ఈ - కామర్స్ కబ్జాతో ప్రమాదం!

భారతదేశంలో ఈ - కామర్స్ ద్వారా వ్యాపారం, ఉద్యోగాలు వగైరా ఫలితాలు రానున్న పది ఏండ్లలో అతి ఆందోళనకరంగా మారనున్నాయి. ఇటీవల ఇండియా ఫౌండేషన్, ఈ – కామర్స్.. దేశంలో తాము కోటి 50 లక్షల ఉద్యోగాలు ఇచ్చినట్లు, ఉపాధి కల్పనకు చాలా ఉపయోగపడుతున్నట్లు ఇచ్చిన రిపోర్ట్​ను స్వయంగా కేంద్ర వాణిజ్య మంత్రి పీయూష్ గోయల్ ఖండించారు. ఈ విషయాన్ని గతం నుంచి కొందరు పాత్రికేయులు,  చెబుతూ వస్తున్నప్పటికీ తప్పుడు ప్రచారం అన్నారు.  ఇప్పుడు స్వయంగా వాణిజ్య మంత్రి ఈ విషయం కుండ బద్దలు కొట్టినట్లు చెప్పారు.

ఇది ఇలా ఉంటే ఇటీవల మన పీఎం నరేంద్ర మోదీ మాత్రమే గత నాలుగేండ్లలో ఎనిమిది కోట్ల ఉద్యోగాలు ఇచ్చామన్నారు. ఆ లెక్క ఆయనకు ఆర్బీఐ నుంచి వచ్చిందన్నారు. ఆర్బీఐ  ద్వారా రిపోర్ట్ ఏమిటి?  ఇంతేకాదు దేశంలో ఉద్యోగాలు ఇవ్వడానికి, పెట్టుబడులు వస్తే ఇష్టం లేనివారు, ఎంప్లాయ్​మెంట్ వ్యతిరేకులు తప్పుడు ప్రచారం చేస్తున్నారని మోదీ పరోక్షంగా రాహుల్ గాంధీని టార్గెట్ చేసి మాట్లాడుతుంటారు. 2011 నుంచి అసలు జనగణనే జరగలేదు. అలాంటపుడు  ఉపాధి మీద ఎలా క్లారిటీగా చెబుతారు.

చిన్న వ్యాపారులు కుదేలు

ఏడాదికి రెండుకోట్ల ఉద్యోగాల హామీ పీఎం మోదీ ఇచ్చారు.  ఆయన చెప్పినట్లు.. గత పది ఏండ్ల పాలనలో ఈ లెక్కన 20 కోట్ల ఉద్యోగాలు రావాలి! వాటి సంగతి హుష్ కాకి అయిపోయాయి. గతంలో 2020లోనూ పీయూష్ గోయల్ ఈ కామర్స్ పైన ఇలాగే మాట్లాడారు. మరోవైపు మన ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఆర్థిక రిపోర్ట్​లో 14 లక్షల కోట్లు  కార్పొరేట్​లకు లాభాలు వచ్చాయి, 30 శాతం లాభాలు గడించారు.  కాబట్టి, ఉద్యోగాలు కూడా ఇచ్చే బాధ్యత వారి మీద కూడా ఉందన్నారు!  దేశంలోని మధ్యతరహా ట్రేడర్స్,  చిన్న వ్యాపారాలు చేసుకునేవారు  నోట్ల రద్దు లాంటి నిర్ణయాల వల్ల,  పెద్ద పెద్ద మాల్స్ వల్ల తీవ్రంగా దెబ్బతిన్నారు.

అన్నింటికన్నా విషాదమైన విషయం ఏమంటే ఇలా దెబ్బతిన్నవాళ్లు  పెద్దమాల్స్ లో ఉద్యోగంలో  చేరి చాలీచాలని జీతంతో  బతుకు బండి లాగుతున్నారు.  వారి పరిస్థితి దుర్భరంగా ఉన్నది.  ఇలాగే ఈ –కామర్స్ .. దేశంలో వ్యాపారాలు, వాణిజ్య సంస్థల్లో ప్రవేశిస్తే  దేశంలోని 70 శాతం మార్కెట్ విదేశీ పెట్టుబడిదారి కంపెనీల  చేతుల్లోకి పోతుంది. మరో పది ఏండ్లలో మన దేశం మార్కెట్ పరిస్థితి, ఉద్యోగాల పరిస్థితి మరింత దయనీయంగా మారే అవకాశం లేకపోలేదు.

గడప గడపకూ ఆన్​లైన్ బిజినెస్​

రానున్న రోజుల్లో  వాల్ మార్ట్​లు,  అమెజాన్​లే కనిపిస్తాయి. ఇప్పటికే ఆన్​లైన్​ బిజినెస్ గడప గడపకూ చేరుకున్న పరిస్థితి ఉన్నది. ఇది మరింత విస్తృతం కానుంది. ఎలాగైతే జియో నెట్​వర్క్​ విస్తరించి, పాలకుల మద్దతుతో మన ప్రభుత్వ రంగ సంస్థ అయిన బీఎస్ఎన్ఎల్ కుదేలైందో  మనం చూశాం. అలాంటి పరిస్థితి దాదాపు దేశంలోని చిన్నపాటి వ్యాపార వర్గాలు ఎదుర్కోనున్నాయి. 

ప్రభుత్వ విధానాల వల్ల, అధిక ధరల వల్ల, ఇప్పటికే దేశంలోని 40 శాతం కుటుంబాల కొనుగోలు శక్తి దెబ్బతిన్నది. ఇక ఇండియన్ మార్కెట్ నిలబడే పరిస్థితి ఎక్కడిది? 18 శాతం జీఎస్టీ సామాన్యుడి జీవితాన్ని కుదేలు చేసిన పరిస్థితి ఉన్నది. దేశంలో ఈ –కామర్స్  కారణంగా చిన్న షాప్స్ మొత్తం బంద్ అయిపోయే పరిస్థితి  నెలకొన్నది.  ఏడు కోట్ల మంది రోడ్డు మీదికి వస్తారని ఎంపీగా కూడ ఉన్న ఇండియన్ ట్రేడర్స్ నాయకుడు ప్రవీణ్ ఖండెన్వాల్ అన్నారు. పాలకులు దీనిపై దృష్టి సారించాలి.

- ఎండి. మునీర్,సీనియర్ జర్నలిస్ట్