‌‌‌‌రెడ్డి ఇంట్లో రూ.25 వేలు, చాకలి పోచమ్మ, తలారి భాగమ్మ, ఈర్నగళ్ల లక్ష్మి ఇండ్లలో వెండి వస్తువులు చోరీకి గురికాగా, బ్యాగరి అనంతరావు ఇంట్లో ఏ వస్తువులు అపహరణకు గురికాలేదు. చోరీ జరిగినట్లు సోమవారం ఉదయం గుర్తించిన బాధితులు పోలీసులు ఫిర్యాదు చేశారు. జోగిపేట సీఐ అనిల్‌‌‌‌‌‌‌‌కుమార్‌‌‌‌‌‌‌‌, ఎస్సై అరుణ్‌‌‌‌‌‌‌‌కుమార్‌‌‌‌‌‌‌‌ ఘటనాస్థలాన్ని పరిశీలించారు. క్లూస్‌‌‌‌‌‌‌‌ టీమ్‌‌‌‌‌‌‌‌ వచ్చి వివరాలు సేకరించింది.