వైద్య విద్యార్థిని కిడ్నాప్.. ఒంటిపై బలమైన గాయాలు

కోల్‌కతాలో మహిళా వైద్యురాలిపై అత్యాచారం- హత్య ఘటన మరవక ముందే, హర్యానాలో వైద్య విద్యార్థిని కిడ్నాప్ కలకలం రేపింది. రోహ్‌తక్‌లోని పోస్ట్ గ్రాడ్యుయేట్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (పీజీఐఎంఎస్)లో విద్యనభ్యసిస్తున్న డెంటల్ విద్యార్థినిని తన సుపీరియర్ కిడ్నాప్ చేసి దాడికి పాల్పడ్డాడు. ఈ ఘటన ఆగస్టు 16న జరగ్గా.. పోలీసులు కేసు నమోదు చేసి నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. 

పీజీఐఎంఎస్‌లో మొదటి సంవత్సరం చదువుతున్న బీడీఎస్ విద్యార్థినిని, పోస్ట్‌గ్రాడ్యుయేట్ విద్యార్థి కిడ్నాప్ చేసి శారీరకంగా దాడి చేసినట్లు తమకు ఆదివారం రాత్రి ఫిర్యాదు అందిందని రోహ్‌తక్ డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ వీరేంద్ర సింగ్ తెలిపారు. ఆగస్టు 16న నిందితుడు ఆమెను పీజీఐఎంఎస్ నుంచి కిడ్నాప్ చేసి.. అంబాలా, చండీగఢ్‌లకు తీసుకెళ్లి దాడికి పాల్పడినట్లు వెల్లడించారు. బాధితురాలి శరీరంపై బలమైన గాయాలున్నట్లు తెలిపారు. 

కుటుంబ సభ్యులు, న్యాయవాది సమక్షంలో ఆమె వాంగ్మూలాన్ని నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. బాధితురాలికి వైద్య పరీక్షలు పూర్తయినట్లు పేర్కొన్నారు. నిందితుడు రోహ్‌తక్‌లోని పీజీఐఎంఎస్‌లో పోస్ట్‌గ్రాడ్యుయేట్ విద్యార్థి అని, బాధితురాలికి అతనితో పరిచయం ఉన్నట్లు తమ ప్రాథమిక దర్యాప్తులో తేలిందని పోలీసులు తెలిపారు.

అత్యాచారం..!

బాధితురాలు పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో కానీ, జ్యుడీషియల్ మేజిస్ట్రేట్ ముందు చేసిన వాంగ్మూలంలో కానీ, ఎక్కడా అత్యాచారం జరిగినట్లు ఆరోపించలేదని పోలీసులు తెలిపారు. నిందితుడు ప్రస్తుతం కస్టడీలో ఉన్నాడని, ఈ కేసులో మరిన్ని సాక్ష్యాలను రాబట్టేందుకు తదుపరి విచారణ జరుపుతున్నామని వారు తెలిపారు.