పరిహారం ట్రిపుల్‌‌.. ఆర్‌‌ఆర్‌‌ఆర్‌‌ పరిధిలో పెరిగిన భూముల రేట్లు అమల్లోకి..

  • అగ్రికల్చర్‌‌ ల్యాండ్స్‌‌కు మూడు రెట్లు, ఓపెన్‌‌ ప్లాట్లకు 90 శాతం పెంపు
  • ఇప్పటికే ఎక్కువ ఉన్న చోట రేటు యథాతథం
  • రేట్ల వివరాలు రిజిస్ట్రేషన్‌‌ అండ్‌‌ స్టాంప్స్‌‌, ధరణిలో డిస్‌‌ప్లే
  • సవరించిన రేట్లను నేషనల్‌‌ హైవే అథారిటీకి పంపిన ఆఫీసర్లు

యాదాద్రి, వెలుగు : రీజినల్‌‌ రింగ్‌‌ రోడ్డు (ట్రిపుల్‌‌ ఆర్‌‌) ఉత్తర భాగం కోసం భూములు ఇచ్చే రైతులకు పరిహారం విషయంలో ఊరట కలగనుంది. యాదాద్రి, మెదక్‌‌, సంగారెడ్డి, సిద్దిపేట జిల్లాల్లో సేకరించే భూముల విలువను పెంచుతూ సర్కార్‌‌  ఇటీవల నిర్ణయం తీసుకుంది. అగ్రికల్చర్‌‌ భూముల రేటు రెండు నుంచి మూడు రెట్లు పెంచిన సర్కార్‌‌, ఖాళీ ప్లాట్ల రేట్‌‌ను 90 శాతం పెంచింది. ఇప్పటికే రేట్లు ఎక్కువగా ఉన్న భూములకు పాత రేట్లనే కొనసాగించింది. సవరించిన రేట్లను రిజిస్ట్రేషన్‌‌ అండ్‌‌ స్టాంప్స్‌‌ డిపార్ట్‌‌మెంట్‌‌ వెబ్‌‌సైట్‌‌తో పాటు, ధరణిలో  తాజాగా అప్‌‌లోడ్‌‌ చేసింది.

స్పీడ్‌‌ అందుకున్న భూ సేకరణ

భారత్‌‌ మాల పరియోజన ఫేజ్‌‌ 1లో భాగంగా రీజినల్‌‌ రింగ్‌‌ రోడ్డు ఉత్తర భాగం మెదక్‌‌, సంగారెడ్డి, సిద్దిపేట, యాదాద్రి జిల్లాల మీదుగా 164 కిలోమీటర్ల మేర నిర్మించనున్నారు. ఈ రోడ్డు నిర్మాణానికి 5,025 ఎకరాలు అవసరం అని గుర్తించి ఆయా జిల్లాల అడిషనల్‌‌ కలెక్టర్లు, ఆర్డీవోలతో 8 ‘కాలా’లను ఏర్పాటు చేశారు. ఒక్క భవనగిరి ‘కాలా’ మినహా మిగిలిన ఏడు చోట్ల ఇప్పటికే త్రీ జీ నోటిఫికేషన్‌‌ రిలీజ్‌‌ అయింది.

యాదాద్రి జిల్లా భువనగిరి, చౌటుప్పల్‌‌, గజ్వేల్‌‌ తదితర మండలాలకు చెందిన రైతులు ట్రిపుల్‌‌ ఆర్‌‌ అలైన్‌‌మెంట్‌‌ను వ్యతిరేకిస్తున్నారు. దీనివల్ల తమకు నష్టం జరుగుతోందని ఆందోళనలను నిర్వహించారు. భువనగిరి మండలం రాయగిరి రైతులు హైకోర్టును ఆశ్రయించగా ఇటీవలే కేసును కొట్టివేసింది. దీంతో భూ సేకరణ ప్రక్రియ స్పీడందుకుంది.

పరిహారం పెరిగిందిలా..

ట్రిపుల్‌‌ ఆర్‌‌ కోసం యాదాద్రి జిల్లాలో సేకరించి అగ్రికల్చర్‌‌ ల్యాండ్స్‌‌ అర్బన్, రూరల్, కమర్షియల్‌‌ విభాగాల్లో రిజిస్ట్రేషన్‌‌ విలువను రెండు నుంచి మూడు రెట్లకు పైగా పెంచారు. యాదాద్రి జిల్లా తుర్కపల్లి మండలం వేల్పల్లి, దత్తాయిపల్లి, కోనాపూర్, ఇబ్రహీంపూర్, వీరారెడ్డిపల్లిలో సేకరించే ల్యాండ్‌‌కు గతంలో ఎకరానికి వివిధ సర్వే నంబర్లలో రూ. 3,37,500, రూ. 4.50 లక్షలు, రూ. 6.75 లక్షలుగా ఉండేది. ఇప్పుడు ఆ రేట్లను ఎకరానికి రూ. 6,85,500, రూ. 9.18 లక్షలు, రూ. 11,47,500 వరకు పెంచారు.

యాదగిరిగుట్ట మండలం దాతరుపల్లిలో ఎకరానికి రూ. 7 లక్షలు, రూ. 7,87,500 విలువ ఉండగా ఇప్పుడు రూ. 17.22 లక్షలు, రూ. 18.34 లక్షలు, రూ. 19.53 లక్షలు, 20,71,120 వరకూ పెంచారు. అయితే అదే గ్రామానికి చెందిన సర్వే నంబర్లు 243, 275లో ఇప్పటికే ఎకరానికి రూ. 19.06 లక్షల విలువ ఉండడంతో వాటిని యథాతథంగా ఉంచారు. మల్లాపురంలో రూ. 7 లక్షలకు ఎకరం ఉండగా ఇప్పుడు రూ. 18.34 లక్షలకు పెంచారు. ఇదే గ్రామంలో సర్వే నంబర్‌‌ 438లో ఇప్పటికే రూ. 19.06 లక్షలు ఉన్నందున రేటు సవరించలేదు. 

యాదాద్రి జిల్లా వలిగొండలోని వర్కట్‌‌పల్లి, రెడ్లరేపాక, పొద్దుటూరు, పహిల్వాన్‌‌పూర్‌‌, గోకారం గ్రామాల్లో ఎకరానికి రూ. 2.25 లక్షలు, రూ. 3,37,500, రూ. 9 లక్షలు ఉండగా రేట్లను రూ. 8.05 లక్షలు, రూ. 11.50 లక్షలకు పెంచారు. రూ. 10,12,500, రూ. 11.25 లక్షలు ఉన్న భూముల ధర సవరించలేదు. 

చౌటుప్పల్​ మండలంలోని తాళ్ల సింగారం, చిన్నకొండూరు, నేలపట్ల, చౌటుప్పల్​, తంగెడపల్లిలో ఎకరానికి రూ. 7.50 లక్షలు, రూ. 9 లక్షల, రూ. 11.25 లక్షలు ఉండగా, ఇప్పుడు రూ. 11.50 లక్షలు, రూ. 13.80 లక్షలు, రూ. 18.40 లక్షలుగా సవరించారు. లింగోజీగూడెంలోని 313, 314 సర్వే నంబర్లలో ఎకరానికి రూ. 31.50 లక్షలు ఉండడంతో సవరించకుండా వదిలేశారు.

ఖాళీ స్థలాలకు రిజిస్ట్రేషన్‌‌ విలువ ప్రకారం గజానికి 90 శాతం వరకు పెంచారు. గజానికి రూ. 1200 ఉంటే ఆ రేటును రూ. 2070, రూ. 2300 వరకు పెంచారు. గజానికి రూ. 2,100 ఉన్న చోట రూ. 2,760, మరికొన్ని చోట్ల రూ. 4,830కి పెంచారు. చౌటుప్పల్‌‌లో గజానికి రూ. 21 వేలు ఉన్న చోట రేటును పెంచలేదు. 

మెదక్‌‌ జిల్లా శివ్వంపేట, నర్సాపూర్, మండలాల పరిధిలోని నరసంపల్లి, వెంకగాయపల్లి, కిష్టాపూర్, గండ్రెడ్డిపల్లి, ఇస్లాంపూర్, వట్టూరు, నాగులపల్లిలో ఎకరానికి రూ. 4.50 లక్షలు, రూ. 5,62,500, రూ. 5,62,500, రూ. 6.75 లక్షలు, రూ. 7,87,500 ఉండగా ఆ రేట్లను రూ. 16 లక్షలు,  రూ. 16.50 లక్షల నుంచి రూ. 20 లక్షలకు పెంచారు.

సంగారెడ్డి జిల్లాలోని సంగారెడ్డి,సదాశివపేట, చౌటకూర్, పుల్కల్ మండలాల్లోని పెద్దాపూర్, చింతలపల్లి, అంగడిపేట, ఫసల్వాది, అంతాయిపల్లి, శివంపేట, వెండికోల్, కోర్పోల్‌‌, కాసాల, దేవులపల్లి, దౌల్తాబాద్‌‌ నుంచి భూమిని సేకరిస్తున్నారు. ఇక్కడ రిజిస్ట్రేషన్‌‌ విలువ ఎకరానికి రూ. 4.50 లక్షలు ఉండగా, ప్రస్తుతం ఆ రేటును రూ. 15 లక్షలకు పెంచారు. 

సిద్దిపేట జిల్లాలోని జగదేవ్‌‌పూర్‌‌, గజ్వేల్, వర్గల్, మర్కూక్‌‌, ములుగు, రాయపోల్‌‌ మండలాల పరిధిలోని 17 గ్రామాల్లో భూములు సేకరిస్తున్నారు. జిల్లాలో రిజిస్ట్రేషన్‌‌ ప్రకారం ఎకరానికి రూ. 1.50 లక్షలు, రూ.2. 25 లక్షలు, రూ. 2.70 లక్షలు, రూ. 3.15 లక్షలు, రూ. 5.25 లక్షలు ఉన్నాయి. ఇప్పుడు ఎకరానికి రూ. 4,99,400, రూ. 5.99,400, రూ. 6,99,300కు సవరించారు. 

మంచి పరిహారం ఇవ్వాలని గతంలోనే సీఎం సూచన

ట్రిపుల్‌‌ ఆర్‌‌ కోసం భూములు ఇస్తున్న రైతులకు మానవతా దృక్పథంతో మంచి అవార్డు ఇచ్చేలా చర్యలు తీసుకోవాలని సీఎం రేవంత్‌‌రెడ్డి గతంలోనే ఆదేశించారు. దీంతో రిజిస్ట్రేషన్‌‌ విలువ పెంపుపై నాలుగు జిల్లాల ఆఫీసర్లు రెగ్యులర్‌‌గా కసరత్తు నిర్వహించారు. సేకరించాల్సిన భూమి ప్రస్తుత రిజిస్ట్రేషన్‌‌ విలువను తీసుకొని, ఏయే సర్వే నంబర్లలోని భూములు నేషనల్‌‌, స్టేట్‌‌ హైవేలు, పంచాయతీ రోడ్ల పక్కన ఉన్నాయో వివరాలను సేకరించారు. అయితే బీఆర్‌‌ఎస్‌‌ హయాంలో రెండు సార్లు భూముల రిజిస్ట్రేషన్‌‌ విలువను పెంచినప్పటికీ బహిరంగ మార్కెట్‌‌తో పోలిస్తే రేట్లు చాలా తక్కువగా ఉన్నాయి.

దీంతో ట్రిపుల్‌‌ ఆర్‌‌ కోసం సేకరించే భూముల సర్వే నంబర్లకు రేట్లు పెంచాలని జిల్లా ఆఫీసర్లు ప్రపోజల్‌‌ చేశారు. ఈ ప్రపోజల్స్‌‌ను పరిశీలించిన ప్రభుత్వం రేట్లు పెంచుతూ నిర్ణయం తీసుకుంది. దీంతో సర్వే నంబర్ల వారీగా పెంచిన రేట్లను రిజిస్ట్రేషన్​ అండ్​ స్టాంప్స్​ డిపార్ట్​మెంట్​ తన వెబ్​సైట్​లో అప్​లోడ్​ చేసింది. పెంచిన అగ్రికల్చర్​ ల్యాండ్​ రేట్లను ధరణి వెబ్​సైట్లోనూ అందుబాటులోకి తేవడం విశేషం. 

నేషనల్‌‌ హైవే అథారిటీకి పంపిన ఆఫీసర్లు

భూముల విలువను పెంచడంతో పాటు వీటికి సంబంధించిన వివరాలను నేషనల్‌‌ హైవే అథారిటీకి పంపించారు. రైతుల నుంచి డాక్యుమెంట్లు సేకరించిన తర్వాత అవార్డు ప్రకటన ఉండనుంది. అయితే రాష్ట్ర ప్రభుత్వం పెంచిన రేట్లను నేషనల్‌‌ హైవే అథారిటీ యధావిధిగా ఓకే చేసినా, మార్పులు చేర్పులు చేసినా వ్యాల్యూ మాత్రం పెరిగే అవకాశం ఉంది. రిజిస్ట్రేషన్‌‌ వాల్యూ పెరిగిన తర్వాత ఖరారు చేసిన రేటు ప్రకారం రూరల్​ఏరియాలో మూడు రెట్లు, అర్బన్‌‌ ఏరియాలో రెండు రెట్లు అవార్డు అందిస్తారు.