రోహిణి కార్తే వచ్చింది ... అంటే వామ్మో రోహిణి కార్తెలో ఎండలకు రోళ్లు, రోకళ్లు పగిలే ఎండలు ఉంటాయి అనే నానుడి మనలో మెదలాడుతూ ఉంటుంది. నిజమే మరి ఈ నాలుగు నెలల ఎండాకాలంలో ఎండలు తొలి రోజులలో కొద్ది కొద్దికగా ఉగాది నుండి తాపం పెరుగుతుంది. దిన దిన ప్రవర్దనమానంగా సూర్య భగవానుడు తన ప్రతాపాన్ని మనకు చూపిస్తాడు. మాములుగా ఉండే ఎండల వేడినే తట్టుకోలేమంటే ఎండాకాలంలో చివరి కార్తె అయిన రోహిణిలో ఎండలు దద్దరిల్లుతాయి.
మరి ఈ సంవత్సరం రోహిణి కార్తె రోహిణి కార్తే మే 25 న ప్రారంభమై జూన్ 8 వరకు రోహిణి కార్తె ఉంటుంది. రోహిణి కార్తె ఫలితంగా ఈ పక్షం రోజులు అధిక వేడి గాలులు , ఎండ తీవ్రతలు , అగ్ని ప్రమాదాలు , ఉక్కపోతలు ఉంటాయి.
ఎండ తీవ్రతకు శరీరం అలసిపోతుంది. కావునా ఆరోగ్య రీత్య తగు శ్రద్దలు తీసుకోవాలి. ఎక్కువగా మట్టికుండ నీళ్ళు త్రాగడం , మజ్జిగ , పండ్ల రసాలు , కొబ్బరినీళ్ళు , నిమ్మరసం , రాగి జావ , ఫలుదా లాంటివి ఎక్కువగా త్రాగడం వలన ఆరోగ్యానికి అనుకూలంగా ఉంటుంది... కొంత ఉపశమనం లభిస్తుంది. మసాలాకు సంబంధించిన ఆహార పదార్ధాలు , వేపుళ్ళు , పచ్చళ్ళు , ఎక్కువ ఆయిల్ ఫుడ్ కలిగిన ఆహార పదార్ధాలు తినకూడదు.
నీళ్ళ సౌకర్యం ఉన్నవారు తప్పకుండా రెండు పూటల స్నానం చేయండి. అన్నిరకాల వయస్సు వారు ఎక్కువ కాటన్ దుస్తులు వాడండి , తెల్లని రంగు కల్గినవి , తేలిక రంగులు గల కాటన్ బట్టలు ధరిస్తే ఉష్ణ తాపం నుండి ఉపశమనం లభిస్తుంది. శారీరక తాపం తగ్గుతుంది. చిన్నపిల్లలకు మీరు ఉండే ఇంటి ఉష్ణోగ్రత తీవ్రతను బట్టి తడి గుడ్డతో తుడిచి బట్టలు మార్చండి. ఎవరైనా సరే ముదురు రంగు దుస్తులు వేయకపోవడం ఉత్తమం.
ముఖ్యంగా సాటి జీవులైన పశు , పక్ష్యాదులకు త్రాగడానికి మీరు నివసించే చోట వాటికి నీళ్ళను ఏర్పాటు చేయండి. బాటసారులు ఎవరైనా సరే వాళ్ళు అడగక పోయిన వాళ్ళ దాహాన్ని తీర్చేందుకు వారికి త్రాగడానికి చల్లటి నీళ్ళను అందివ్వండి. ఇలాంటి సంఘ సేవా కార్యక్రమాలు చేయడం వలన మీకున్న గ్రహభాదలు నివారణకు మార్గమై కొంత ఉపశమనం లభిస్తుంది. అంతే కాకుండా మీకు మీ కుటుంబ సభ్యులకు ఎంతో పుణ్యఫలం దక్కి అంతా మంచి జరుగుతుంది.