కాంగ్రెస్​లో ఫుల్​ జోష్​..కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపన

  •     మొదటిసారి సొంత నియోజకవర్గానికి సీఎం రేవంత్​
  •     రూ.4,369 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపన
  •     ఉమ్మడి జిల్లా నుంచి తరలివచ్చిన లక్ష మంది

మహబూబ్​నగర్/కోస్గి/కొడంగల్, వెలుగు : పార్లమెంట్​ ఎన్నికలకు ముందు కాంగ్రెస్​ క్యాడర్​లో సీఎం రేవంత్​రెడ్డి పర్యటన ఫుల్​ జోష్​ నింపింది. సీఎంగా బాధ్యతలు చేపట్టిన తర్వాత తొలిసారిగా తన సొంత నియోజకవర్గమైన కొడంగల్​లో పర్యటించారు. గతంలో ఎన్నడూ లేనివిధంగా నియోజకవర్గంలో రూ.4,369 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. అలాగే దశాబ్దాలుగా ఎదురు చూస్తున్న కొడంగల్​ లిఫ్ట్​ను టేకప్​ చేసేందుకు రూ.2 వేల కోట్లకు పైగా నిధులు కేటాయించారు.

ఈ స్కీం కింద 1.07 లక్షల ఎకరాల ఆయకట్టుకు సాగునీటిని అందించాల్సి ఉండగా, అదనంగా 30 వేల ఎకరాలతో కలుపుకొని మొత్తం 1.37 లక్షల ఎకరాలకు సాగునీటిని అందించనున్నారు. ఈ విషయాన్ని సీఎం ప్రకటించగా, సభకు వచ్చిన ప్రజలు చప్పట్లతో ఆనందాన్ని వ్యక్తం చేశారు. 

మహళా సంఘాలతో ఆత్మీయ సమావేశం

ముందుగా సీఎం హెలికాప్టర్​ ద్వారా కోస్గికి చేరుకున్నారు. అక్కడి ఫుట్​బాల్ గ్రౌండ్​లో ఏర్పాటు చేసిన మహిళా స్వయం సహాయక సంఘాల ఆత్మీయ సమావేశానికి హాజరయ్యారు. అక్కడ పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు. అక్కడే అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేశారు. మహిళా స్వయం సహాయక సంఘాలు ఏర్పాటు చేసిన స్టాల్స్​ను సందర్శించి వారితో ముచ్చటించారు. అనంతరం మహిళా సంఘాల ప్రతినిధులతో ఆత్మీయ సమావేశంలో మాట్లాడారు.

ఈ సందర్భంగా మహిళా సంఘాల తరఫున శ్రీదేవి, పోలేపల్లి గ్రామం నుంచి పద్మమ్మ, కోస్గి మండలం ఈజీపూర్ నుంచి దివ్యాంగురాలు మొగులమ్మ, వికారాబాద్ జిల్లా హుస్నాబాద్​కు చెందిన వసంత, దౌల్తాబాద్​కు చెందిన యశోదమ్మ, శ్రీదేవి మహిళ సంఘాల్లో చేరి సాధించిన విజయాలను సీఎంకు వివరించారు. హాజమ్మ జోగిని వ్యవస్థపై మాట్లాడారు. 

భారీగా తరలి వచ్చిన పబ్లిక్..

సీఎం మొదటి సారి సొంత నియోజకవర్గానికి రావడంతో ఉమ్మడి మహబూబ్​నగర్​ జిల్లాలోని అన్ని ప్రాంతాల నుంచి దాదాపు లక్ష మంది ప్రజలు తరలి వచ్చారు. సీఎం రాక సందర్భంగా కోస్గిలో పెద్ద ఎత్తున ప్లెక్సీలు, భారీ కటౌట్లు ఏర్పాటు చేశారు. సీఎం సభకు వస్తుండగా.. పెద్ద పెట్టున ఈలలు, కేరింతలు కొట్టారు. సీఎం రాక సందర్భంగా అడుగడుగునా పోలీసు బందోబస్తును ఏర్పాటు చేశారు. సభ సందర్భంగా పట్టణంలో ట్రాఫిక్​ సమస్య ఏర్పడకుండా వన్​ వే ఏర్పాటు చేశారు.