వ్యవసాయం: వరి విత్తడంలో ...కలుపు నివారణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఇవే...

దేశ వ్యాప్తంగా సాగు చేస్తున్న పంటల్లో వరి ప్రధానమైనది. వానాకాలంలో అధిక విస్తీర్ణంలో సాగు చేస్తున్న పంటల్లో ముఖ్యమైనది. దేశ వ్యాప్తంగా వానాకాలం...  యాసంగిలో  వరి విస్తీర్ణం గణనీయంగా పెరిగింది. ఇంతటి ప్రధానమైన పంటలో అధిక దిగుబడులు సాధించడానికి విత్తన ఎంపిక మొదలు నేల తయారీ, పచ్చిరొట్ట వేయటం, ఎరువులు, చీడపీడల నివారణ లాంటి విషయాల గురించి రైతులు అవగాహన ఏర్పరుచుకోవాలి.   వరి పంటను సాగు చేసే రైతులు విత్తే వరిలో కలుపు పెరగకుండా  తీసుకోవలసిన జాగ్రత్తల గురించి తెలుసుకుందాం. . .  .

నేరుగా విత్తే వరిలో  దుక్కిలో నేరుగా విత్తడంతో ... రైతులు తొలకరి వర్షాలు పడిన వెంటనే లేదా కాలువలో నీరు వచ్చిన వెంటనే పొలం దుక్కి దున్ని విత్తనాలను  నేలలో నాటి  వర్షాధారంగా లేక ఆరుతడి పంటగా సాగుచేస్తూ కాలువల ద్వారా నీరు అందుబాటులోకి వచ్చిన తర్వాత మాగాణి వరిగా సాగుచేస్తారు. ఈ పద్ధతిలో రసాయనాలతో కలుపు నిర్మూలన మూడు దశల్లో చేయాలి.

 విత్తడానికి ముందు : పొలంలో తుంగ, గరిక, దర్భగడ్డి, బొంత, ఊద వంటి మొండి జాతి కలుపు మొక్కలు ఎక్కువగా ఉన్నప్పుడు, తొలకరి వర్షాలు పడి, కలుపు ఏపుగా పెరుగుతున్నప్పుడు ఒక లీటరు నీటికి 5 మి.లీ. పారాక్వాట్ 24 శాతం  రసాయనాన్ని లేదా గ్లూపోసినేట్ 13.5 శాతం  ద్రావకం 4 మి.లీ. లను  ఒక  లీటరు నీటికి కలిపి ఎక్కడ కలుపు ఉంటే అక్కడ పిచికారి చేయాలి. ఈ మందు స్ప్రే చేసిన 10- నుంచి 15 రోజుల తర్వాత పొలం దున్ని వరి విత్తుకోవచ్చు.

విత్తిన  1-2 రోజుల్లోపు : వరి విత్తిన వెంటనే లేదా 1-2 రోజుల్లోపు తేమ ఉన్నప్పుడు ఎకరాకు ఒక లీటరు పెండిమిథాలిన్ 30శాతం(స్టాంప్, పెండిస్టార్) లేదా 700 మి.లీ.పెండిమిథాలిన్ 38.7శాతం ద్రావకం లేదా 400 మి.లీ. ప్రెటిలాక్లోర్ 50 శాతం  (రీఫిట్, ఎరేజ్) 200 లీటర్ల నీటిలో కలిపి స్ప్రే చేయాలి.

 విత్తిన 15 నుంచి 20 రోజుల మధ్య : ఏ కారణం చేతనైన విత్తిన వెంటనే కలుపు మందులు (స్ప్రే చేయకపోతే పొలంలో ఊద వంటి గడ్డి జాతి మొక్కలు ఉంటే ) ఎకరాకు 400మి.లీ.సైహాలోఫాప్ బుటైల్ 10శాతం (క్లించర్, రాప్ అప్) 200 లీ. నీటిలో కలిపి స్ప్రే చేయాలి. గడ్డి జాతి, వెడల్పాకు కలుపు మొక్కలు ఉంటే ఎకరాకు 100 మి.లీ. బిస్పైరిబాక్ సోడియం 10శాతం  (నామినీ గోల్డ్, తారక్) 200 లీటర్ల నీటిలో కలిపి విత్తిన 15-నుంచి 25 రోజుల మధ్య పిచికారి చేయాలి.

విత్తిన నెల రోజుల తర్వాత : పొలంలో వెడల్పాకు కలుపు మొక్కల ఉధృతి ఎక్కువగా ఉన్నప్పుడు ఎకరాకు 400 గ్రా. ..2:4-డి సోడియం సాల్టు 80శాతం (ఫెర్నాక్సోన్, గ్రీనోక్సన్, క్లీన్ 80, సాలిక్స్) 200 లీటర్ల నీటిలో కలిపి స్ప్రే చేయాలి. ఈ మందు స్ప్రే చేసినప్పుడు పైరు కొంచెం ఎర్రబడుతుంది. కనుక పై పాటుగా నత్రజని ఎరువును వేసుకోవాలి .  ఇదికాకపోతే  ఎకరాకు 50గ్రా.ఇథాక్సిసల్ఫ్యూరాన్ 15శాతం (సన్ రైస్) లేదా 8 గ్రా. మెట్ సల్ఫ్యూరాన్ మిథైల్ + క్లోరిమ్యురాన్ఇథైల్ 20శాతం (ఆల్ మిక్స్) 200 లీటర్ల నీటిలో కలిపి కలుపుపై పడేటట్లు పిచికారి చేయాలి.

దమ్ము చేసిన పొలంలో నేరుగా విత్తిన పైరులో

వరి విత్తిన 3-5 రోజుల్లోపు : పొలంలో నీరు పలుచగా ఉన్నప్పుడు ఎకరాకు 80గ్రా.పైరజోసల్ఫూరాన్ ఇథైల్ 10 శాతం (సాథి) ముందుగా అరలీటరు నీటిలో కలుపుకొని, ఆ ద్రావణాన్ని 20 కిలోల పొడి ఇసుకలో కలిపి పొలంలో సమానంగా చల్లాలి. ఈ మందు చల్లిన 2-3 రోజుల వరకు పొలంలోని నీరు బయటకు పోనివ్వటం ... బయట నీరు పొలంలోకి పెట్టటం కానీ చేయరాదు.

విత్తిన నెల రోజుల తర్వాత: పొలంలో వెడల్పాకు మొక్కల ఉధృతి ఎక్కువగా ఉన్నప్పుడు ఎకరాకు 400గ్రా. 2, 4-డి సోడియం సాల్టు 80శాతం (ఫెర్నాక్సోన్, గ్రీనోక్సన్, క్లీన్ 80, సాలిక్స్) 200 లీటర్ల నీటిలో కలిపి స్ప్రే చేయాలి. ఈ మందు స్ప్రే చేసినప్పుడు పైరు కొంచెం ఎర్రబారుతుంది. గనుక పై పాటుగా నత్రజని ఎరువును వేసుకోవచ్చు లేదా ఎకరాకు 50గ్రా. ఇథాక్సిసల్ఫ్యూరాన్ 15శాతం  (సన్ రైస్) పొడి మందును లేదా 8 గ్రా. మెట్ సల్ఫ్యూరాన్ మిథైల్+ క్లోరిమ్యురాన్ ఇథైల్ 20శాతం (ఆల్ మిక్స్) 200 లీటర్ల నీటిలో కలిపి పిచికారి చేయాలి.

 మాగాణి వరిలో 

 నారుమడి : నారుమడిలో ఊద నిర్మూలనకు ఒక ఎకరం నారుమడికి ప్రెటిలాక్లోర్ 50శాతం ద్రావకం 400 మి.లీ. (రీఫిట్,ఎరేజ్) 200 లీటర్ల నీటిలో కలిపి నారుమడి విత్తిన 2 లేదా 3 రోజులలో పిచికారి చేయాలి లేదా విత్తిన 14 -నుంచి15 రోజులప్పుడు ఊద నిర్మూలనకు ఎకరం నారుమడికి 400 మి.లీ.సైహాలోఫాప్ బ్యుటైల్ 10శాతం  (క్లించర్, రాప్ అప్) 200 లీటర్ల నీటిలో కలిపి పిచికారి చేయాలి. ఊద, వెడల్పాకు కలుపు మొక్కలు నారుమడిలో ఉన్నప్పుడు నారుమడి విత్తిన 15 రోజులకు ఎకరాకు 100 మి.లీ.బిస్పైరిబాక్ సోడియం 10శాతం  ద్రావకం (నామిని గోల్డ్, తారక్, అడోరా) 200 లీ. నీటిలో కలిపి పిచికారి చేయాలి.

నాటిన వరి పొలంలో :ఊద మొదలగు ఏక వార్షిక గడ్డిజాతి మొక్కలు ఎక్కువగా ఉన్నప్పుడు 1.0 నుండి 1.5 లీటర్ల బ్యుటాక్లోర్ 50శాతం  (మాచెటి, హిల్టాక్లోర్) లేదా 80 గ్రా.పైరజోసల్ఫూరాన్ ఇథైల్ 10శాతం  పొడి మందు (సాథి) లేదా 400 మి.లీ. ప్రెటిలాక్లోర్ 50శాతం  (రీఫిట్, ఎరేజ్) లలో ఏదో ఒకదానిని ఎకరాకు 20 కిలోల పొడి ఇసుకలో కలిపి, నాటిన 3 నుంచి 5 రోజుల్లో పలుచగా నీరు ఉన్నప్పుడు చల్లాలి.

 గడ్డి, తుంగ, వెడల్పాకు కలుపు మొక్కలు ఉన్నప్పుడు ఎకరాకు 4 కిలోలు బెన్ సల్ఫ్యురాన్ మిథైల్ (0.6శాతం) + ప్రెటిలాక్లోర్ (6 శాతం) (లోండాక్స్ పవర్) గుళికలు లేదా 4 కిలోలు బ్యుటాక్లోర్ 5శాతం గుళికలు మరియు 4 కిలోలు 2,4-డి. ఇథైల్ ఎస్టర్ 4శాతం గుళికలు 20 కిలోల పొడి ఇసుకలో కలిపి, నాటిన 3 నుంచి 5 రోజులలో పొలంలో నీరు పలుచగా ఉన్నప్పుడు సమానంగా వెదజల్లాలి.

నాటిన 15 నుంచి 25 రోజుల సమయంలో...  గడ్డి, వెడల్పాకు కలుపు మొక్కలు ఉంటే ఎకరాకు 100 మి.లీ. బిస్పైరిబాక్ సోడియం 10శాతం (నామిని గోల్డ్, తారక్, అడోరా) 200 లీ. నీటిలో కలిపి పొలంలో నీరు తీసి పిచికారీ చేయాలి.

 25నుంచి 30 రోజులప్పుడు....  పొలంలో వెడల్పాటి కలుపు మొక్కల ఉధృతి ఎక్కువగా ఉంటే ఎకరాకు 400 గ్రా. 2,4-డి సోడియం సాల్టు 80శాతం (ఫెర్నాక్సోన్, గ్రీనోక్సన్, క్లీన్ 80, సాలిక్స్) లేదా 400 మి.లీ. 2,4-డి ఎమైన్ సాల్ట్ 58శాతం ద్రావకం (వీడ్మార్ సూపర్, వీడార్ 58) లేదా 50గ్రా. ఇథాక్సిసల్ఫూరాన్ 15శాతం (సన్ రైస్) లేదా 8 గ్రా. మెట్ సల్ఫ్యూరాన్ మిథైల్+ క్లోరిమ్యురాన్ ఇథైల్ 20శాతం (ఆల్మిక్స్) 200 లీటర్ల నీటిలో కలిపి పిచికారి చేయడం ద్వారా వెడల్పాటి కలుపు మొక్కలను నివారించవచ్చు.

వీలైనంత వరకు పంట భూములకు బాగా చివికిన పెంట లేదా చెరువు మట్టి తోలి భూమిలో కలిసేలా గుంటక తోలి, సారవంతం చేసుకోవాలి. సిఫారసు చేయబడిన అధిక దిగుబడినిచ్చే రకాలను ఎంపిక చేసుకొని నాణ్యమైన విత్తనాన్ని గుర్తింపు పొందిన సంస్థల నుండి ముందుగా సేకరించి సకాలంలో విత్తుకోవడానికి సిద్ధం చేసుకోవాలి.  . . .