కామారెడ్డి జిల్లాలో .. గుంతల రోడ్లు .. వాహనదారుల అవస్థలు

  • కామారెడ్డి జిల్లా కేంద్రం, గ్రామాల్లో దెబ్బతిన్న రహదారులు
  • గుంతలు పూడ్చాలని ప్రజల విన్నపం 

కామారెడ్డి,  వెలుగు: కామారెడ్డి జిల్లా కేంద్రంతో పాటు గ్రామాల్లో రహదారులు దెబ్బతిన్నాయి.  పెద్ద పెద్ద గుంతలు పడి దారుణంగా తయారయ్యాయి. దీంతో  బైక్ లు, ఆటోలు, కార్లు, బస్సులు, లారీల లాంటి వెహికల్స్ నడిపేందుకు వాహనదారులు తీవ్ర అవస్థలు పడుతున్నారు. కొన్ని రోడ్లు వర్షానికి దెబ్బతినగా.. మరి కొన్ని అంతకు ముందే ధ్వంసం అయ్యాయి.  

  • జిల్లా కేంద్రంలోని కొత్త బస్టాండు నుంచి అశోక్​కాలనీ మీదుగా రైల్వే గేట్​వరకు ఉన్న రోడ్డు అధ్వానంగామారింది.  కిలో మీటర్​ మేర రోడ్డు అడుగడుగునా గుంతలు పడ్డాయి.  కొన్ని చోట్ల గుంతలు పెద్దగా ఉండి బైక్​లు అదుపు తప్పి కిందపడిపోతున్నారు.  జన్మభూమి రోడ్డు గుంతలమయంగా మారింది. నిజాంసాగర్​ రోడ్డు జీవదాన్​ హాస్పిటల్​ నుంచి విద్యానగర్​ కాలనీ సాయిబాబా  టెంపుల్​ వరకు రోడ్డు దెబ్బతింది.  
  • గాంధారి మండలం చిన్నగుజ్జల్​- లొంక తండా మధ్య ఉన్న కాజ్‌వే దగ్గర రోడ్డు సగం కోతకు గురైంది. రోడ్డు కోతకు గురై 10 రోజులు దాటినా రిపేర్లు చేయడం లేదు. వెహికిల్స్​దగ్గరికి వచ్చే వరకు గుంత పడిన విషయం తెలియడం లేదు. గాంధారి మండలం నుంచి చిన్న గుజ్జల్ మధ్య ఉన్న రోడ్డు కూడా అక్కడక్కడ దెబ్బతింది. 
  • సదాశివనగర్​ మండలం మర్కల్​నుంచి తిర్మన్​పల్లి మధ్య రోడ్డు గుంతలమయంగా మారింది. గుంతల్లో వర్షపు నీరు నిలిచి వెహికిల్స్​రాకపోకలకు ఇబ్బందవుతోంది.
  • పిట్లం మండల కేంద్రం నుంచి బాన్సువాడ వరకు ఉన్న రోడ్డు కొంతభాగం ఫారెస్టు ఏరియాలో వెడల్పు చేయలేదు. ఇక్కడ బీటీ కొట్టుకుపోయి గుంతలు పడి రోడ్డు ధ్వంసమైంది.
  • మహమ్మద్‌ నగర్ మండలం హసన్ పల్లి పంచాయతీ పరిధిలోని పిప్పిరేగడి తండా రోడ్డు అధ్వానంగా మారింది.  రోడ్డు రిపేర్​ కోసం ఇటీవల పార్లమెంట్ ఎన్నికల టైంలో స్థానికులు ఓటు వేయకుండా కొద్దిసేపు నిరసనకు దిగారు.