ఎఫ్టీఎల్, బఫర్​ జోన్లలోని 315 ఇండ్లకు నోటీసులు

  • ఖాళీ చేయాలని రెవెన్యూ, ఇరిగేషన్ ఆఫీసర్ల హుకుం 
  • చందానగర్, కూకట్ పల్లి, బాలానగర్, మేడిపల్లి ప్రాంతాల్లో జారీ
  • ఆందోళన చెందుతున్న స్థానికులు

వెలుగు, సిటీ నెట్ వర్క్ : సిటీలోని పలు చెరువుల ఎఫ్టీఎల్, బఫర్ జోన్లలోని నిర్మాణాలకు గురువారం రెవెన్యూ, ఇరిగేషన్ అధికారులు నోటీసులు జారీ చేశారు. చందానగర్, కూకట్ పల్లి, బాలానగర్, మేడిపల్లి ప్రాంతాల్లో మొత్తం 315 ఇండ్లకు నోటీసులు జారీ చేశారు. ఒక్కసారిగా నోటీసులు రావడంతో జనం ఆందోళనకు గురయ్యారు. ఏండ్లుగా ఇక్కడే ఉంటున్నామని, ఇప్పుడు నోటీసులువ్వడమేమిటని అధికారులపై మండిపడ్డారు. 

హస్మత్​పేటలో 140 కుటుంబాలకు..

హస్మత్ పేటలోని బోయిన్ చెరువు ఎఫ్టీఎల్​లో ఉన్న 140 కుటుంబాలకు రెవెన్యూ అధికారులు నోటీసులిచ్చారు. వారంలో ఖాళీ చేయకపోతే కూల్చివేస్తామని అందులో పేర్కొన్నారు. కూకట్​పల్లి మండలం అల్లాపూర్​లోని సున్నం చెరువు ఎఫ్టీఎల్ పరిధిలో ఇరిగేషనర్ అధికారులు 20 ఇండ్లకు, అంబీర్​చెరువు బఫర్ జోన్ లో  వంద ఇండ్లు ఉన్నట్లు గుర్తించిన ఇరిగేషన్​శాఖ అధికారులు  40 ఇండ్లకు నోటీసులు జారీ చేశారు. మరో  60 మందికి కూడా నోటీసులు జారీ చేయనున్నారు. 

విషయం తెలుసుకున్న మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్ హస్మత్ పేట్ లోని బోయిని చెరువును విజిట్​చేసి బాధితులతో మాట్లాడారు. కమర్షియల్ గా ఉన్న జయలక్ష్మి గార్డెన్ తో పాటు కాంగ్రెస్ నేతల ఇండ్లకు ఇవ్వకపోవడం ఏమిటన్నారు. 40 ఏండ్ల తరువాత నోటిసులు ఎలా ఇస్తారంటూ ప్రశ్నించారు.  

చందానగర్ లో 65 ఇండ్లకు నోటీసులు

చందానగర్ గంగారం పెద్ద చెరువు ఎఫ్టీఎల్ లో ఉన్న ఇండ్లకు శేరిలింగంపల్లి రెవెన్యూ అధికారులు నోటీసులు జారీ చేశారు. చెరువు ఎఫ్ఎఎల్, బఫర్ జోన్ అక్రమించి నిర్మించిన 65 ఇండ్లకు శేరిలింగంపల్లి తహసీల్దార్ నోటీసులిచ్చారు. ఇందులో శ్రీరాంనగర్ కాలనీలో 26 ఇండ్లు, మిగతావి కేఎస్ ఆర్ కాలనీలో ఉన్నాయి.  30 రోజుల్లో ఎఫ్టీఎల్, బఫర్ జోన్లలో కట్టిన నిర్మాణాలను తొలగించాలని, లేకపోతే తామే కూల్చివేస్తామని నోటీసుల్లో పేర్కొన్నారు. 

ఈ కాలనీలో ఎక్కువగా రిటైర్డ్ బీహెచ్ఈఎల్, హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ ఉద్యోగులు ఉంటున్నారు. దీంతో కాలనీవాసులు భయపడుతున్నారు. ఎన్నో ఏండ్లుగా ఉంటున్నామని, ఇప్పుడు కూల్చేస్తే ఎటు పోవాలని ప్రశ్నిస్తున్నారు. శ్రీరాంనగర్ కాలనీ 1982-–83లో 99 ప్లాట్లతో లే అవుట్ నిర్మించినట్లు కాలనీ ప్రెసిడెంట్ రఘునాథ్ రెడ్డి తెలిపారు. అన్నీ అనుమతులు తీసుకొని ఇండ్లు కట్టుకొని ఉంటున్నామన్నారు. 2019లో ఇదే విధంగా నోటీసులు ఇచ్చారని, వాటికి రిప్లై ఇచ్చామని తెలిపారు.

పీర్జాదిగూడలో 50 మందికి..

మేడిపల్లి మండలం పీర్జాదిగూడ కార్పొరేషన్ లోని పెద్ద చెరువు పరిధిలో ఉన్న 50 మందికి తహసీల్దార్​హసీనా నోటీసులు ఇచ్చారు. మేడిపల్లి తహసీల్దార్​ఆఫీసుకు ఎదురుగా పెద్ద చెరువు 40 ఎకరాల విస్తీర్ణంలో ఉంది. 15 ఏండ్లలో చెరువుకు చెందిన 10 ఎకరాలు కబ్జా కాగా, కొంతమంది హైకోర్టును ఆశ్రయించారు. కోర్టు ఆదేశాలతో తహసీల్దార్​నోటీసులు ఇచ్చారు. వెంటనే ఖాళీ చేయాలని లేకపోతే చర్యలు తప్పవని హెచ్చరించారు.