అంగన్​వాడీ సెంటర్లకు కుళ్లిన గుడ్లు

  • దిద్దుబాటు చర్యలపై దృష్టి పెట్టని ఆఫీసర్లు
  • వనపర్తి జిల్లాలో గర్భిణులు, బాలింతలు, చిన్నారులకు అందని పోషకాహారం

 వనపర్తి, వెలుగు: జిల్లాలోని పలు అంగన్​వాడీ కేంద్రాలకు కుళ్లిన గుడ్లు సరఫరా అవుతున్నాయి.  చిన్న పిల్లలకు, బాలింతలకు, గర్భిణులకు అందించాల్సిన గుడ్లే కుళ్లిపోవడం ఆందోళన కలిగిస్తోంది.  అక్టోబర్​ నెలలో జిల్లాలోని రేవల్లి, వనపర్తి మండలాల్లోని  పలు అంగన్​వాడీ కేంద్రాల్లో సుమారు 5వేలకుపై గా గుడ్లు కుల్లిపోయినట్టు ఫిర్యాదులు ఉన్నాయి.  

అయిదారు వేల గుడ్లు వేస్ట్

జిల్లాలోని 589 అంగన్​వాడీ కేంద్రాలు ఉన్నాయి. చిన్నారులు, గర్భిణులు, బాలింతలు కలపి 34,384 మంది లబ్దిదారులు ఉన్నారు. ఒక్కో కేంద్రంలో ఒక్కో లబ్దిదారుకు రోజుకు ఒక గుడ్డు చొప్పున ఇవ్వాలి. కానీ, నెలలో రెండు సార్లు గుడ్లను సరఫరా చేస్తున్నారు.   జిల్లాలో  ఈ అన్ని కేంద్రాలకు ప్రతి నెలా గుడ్లను అందించేందుకు ఒకే కాంట్రాక్టర్​ ఉన్నాడు.  దీంతో సరఫరాలో ఆలస్యం జరగడంతో కుల్లిపోతున్నాయి.  

అయిదు జిల్లాలకు ఒకే కాంట్రాక్టర్​.. 

ఉమ్మడి మహబూబ్​నగర్​జిల్లాలోని అయిదు జిల్లాలలో ఉన్న అంగన్​వాడీ కేంద్రాలకు కోడి గుడ్లను సరఫరా చేసేందుకు ఒకే ఒక కాంట్రాక్టరు ఉన్నాడు.   ఉమ్మడి జిల్లాల్లోని అన్ని అంగన్​వాడి కేంద్రాలకు గుడ్లను సరఫరా చేయడంతో ఆలస్యం జరిగి,  గుడ్లు  కుళ్లిపోతున్నాయి. 

 పర్యవేక్షణ లోపమే కారణం

అంగన్​వాడీ కేంద్రాలపై సంబంధిత శాఖ అధికారుల పర్యవేక్షణ లేకపోవడంతోనే కాంట్రాక్టరు  ఇష్టంగా నడుస్తోంది.   ప్రతి నెలా ఒక్కో కేంద్రానికి ఏ సమయంలో ఎన్ని గుడ్లు సరఫరా అవుతున్నాయి. సరఫరా అయ్యే గుడ్లు మంచివేనా? అనే  పర్యవేక్షణ ఉండడం లేదు. దీనికితోడు తాను డిపార్టుమెంటులోని  అధికారులను  మేనేజ్​చేసుకుంటూ వస్తున్నాడనే ఆరోపణలు ఉన్నాయి.  

కుళ్లినవాటికి బిల్లులు ఇవ్వం

జిల్లాలోని పలు అంగన్​వాడి కేంద్రాలకు కుళ్లిన కోడిగుడ్లు సరఫరా అయినట్లు ఫిర్యాదులు వచ్చాయి. ఒక్క అక్టోబరు నెలలోనే అయిదారు వేల కోడి గుడ్లు కుళ్లిపోయినట్లుగా అంచనాకు వచ్చాం. కుళ్లిన కోడిగుడ్ల స్థానంలో మంచివి సరఫరా చేయాల్సిందిగా కాంట్రాక్టరుకు సూచించాం. కుళ్లిన కోడి గుడ్లు ఎన్ని ఉంటే అన్నింటికి బిల్లులు చెల్లించం. ఇక ముందు అలా జరగకుండా చర్యలు తీసుకుంటాం. - లక్ష్మమ్మ, జిల్లా సంక్షేమాధికారిణి, వనపర్తి

జిల్లాల వారీగా  కేంద్రాల వివరాలు

జిల్లా    కేంద్రాలు     బాలింతలు    చిన్నారులు
                   గర్భిణులు
వనపర్తి    589    4389    20195

నారాయణపేట    704    10479    19600

జోగులాంబగద్వాల    713    8145    20731

నాగర్​కర్నూలు    1131    10277    30302

మహబూబ్​నగర్    1184    11100    29625