తెలంగాణను ఆదుకోండి..ఏపీతో సమానంగా నిధులివ్వండి

  • కేంద్రమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్​కు సీఎం రేవంత్ రెడ్డి విజ్ఞప్తి 
  • వరద నష్టం ప్రాథమిక అంచనా రూ.5,438 కోట్లు.. అది ఇంకా పెరిగే చాన్స్
  • చెరువులు, కాల్వలు, రోడ్లు, బ్రిడ్జిల రిపేర్లకు తక్షణ సాయమందించండి 
  • ఎన్డీఆర్ఎఫ్ నిధుల వినియోగానికి నిబంధనలు సడలించాలి
  • మరమ్మతులకు నిర్దేశించిన రేట్లను పెంచాలని వినతి
  • సెక్రటేరియెట్​లో సీఎంతో కేంద్రమంత్రులు చౌహాన్, బండి సంజయ్ సమావేశం 

హైదరాబాద్, వెలుగు : భారీ వర్షాలు, వరదలతో తెలంగాణ అతలాకుతలమైందని, అపార నష్టం వాటిల్లిందని.. కేంద్ర ప్రభుత్వం ఆదుకోవాలని కేంద్రమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్​కు సీఎం రేవంత్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. ‘‘రాష్ట్రంలో వరదల వల్ల జరిగిన నష్టం దాదాపు రూ.5,438 కోట్లు ఉంటుందని  ప్రాథమికంగా అంచనా వేశాం. అధికారులు వివరాలు సేకరిస్తున్నారు. సమగ్ర వివరాలు అందిన తర్వాత ఈ నష్టం మరింత పెరిగే అవకాశం ఉంది” అని వివరించారు. ‘‘ఆంధ్రప్రదేశ్​లోనూ వరదల వల్ల భారీ నష్టం జరిగింది. తెలంగాణలో ఎక్కువగా నష్టం జరిగిన ఖమ్మం, మహబూబాబాద్ జిల్లాలు ఏపీకి సమీపంలోనే ఉన్నాయి. 

అందుకే ఏపీకి ఎలా సాయం అందిస్తారో, అదే విధంగా తెలంగాణకూ అందించాలి. రెండు రాష్ట్రాల్లో జరిగిన వరద నష్టాన్ని ఒకే తీరుగా చూడాలి” అని కోరారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో జరిగిన నష్టాన్ని పరిశీలించేందుకు కేంద్రమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ తెలంగాణకు వచ్చారు.కేంద్రమంత్రి బండి సంజయ్ తో కలిసి శుక్రవారం సెక్రటేరియెట్ లో సీఎం రేవంత్ రెడ్డితో ఆయన సమావేశమయ్యారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో వర్షాలు, వరదల వల్ల జరిగిన నష్టంపై కేంద్రమంత్రులకు సీఎం రేవంత్ వివరించారు. 

వరదలతో తీవ్ర నష్టం.. 

వరద ప్రభావిత ప్రాంతాల్లోని ప్రజలు చాలా నష్టపోయారని, ఆయా ప్రాంతాల్లో ఇప్పటికీ ఇబ్బందికర పరిస్థితులే ఉన్నాయని కేంద్రమంత్రులకు సీఎం రేవంత్ తెలిపారు. తక్షణ సాయంగా వరద బాధిత కుటుంబాలకు రూ.10 వేలు పంపిణీ చేస్తున్నామని చెప్పారు. ‘‘ఖమ్మం, మహబూబాబాద్, సూర్యాపేటతో పాటు పలు జిల్లాల్లో ఒకేరోజు అత్యధికంగా 40 సెంటీమీటర్ల వర్షం కురిసింది. మేం అప్రమత్తంగా వ్యవహరించడంతో భారీ ప్రాణ నష్టం తప్పింది. కానీ వరద నష్టం తీవ్రంగా ఉంది. వరద ప్రభావిత ప్రాంతాల్లో తీవ్ర పంట నష్టం జరిగింది. పొలాలన్నీ రాళ్లు, ఇసుక మేటలతో నిండిపోయాయి. 

హైవేలు, రోడ్లు, ఇండ్లు, బ్రిడ్జిలు చాలాచోట్ల ధ్వంసమయ్యాయి. రాకపోకలు స్తంభించాయి” అని వివరించారు. వరద ప్రభావిత ప్రాంతాల్లోని పరిస్థితులను పవర్ పాయింట్ ప్రజెంటేషన్, ఫొటో ఎగ్జిబిషన్ ద్వారా కేంద్రమంత్రులకు చూపించారు. మహబూబాబాద్ జిల్లాలో కొట్టుకుపోయిన రైల్వే ట్రాక్ పరిస్థితిపై వివరించారు. 

మరమ్మతులకు నిధులివ్వండి.. 

తెగిన చెరువులు, కుంటలు, దెబ్బతిన్న రోడ్లు, బ్రిడ్జిల తాత్కాలిక మరమ్మతులకు తక్షణమే సాయం అందించాలని కేంద్రమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ కు సీఎం రేవంత్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. వాటి పునరుద్ధరణ పనులకు తగినన్ని నిధులు కేటాయించాలని కోరారు. ‘‘ఎన్డీఆర్ఎఫ్ నిధుల వినియోగానికి నిబంధనలను సడలించాలి. ఎస్డీఆర్ఎఫ్ నిధుల్లో 50 శాతం ఉపయోగిస్తే, ఎన్డీఆర్ఎఫ్ నిధులు వాడుకునేలా గతంలో రాష్ట్రాలకు వెసులుబాటు ఉండేది. 

2021 వరకు ఇదే విధానం అమల్లో ఉంది. కానీ ఇప్పుడు వంద శాతం ఎస్డీఆర్ఎఫ్ నిధులు వినియోగిస్తేనే, శాశ్వత మరమ్మతులకు ఎన్డీఆర్ఎఫ్ నిధులు వాడుకోవాలనే నిబంధన విధించారు. ఈ నిబంధనను తొలగించాలి” అని విజ్ఞప్తి చేశారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో తక్షణ మరమ్మతులు, శాశ్వత పునరుద్ధరణ పనులకు అంశాల వారీగా నిర్దేశించిన యూనిట్ రేట్లను కూడా పెంచాలని కోరారు. 

రాష్ట్రంలో వరదలతో దెబ్బతిన్న చెరువులు, కుంటల తక్షణ మరమ్మతులకు కనీసం రూ.60 కోట్లు అవసరమవుతాయని, కానీ ఇప్పుడున్న రేట్ల ప్రకారం రూ.4 కోట్లు కూడా విడుదల చేసే పరిస్థితి లేదన్నారు. సమావేశంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, సీఎం సలహాదారు వేం నరేందర్​రెడ్డి తదితరులు పాల్గొన్నారు.  

ఆయిల్ పామ్​కు మద్దతు ధర రూ.15 వేలు ఇవ్వాలి : మంత్రి తుమ్మల  

ఆయిల్ పామ్ పంటకు సరైన ధర వచ్చే విధంగా చూడాలని కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్​కు రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మ ల నాగేశ్వరరావు విజ్ఞప్తి చేశారు. ఆయిల్ పామ్​కు మద్దతు ధర లభించక రైతులు ఇబ్బందులు పడుతున్నారని చెప్పారు. ‘‘గతంలో ఆయిల్ పామ్ టన్నుకు రూ.20 వేలు ఉండేది. ఇటీవల కస్టమ్స్​డ్యూటీని ఎత్తివేయడంతో టన్ను ధర రూ.12 వేలే చెల్లిస్తున్నారు. దీంతో రైతులకు గిట్టుబాటు కావడం లేదు. 2024–-25లో ఆయిల్ పామ్ మద్దతు ధర రూ.15 వేలు ఉండేలా చర్యలు తీసుకోండి” అని కోరారు. 

ప్రజలకు సాయంలో రాజకీయాలకు తావు లేదు

విపత్తులు వచ్చినప్పుడు ఆపదలో ఉన్న ప్రజలకు సాయం చేసే విషయంలో పార్టీలు, రాజకీయాలకు తావు లేదు. కలిసికట్టుగా బాధిత కుటుంబాలను ఆదుకోవాల్సి ఉంటుంది. - శివరాజ్ సింగ్ చౌహాన్, కేంద్రమంత్రి