ISRO: ఇస్రో చరిత్రలో మరో మైలురాయి..స్పేస్ రోబోటిక్ ఆర్మ్ టెస్టింగ్ సక్సెస్

భారత అంతరిక్ష పరిశోధనలో మరో మైలురాయి. అంతరిక్షంలో సొంత స్పేస్ స్టేషన్ను ఏర్పాటు ప్రయత్నాలు చేస్తున్న ఇస్రో..ఆదిశగా సంచలన విజయం సాధించింది. అంతరిక్షంలో మొదటి రోబోటిక్ ఆర్మ్ ను విజయ వంతంగా పరీక్షించింది. రిలోకేటబుల్ రోబోటిక్ మ్యానిప్యులేటర్ టెక్నాలజీ డిమాన్ స్ట్రేటర్(RRM-TD)  అని పిలువబడే ఈ రోబో టెస్టింగ్ ద్వారా అంతరిక్ష కేపబిలిటీలో ఇస్రో మరో ముందుడుగు వేసింది. ఈ టెక్నాలజీని ఇస్రో ఇంటీరియల్ సిస్టమ్స్ యూనిట్(IISU) తిరువనంతపురం లో అభివృద్ది చేశారు. ఈ అధునాతన వ్యవస్థలను కొన్ని దేశాలు మాత్రమే కలిగి ఉన్నాయి.

వ్యోమనౌక కక్ష్యలో ఉన్నప్పుడు క్లిష్టమైన పనులను నిర్వహించడానికి ఇలాంటి రోబోటిక్ చేతులు చాలా కీలకం.వస్తువులను పట్టుకోవడం, వాటిని మార్చడం, నిర్వహణ పనులు చేయడం వంటి పనులలో రోబోటిక్ ఆర్మ్ సహాయం చేస్తుంది.ISRO అంతరిక్ష కేంద్రం ఏర్పాటుకు రెడీ అవుతున్న విషయం తెలిసిందే..దీంతో సహా భవిష్యత్ ఉపయోగం కోసం రోబోటిక్ ఆర్మ్ సమర్థత ,ఖచ్చితత్వం కోసం పరీక్షించడం ద్వారా సిద్ధం చేయబడింది. 

ఇటీవల SpaDeX కోసం ప్రయోగించిన పోలార్ సింక్రోనస్ లాంచ్ వెహికల్ (PSLV) రాకెట్ ద్వారా RRM-TD ను అంతరిక్షంలో ప్రవేశపెట్టారు. దీనిలో కెమెరా, సెన్సార్స్, కస్టమ్ డిజైన్డ్ సాఫ్ట్ వేర్ ఉన్నాయి. వీటి ద్వారా దాని కార్యకలాపాల పర్యవేక్షణ, నిర్వహణ చేస్తుంది. వేగంగా కదిలే అంతరిక్ష వస్తువులను పట్టుకోవడం, అంతరిక్ష నౌకకు తరలించడానికి ఇటువంటి వ్యవస్థలు చాలా ముఖ్యమైనవి.

రోబోటిక్ ఆర్మ్ పరీక్ష.. చిన్న చిన్న లక్ష్యాలను సాధించింది. అంతరిక్షంలో వస్తువులను పట్టుకునే ప్రయత్నాలను చేస్తుంది. ఇది పూర్తి స్థాయిలో విజయవంతమైతే రాబోయే లాంచ్‌ల సమయంలో మరిన్ని ట్రయల్స్ నిర్వహించబడతాయి. రాబోయే రోజుల్లో ఈ టెక్నాలజీ అంతరిక్ష నౌకకు ఇంధనం నింపడం వంటి కీలకమైన పనులు చేయొచ్చని భావిస్తున్నారు.