రోడ్డు ప్రమాదంలో ముగ్గురు మృతి

  • కరీంనగర్ జిల్లాలో రాజీవ్ రహదారిపై ప్రమాదం 
  • మృతుల్లో ఇద్దరు బీహార్‌‌ కూలీలు

తిమ్మాపూర్, వెలుగు: కరీంనగర్  జిల్లా తిమ్మాపూర్  మండలం కొత్తపల్లి రాజీవ్  రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఇద్దరు కూలీలతో పాటు కారు డ్రైవర్ చనిపోయారు. స్థానికులు, పోలీసుల వివరాల ప్రకారం.. బీహార్ కు చెందిన ధీరజ్ కుమార్, సికిందర్  మండల్  ఓ ప్రైవేట్  రైస్ మిల్లులో కూలీలుగా పని చేస్తున్నారు. శుక్రవారం సాయంత్రం రాజీవ్ రహదారిపై నడుచుకుంటూ వెళ్తుండగా కరీంనగర్  నుంచి హైదరాబాద్  వైపు వేగంగా వెళ్తున్న కారు వారిని ఢీకొట్టింది. తీవ్రంగా గాయపడిన వారు స్పాట్‌లోనే చనిపోయారు.

ప్రమాద తీవ్రతకు కారు పల్టీ కొట్టగా, సిద్దిపేట జిల్లా బెజ్జంకి మండలం లక్ష్మీపూర్ గ్రామానికి చెందిన డ్రైవర్​ తాడూరి వెంకటరెడ్డి తీవ్రంగా గాయపడ్డాడు. అతడి పరిస్థితి విషమంగా ఉండడంతో ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా, చికిత్స పొందుతూ చనిపోయాడు. ఎల్ఎండీ ఎస్ఐ వివేక్  కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.