సిండికేట్‌‌ అయిన మిల్లర్లు..రోడ్డెక్కిన రైతులు

  • వడ్ల రాక పెరగడంతో ధర తగ్గించిన మిర్యాలగూడ వ్యాపారులు
  • తరుగు పేరుతో ట్రాక్టర్‌‌కు 60 కేజీలు దోపిడీ
  • మిల్లులకు తాళాలు.. రైతుల పడిగాపులు
  • అద్దంకి – నార్కట్‌‌పల్లి, మిర్యాలగూడ – కోదాడ రోడ్లపై రైతుల రాస్తారోకో

నల్గొండ, వెలుగు : నల్గొండ జిల్లా మిర్యాలగూడ పరిధిలోని రైస్‌‌ మిల్లర్లు సిండికేట్‌‌గా మారి అన్నదాతలను నిలువునా దోచేస్తున్నారు. సీజన్‌‌ ప్రారంభంలో ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధర ఇచ్చిన మిల్లర్లు, వడ్ల రాక పెరగడంతో మద్దతు ధరకు మంగళం పాడారు. వడ్ల ధరలో పైసా తగ్గించినా చర్యలు తీసుకుంటామని కలెక్టర్‌‌ హెచ్చరించినా మిల్లర్ల తీరులో మాత్రం మార్పు రావడం లేదు. అయితే రెండు, మూడు రోజుల నుంచి పడిగాపులు పడుతున్న కొందరు రైతులు మిల్లర్లు చెప్పిన రేటుకే వడ్లు అమ్ముతుండగా, మరికొందరు మాత్రం మద్దతు ధర చెల్లించాల్సిందేనని ఆందోళనలకు దిగుతున్నారు. 

పెరిగిన వడ్ల రాక..తగ్గిన మద్దతు ధర

సీజన్‌‌ ప్రారంభంలో మిల్లర్లు క్వింటాల్‌‌కు రూ. 2,300ల నుంచి రూ. 2,450 వరకు చెల్లించారు. మిర్యాలగూడ పరిధిలోని మిల్లులకు వారం రోజుల నుంచి రోజుకు 1,500 నుంచి 2,000 ట్రాక్టర్ల వడ్లు వస్తున్నాయి. దీంతో ధర తగ్గించేందుకు ప్లాన్‌‌ చేసిన మిల్లర్లు ముందస్తు వ్యూహంలో భాగంగా ఆదివారం ఉదయం నుంచి కొనుగోళ్లు నిలిపివేసి మిల్లులకు తాళాలు వేశారు. ఆ తర్వాత సిండికేట్‌‌గా మారి ధరను అమాంతం తగ్గించేశారు. ప్రస్తుతం క్వింటాల్‌‌ వడ్లకు రూ.300 నుంచిరూ.400 తగ్గించి రూ.2100కే కొనుగోలు చేస్తున్నారు.

మిల్లర్లు కుమ్మక్కై ఒక్కో రోజు కొన్ని మిల్లుల్లోనే వడ్ల కొనుగోళ్ల ప్రక్రియ నడిపిస్తున్నారు. వంతుల వారీగా మిల్లులను నడుపుతుండడంతో రైతులు రెండు, మూడు రోజుల పాటు క్యూలో ఉండాల్సి వస్తోంది. మరో వైపు వాతావారణంలో మార్పులు వస్తుండడంతో రైతు ఎలాగైనా వడ్లను అమ్ముకొని పోవాలన్న ఆలోచనతో ధరపై రాజీపడుతున్నారు. మిల్లర్లు గేటు తెరిచిందే ఆలస్యం.. ఎంతో కొంత అన్నట్లుగా మిల్లర్లు చెప్పిన ధరకే వడ్లు అమ్ముకుంటున్నారు.

ధర్నాకు దిగిన రైతులు

మిర్యాలగూడ, వెలుగు : మిర్యాలగూడ నియోజకవర్గ పరిధిలోని రైస్‌‌ మిల్లర్లు సిండికేట్‌‌గా మారి కొర్రీలు పెడుతున్నారని... మద్దతు ధర చెల్లించడం లేదంటూ ఆదివారం రైతులు ఆందోళనకు దిగారు. వేములపల్లి మండలం శెట్టిపాలెం మహా తేజ రైస్‌‌ మిల్‌‌ వద్ద అద్దంకి – నార్కట్‌‌పల్లి హైవేపై, యాద్గార్‌‌పల్లి, అవంతీపురం రైస్‌‌మిల్లుల వద్ద మిర్యాలగూడ – కోదాడ మెయిన్‌‌ రోడ్డుపై ట్రాక్టర్లను అడ్డుపెట్టి సుమారు రెండు గంటల పాటు ధర్నా చేశారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ చింట్లు, హెచ్‌‌ఎంటీ, ఇతర సన్న రకాల వడ్లను అమ్ముకునేందుకు వస్తే మిల్లర్లు సాకులు చెబుతూ వడ్లు కొనకుండా, మిల్లులకు తాళాలు వేసుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.

మూడు రోజుల క్రితం వరకు క్వింటాల్‌‌కు రూ.  2,400లకు పైన ఇచ్చిన మిల్లర్లు ఇప్పుడు రూ. 2,100 మాత్రమే ఇస్తామంటున్నారని మండిపడ్డారు. ధర్నా విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి వచ్చి రైతులు, మిల్లర్లతో మాట్లాడారు. మద్దతు ధరకు వడ్లు కొనాలని లేదంటే చర్యలు తప్పవని మిల్లర్లను హెచ్చరించారు. రైతుల ధర్నాతో నార్కట్‌‌పల్లి – అద్దంకి, మిర్యాలగూడ – కోదాడ రూట్లలో ట్రాఫిక్‌‌ నిలిచిపోయింది. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనాస్థలానికి వచ్చి మద్దతు ధర ఇచ్చేలా చూస్తామని హామీ ఇవ్వడంతో రైతులు ధర్నా విరమించారు. 

ట్రాన్స్‌‌పోర్ట్‌‌, హమాలీ చార్జీలు అదనం

మిల్లర్లు సిండికేట్‌‌గా మారి ఓ వైపు ధర తగ్గిస్తుంటే.. మరో వైపు ట్రాన్స్‌‌పోర్ట్‌‌, హమాలీ, గుమాస్తా, కాంటా ఛార్జీలు అంటూ దోపిడీ చేస్తున్నారు. సన్న వడ్లు క్వింటాల్‌‌కు రూ.2,300 ఇస్తున్నామని చెప్తున్నప్పటికీ... మరో పక్క ఒక్కో ట్రాక్టర్‌‌కు తరుగు పేరిట 30 నుంచి 60 కేజీల వరకు కోత పెడుతున్నారు. దీంతో రైతులకు క్వింటాల్‌‌కు రూ. 2 వేలు కూడా దక్కడం లేదు. మరో వైపు వే బ్రిడ్జి వద్ద కూడా 10 నుంచి 20 కిలోలు తేడా వస్తుండడంతో కొందరు రైతులు లీగల్‌‌ మెట్రాలజీ ఆఫీసర్లకు ఫిర్యాదు చేశారు.

మద్దతు ధర ఇస్తలే..

నాకున్న రెండు ఎకరాల్లో హెచ్‌‌ఎంటీ రకాలు సాగు చేసిన. వడ్లు తీసుకొని మహాతేజ మిల్లుకు వచ్చిన. రెండు రోజుల కిందటి దాకా రూ.2,300 నుంచి రూ. 2,400లకు క్వింటాల్‌‌ కొనుగోలు చేసినరు. ఇప్పుడు రూ.2 వేలు మాత్రమే ఇస్తా అంటున్నరు. ఆఫీసర్లు న్యాయం చేయాలి. 

- శంకర్ సింగ్ పెద్దదేవులపల్లి