పాలమూరు ప్రగతికై సమగ్ర నివేదికలివ్వండి : దామోదర రాజనర్సింహ

  • మంత్రులు దామోదర రాజనర్సింహ, జూపల్లి కృష్ణారావు
  • 9న సీఎం పర్యటన నేపథ్యంలో ఆఫీసర్లు, ఎమ్మెల్యేలతో రివ్యూ

మహబూబ్​నగర్/పాలమూరు, వెలుగు: సీఎం రేవంత్​ రెడ్డి ఈ నెల 9న పాలమూరుకు వస్తున్నారని, ఉమ్మడి జిల్లాలోని సమస్యల గురించి సీఎంకు పక్కా సమాచారం అందించాలని జిల్లా ఇన్​చార్జి, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ, ఎక్సైజ్, పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు ఆఫీసర్లకు సూచించారు. పాలమూరు ప్రాజెక్టులు, విద్య, వైద్యం, పాలమూరు పర్యాటకంపై ఈ నెల 9న జిల్లా కేంద్రంలో సీఎం రివ్యూ నిర్వహించనున్నారు. ఈ నేపథ్యంలో ఆదివారం సాయంత్రం ఉమ్మడి జిల్లా ఎమ్మెల్యేలు యెన్నం శ్రీనివాస్​ రెడ్డి, వాకిటి శ్రీహరి, బండ్ల కృష్ణమోహన్​ రెడ్డి, వీర్లపల్లి శంకర్, పర్ణికా రెడ్డి, జి.మధుసూదన్​ రెడ్డి, కూచకుళ్ల రాజేశ్​ రెడ్డి, కసిరెడ్డి నారాయణరెడ్డి, మేఘారెడ్డి, చిక్కుడు వంశీకృష్ణతో కలిసి మంత్రులు మహబూబ్​నగర్​ కలెక్టరేట్​లో జిల్లా కలెక్టర్లు, ఆఫీసర్లతో రివ్యూ నిర్వహించారు.

సీఎం దృష్టికి ఉమ్మడి జిల్లా సమస్యలు..

రివ్యూలో హెల్త్ మినిస్టర్  మాట్లాడుతూ సీఎం పర్యటన సందర్భంగా ఉమ్మడి జిల్లాలో అభివృద్ధి,పెండింగ్ సమస్యలను వివరిస్తామన్నారు. ఉమ్మడి జిల్లా ప్రాజెక్టులను గత ప్రభుత్వం నిర్లక్ష్యం చేసిందన్నారు. పీఆర్ఎల్ఐకి సంబంధించి చేయాల్సిన పనులు, ప్రతిపాదిత వ్యయం గురించి నివేదిక రూపొందించాలని ఎంపీ మల్లు రవి, ఎమ్మెల్యేలు కోరారు. ప్రతి నియోజకవర్గంలో నాలుగైదు టీఎంసీల కెపాసిటీతో రిజర్వాయర్లు నిర్మించాలని, అందుకు భూ సేకరణ చేయాలని సూచించారు. పీహెస్​సీలను అప్​గ్రేడ్ చేయాలని, హాస్పిటళ్లలో సిటీ స్కాన్, ఎక్స్​రే, శానిటేషన్, సెక్యూరిటీ సిబ్బందిని నియమించాలని విన్నవించారు. కేజీబీవీల్లో తాగునీరు, వాష్ రూమ్​లు నిర్మించాలన్నారు. పాలమూరు పర్యాటక అభివృద్ధిపై కూడా దృష్టి పెట్టాలని మంత్రిని ఎమ్మెల్యేలు కోరారు. ఈ విషయాలన్నిటి గురించి సీఎంకు వివరిస్తామని మంత్రి తెలిపారు.

నిట్​ ప్రపోజల్స్​ను సీఎంకు ఇవ్వండి..

పాలమూరుకు నిట్(నేషనల్  ఇన్​స్టిట్యూట్  ఆఫ్  టెక్నాలజీ) ఏర్పాటుకు​ ప్రపోజల్స్ తయారు చేసి సీఎంకు అందజేస్తే,  తప్పకుండా ఆమోదిస్తారని  ఎమ్మెల్యే యెన్నం మంత్రుల దృష్టికి తీసుకెళ్లారు. రివ్యూలో యెన్నం మాట్లాడుతూ హాస్పిటళ్ల​నిర్వహణ కోసం ఫండ్స్​ ఇవ్వాలన్నారు. రెడ్ క్రాస్, లయన్స్ క్లబ్​ల సేవలు వినియోగించుకోవాలన్నారు. హాస్పిటల్​ ముందున్న స్థలంలో షాపింగ్ కాంప్లెక్స్  నిర్మిస్తే, హాస్పిటల్​కు సొంత నిధులు కూడా సమకూర్చుకునే  అవకాశం ఉంటుందన్నారు. ఈ విషయాలను సీఎం దృష్టికి తీసుకెళ్లాలన్నారు.

ఎడ్యుకేషన్​కు సంబంధించి ఎలాంటి అవసరాలు ఉన్నాయి? హాస్టల్స్, సమకూర్చాల్సిన సౌలతులు, కాలేజ్ బిల్డింగులు, ఇన్ఫ్రాస్ట్రక్చర్, బోధనా సిబ్బంది తదితర అంశాలపై ఎస్టిమేషన్​లు రెడీ చేసి అందించాలని సూచించారు. ఉమ్మడి జిల్లాలోని ప్రతి స్కూల్​ను విజిట్ చేయాలని అధికారులను ఎమ్మెల్యే ఆదేశించారు. నాగర్ కర్నూల్ ఎంపీ మల్లు రవి, మహబూబ్​నగర్  కలెక్టర్​ విజయేందిర బోయి, ఎస్పీ డి.జానకి, ఏఐసీసీ సెక్రటరీ సంపత్​ కుమార్, మైనార్టీ కార్పొరేషన్​ చైర్మన్​ ఒబేదుల్లా కొత్వాల్, గద్వాల మాజీ జడ్పీ చైర్​పర్సన్​ సరిత, మున్సిపల్​ చైర్మన్​ ఆనంద్​ గౌడ్​ 
పాల్గొన్నారు.