నిజామబాద్‌లో పెరుగుతున్న కరెంట్​ వినియోగం

  • ఫిబ్రవరి చివరి నుంచే కోటా కంటే 10 శాతం అధికంగా సప్లయ్​
  • వచ్చే రెండు నెలల్లో మరింత డిమాండ్ ​ 
  • అడిషనల్​గా 30 శాతం సరఫరా అవసరమని అధికారుల అంచనా
  • గతేడాది కంటే అధికంగా విద్యుత్​ వాడకం

నిజామాబాద్​, వెలుగు: ఎండలు ముదురుతున్న నేపథ్యంలో జిల్లాలో కరెంట్​ వినియోగం రోజురోజుకు పెరుగుతోంది. వ్యవసాయ బోర్ల కింద వేసిన యాసంగి పంటలకు సాగునీరు సరఫరా అవుతుండడం, ఇండ్లల్లోనూ కరెంట్​వినియోగం పెరగడంతో డిమాండ్​ అధికమైంది. గతేడాదితో పోలిస్తే ఈ ఏడాది కరెంట్​ వాడకం పెరిగింది. కరెంట్​ సప్లయ్​ లో ఎలాంటి రాజీ పడొద్దని ప్రభుత్వం అధికారులకు తేల్చి చెప్పడంతో డిమాండ్​కు తగ్గట్లు సప్లయ్​ చేస్తున్నారు.

1.81 లక్షల బోర్​ కనెక్షన్లు

జిల్లాలో ఈ ఏడాది యాసంగిలో 5.20 లక్షల ఎకరాల్లో ఆయా పంటలు సాగుచేశారు. ఇందులో 3.70 లక్షల ఎకరాల్లో వరి సాగవుతుండగా, ఇందులో బోర్ల పారకం కింద 2.67 లక్షల ఎకరాల్లో నాట్లేశారు. జిల్లాలో మొత్తం 1.81 లక్షల బోర్లకు ​ కనెక్షన్లు ఉండగా, అనధికారికంగా మరో 20 వేల కనెక్షన్లు ఉన్నాయి. కాల్వలు, చెరువుల్లోంచి పంటలకు నీటిని మళ్లించడానికి కొందరు రైతులు అదనపు మోటార్లు వాడతారు. జిల్లాలో  కేటగిరి –1 కింద 4.78 లక్షల ఇంటి కనెక్షన్లుండగా, ఇందులో 2.28 లక్షల కనెక్షన్లకు సంబంధించి నెలకు 200 యూనిట్ల లోపు కరెంట్​ వాడకం ఉంటుంది.

ఎండలు 38 డిగ్రీలు దాటుతుండడంతో విద్యుత్​ డిమాండ్​ పెరిగింది. సాధారణంగా మార్చి రెండో వారం తర్వాత కరెంట్​ వినియోగం పెరుగుతుంది. కానీ ఈ ఏడాది ఫిబ్రవరి  నుంచే ఈ పరిస్థితి తలెత్తింది. ప్రతినెలా జిల్లాకు అవసరమైన కరెంట్​ కోటాను నిర్ణయిస్తారు. ఆ లెక్కన ఫిబ్రవరిలో 274 మిలియన్​ యూనిట్ల అలాట్​మెంట్​ ఉండగా 325 మిలియన్​ యూనిట్ల విద్యుత్​ వాడేశారు.

మార్చిలో రోజుకు 12 మిలియన్​ యూనిట్ల కేటాయింపులకుగానూ 13 మిలియన్​ యూనిట్లు సప్లయ్​ చేస్తున్నారు. ఏప్రిల్​, మే నెలాఖరు దాకా యాసంగి పంటల కోతలు కొనసాగుతాయి. ఎండలు మరింత పెరిగి ఇండ్లలోనూ వాడకం పెరుగుతుంది. ప్రతినెలా కోటాకు మించి అదనంగా 30 శాతం సరఫరా చేయాల్సి వస్తుందని విద్యుత్​ శాఖ అధికారులు లెక్కలు వేశారు. ప్రస్తుతం 10 శాతం అధికంగా సప్లయ్​ చేస్తున్నారు.

క్వాలిటీ కరెంట్​ ఇస్తున్నాం 

డిమాండ్​కు సరిపడా కరెంట్​ సప్లయ్​ చేయాలని గవర్నమెంట్​ స్పష్టమైన ఆదేశాలు ఇచ్చింది. దీంతో కోటాతో సంబంధం లేకుండా క్వాలిటీ కరెంట్​ను సప్లయ్​ చేస్తున్నాం. విద్యుత్​ సరఫరా విషయమై రైతులు ఎలాంటి ఆందోళన చెందొద్దు.  కరెంట్​  వృథాను
 ప్రతిఒక్కరూ అరికట్టాలి.

రవీందర్​, ఎస్​ఈ, ఎన్​పీడీసీఎల్