ఆసిఫాబాద్ జిల్లాలో రహదారులు ధ్వంసం.. బతుకు దుర్భరం

ఆసిఫాబాద్, వెలుగు: కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లాలో కురిసిన వర్షాలకు జన జీవనం స్తంభించింది. పోటెత్తిన వరదలతో చాలా చోట్ల రోడ్లు, కల్వర్టులు ధ్వంసమయ్యాయి. అత్యవసర సమయాల్లో అంబులెన్స్ వెళ్లలేక, వైద్యం అందక జనం గోస పడుతున్నారు. ఇప్పటికే 300కు పైగా గ్రామాలకు రోడ్డు సౌకర్యం లేక నరకయాతన అనుభవిస్తున్నారు. జిల్లా కేంద్రం నుంచి చాలా గ్రామాలకు ఇప్పటికీ బస్సులు కూడా వెళ్లలేని దుస్థితి. అనారోగ్యం బారిన పడినా , గర్భిణీలు పురిటి నొప్పులకు గురైనా దేవుని పై భారం వేయాల్సిందే. 

  • సిర్పూర్ (టి)మండల కేంద్రం నుంచి చీలపల్లి వెళ్లే దారిలో ఉన్న వంతెన ఇటీవల కురిసిన భారీ వర్షాలకు కోతకు గురైంది. ఫలితంగా లింబుగూడ, మేడిపల్లి, చిన్న మాలిని, మాలిని, మానిక్ పటారు గ్రామాలకు రాకపోకలు బంద్ అయ్యాయి. ఇప్పుడు అతి కష్టం మీద వాగు పక్క నుంచి దాటుతూ వెళ్తున్నారు. 
  • కాగజ్ నగర్ మండలంలోని చిన్న మాలిని గ్రామ సమీపంలోని బ్రిడ్జి వారం కిందట కొట్టుకుపోవడంతో చిన్న మాలిని, మానిక్ పటార్ గ్రామాలకు రాకపోకలు స్తంభించాయి. 
  • ఉట్నూర్ నుంచి ఆసిఫాబాద్ వెళ్లే ప్రధాన రహదారిలో ఇటీవల కురిసిన వర్షాలకు జైనూర్ పోచంలోద్ది మధ్య ఉన్న బ్రిడ్జి వద్ద పెద్ద గుంత ఏర్పడింది. ఇరువైపుల కోత వల్ల బ్రిడ్జి వద్ద ప్రయాణం ప్రమాదకరంగా మారింది. వెహికల్ డ్రైవర్లు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. రిపేర్ చేయాలని వేడుకుంటున్నారు.
  • దహెగాం మండలంలో మొట్లగూడ, రాంపూర్, దిగిడ, లోహ, టేపర్ గాం, రావులపల్లి, శంకరపురం గ్రామ ప్రజలు మండల కేంద్రానికి వెళ్లాలంటే దహెగాం నుంచి మొట్లగూడకు ఒక్కటే దారి. నిత్యావసరాల కోసం ప్రతిరోజూ ఈ దారిలోనే దహెగాం వెళ్తారు. ఈ రోడ్డు కోతకు గురై, గుంతలు పడడంతో వాహన దారులకు ఇబ్బందిగా మారింది. దీంతో గవర్నమెంట్ వెంటనే నిధులు మంజూరు చేసి రోడ్లు, కల్వర్టులు, వంతెనల మరమ్మతులు చేపట్టి ఆదుకోవాలని ప్రజలు కోరుతున్నారు.

రోడ్డు లేని  గ్రామాలు

తిర్యాణి మండలంలోని గుండాల, మంగి, గీసిగూడ, తాటి గూడా, గోవేనా, గొపేరా, కుర్సీ గూడా, నాగు గూడా, గొపేర కోలాం గూడా, కౌటా గాం, ముల్కల మంద, భీం రేలా గ్రామాలకు రోడ్డు సౌకర్యం లేదు. దహెగాం మండలంలోని మొట్లగూడ, రాంపూర్, దిగిడ, లోహ, టేపర్ గాం, రావులపల్లి, శంకరపురంలోనూ ఇదే పరిస్థితి. జైనూర్ మండలం డబ్బోలి జీపీలోని జాడుగుడా, లొద్దిగుడా, కోలాంగుడా చితకర్ర పంచాయతీలోని తాడిగుడా, చింతకర్ర, కిసాన్ నాయక్ తండాలు ఇలాగే ఉన్నాయి.

మాపై దయ చూపండి

మా గ్రామానికి రోడ్డు సరిగా లేదని బయట నుంచి ఎవ్వరు రావడానికి సాహసం చెయ్యరు. మేం బయటకు వెళ్లడానికి అవకాశం ఉండదు. వైద్య సేవలకు చాలా ఇబ్బందులు ఎదురుకుంటున్నం. గర్భిణీలను బురదదాటించడానికి ఎడ్ల బండ్లతో ఎన్నో ఇబ్బందులు పడుతున్నాం. ఉన్న ఆరు కిలోమీటర్ల రోడ్డు బాగు చేస్తే మా కష్టాలు తీరుతాయి. అధికారులు, ప్రజాప్రతినిధులు మాపై దయ చూపాలి.

పెందోర్ కేశవోరావు ,జైనూర్