67 గ్రామాలు.. 50 వేల ఎకరాలు .. మూసీ పరిధిలోనే జోరుగా వరి సాగు  

  • యాసంగిలో జిల్లాల్లో 2.80 లక్షల ఎకరాలు
  • మూసీయేతర ప్రాంతాల్లో తగ్గిన సాగు విస్తీర్ణం

యాదాద్రి, వెలుగు: యాదాద్రి జిల్లాలోని మూసీ పరివాహక ప్రాంతంలో వరిని ఎక్కువగా సాగు చేస్తున్నారు.  ఈ యాసంగిలో  జిల్లా మొత్తం 2.80 లక్షల ఎకరాల్లో వరి సాగు చేస్తే.. అందులో మూసీ పరిధిలోని 67 గ్రామాల్లోనే 50,305 ఎకరాలు ఉండడం విశేషం. వీటిలోని 55 గ్రామాలు భూదాన్​పోచంపల్లి, వలిగొండ, రామన్నపేట, బీబీనగర్​ మండలాల్లో ఉన్నాయి. అందులోనూ వలిగొండ, పోచంపల్లి మండలాల్లోని 36 గ్రామాల్లోనే 32,719 ఎకరాలను సాగు చేస్తున్నారు. భువనగిరి, చౌటుప్పల్​, మోత్కూరు, అడ్డగూడూరు, ఆత్మకూర్​ (ఎం) మండలాల్లోని మూసీ పరిధిలోని 12 గ్రామాల్లో 4352 ఎకరాలను సాగు చేస్తున్నారు. 

వర్షాభావ పరిస్థితులు ఉన్నా.. 

ఈ సారి వర్షాభావ పరిస్థితులు ఉన్నప్పటికీ మూసీ నదిలో  ఏడాది పొడుగునా నీరు ప్రవహిస్తుండడంతో రైతులు క్రమం తప్పకుండా వరిని సాగు చేస్తున్నారు. ఈ ప్రాంతంలోని ఆయకట్టుకు కాల్వల ద్వారా నీళ్లు అందడంతో పాటు చెరువులు, కుంటలను నీటితో నింపుతుండడం.. రైతులకు కలిసి వస్తోంది. దీంతో రైతులు వానాకాలంతో పాటు యాసంగిలోనూ వరిపైనే ఆధారపడుతున్నారు.  మూసీయేత ప్రాంతాల్లో మాత్రం సాగు విస్తీర్ణం భారీగా తగ్గింది. 

భిన్నంగా మూసీయేతర ప్రాంతాలు

మూసీయేతర ప్రాంతాల్లో వర్షాభావ పరిస్థితుల కారణంగా గత సీజన్‌‌తో పోలిస్తే రైతులు ఈ యాసంగిలో వరి సాగును తగ్గించారు.  జిల్లాలోని 17 మండలాల్లో 6.14 లక్షల ఎకరాల సాగు భూమి ఉండగా అన్ని రకాల పంటలు కలిపి 4 లక్షల ఎకరాలకు పైగా సాగవుతోంది.  ఇందులో గత యాసంగిలో 3 లక్షల ఎకరాల్లో వరి సాగవగా.. ఈ సారి 2.80 లక్షలకు పడిపోయింది.  వ్యవసాయానికి 24 గంటల ఉచిత కరెంట్​ ఇస్తున్నా.. భూగర్భ జలాలు లేక పోవడంతో రైతులు వరి సాగు తగ్గించారు. గత సీజన్​లో వర్షాలు సరిగా కురువకపోవడంతో 11.5 శాతం లోటు వర్షపాతం నమోదైంది. దీంతో  గతేడాది జనవరిలో 4.91 మీటర్లలో లోతులో ఉన్న భూగర్భ జలాలు  ఈ ఏడాది జనవరిలో 7.29 మీటర్లకు,  తుర్కపల్లి, సంస్థాన్​ నారాయణపురం, ఆత్మకూర్​ (ఎం) మండలాల్లో 6.08 నుంచి 8.14 మీటర్లకు పడిపోయాయి.