కొత్త క్రిమినల్ చట్టాలు... మరెన్నో కష్టాలు : జిల్లా జడ్జి డా. మంగారి రాజేందర్

భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చిన తరువాత క్రిమినల్​ప్రొసీజర్​ కోడ్​1898ని తొలగించి కొత్త  క్రిమినల్​ ప్రొసీజర్ ను పార్లమెంటు తీసుకువచ్చింది. అంటే క్రిమినల్ ప్రొసీజర్​ కోడ్​ అనేది అందరూ అంటున్నట్లు మెకాలే కాలానికి చెందింది కాదు.  పాత క్రిమినల్ ప్రొసీజర్​ కోడ్​కి చాలా భిన్నంగా ఉంది.  ప్రయోజనకారిగా కూడా ఉంది. క్రిమినల్​ ప్రొసీజర్​ కోడ్​ 1973ని ఆ విధంగా తీసుకురావడానికి ముందు దేశంలోని అన్ని హైకోర్టు న్యాయమూర్తులతో సంప్రదింపులు జరిగాయి.  నాలుగు లా కమిషన్లు పాత క్రిమినల్​ ప్రొసీజర్​ కోడ్​లో మార్పులను తీసుకువచ్చాయి. వలసవాద నిబంధనలు ఉన్నాయని పాత క్రిమినల్​ ప్రొసీజర్​ విమర్శలకు గురైంది. 

ఆ తరువాత 37వ లా కమిషన్​ కొన్ని మార్పులు సూచించింది. అక్కడితో అయిపోలేదు. 24 సెప్టెంబర్​ 1969న లా కమిషన్​ ఆఫ్​ ఇండియా 385 పేజీల నివేదికను ప్రభుత్వానికి అందించింది. వలసవాద వారసత్వం ఉన్న నిబంధనలను అంతం చేసేవిధంగా లా కమిషన్​ తన సూచనలను చేసింది. తన నివేదికను ఆవిధంగా తీసుకురావడానికి దేశంలోని అన్ని హైకోర్టుల న్యాయమూర్తులు సహాయం చేశారని పేర్కొంది. ఆరు భారతీయ లా కమిషన్లు 13 సంవత్సరాలుగా చేసిన కృషి ఫలితంగా కొత్త క్రిమినల్​ ప్రొసీజర్​ కోడ్​ 1973ని పార్లమెంటు ఆమోదించింది. అది 2 ఏప్రిల్​ 1974 నుంచి అమల్లోకి వచ్చింది.  అందుకని ఈ చట్టాన్ని వలసవాద చట్టం అని అనలేం.  ఇప్పుడు కొత్తగా వచ్చిన భారతీయ నాగరిక సురక్ష సంహితలో కొన్ని చిన్నచిన్న మార్పులు తప్ప పెద్ద మార్పులేమీ లేవు.  కొన్ని మార్పులతో వచ్చిన కొత్త చట్టమే బీఎన్ఎస్ఎస్.  పాత చట్టానికి అవసరమైన మార్పులను తీసుకువస్తే సరిపోయేది.  ఆవిధంగా చేయలేదు. 

భారత పౌరుల రక్షణ కోడ్ 2023

ఈ కొత్త చట్టంలోని ప్రవేశికలో ఈ విధంగా పేర్కొన్నారు.  క్రిమినల్​ ప్రొసీజర్​ కోడ్​కి కొన్ని మార్పులు చేయడానికి చట్టం తీసుకువస్తున్నాం. క్రిమినల్​ ప్రొసీజర్​ కోడ్​లోని టైటిల్​ఆ కోడ్​కి తగినట్టుగా ఉంది.  కానీ, బీఎన్ఎస్ఎస్​ ఆవిధంగా లేదు.  దాని నామధేయాన్ని ఈవిధంగా అర్థం చెప్పవచ్చు. ‘భారత పౌరుల రక్షణ కోడ్ 2023’.  ఈ సంహిత భారత పౌరులను ఏరకంగా రక్షిస్తుందో ఎక్కడా చెప్పలేదు. బాధితులకు కూడా సరైన రక్షణను కల్పిస్తున్నట్లుగా అనిపించడం లేదు. నాగరిక్​ అంటే ఫిర్యాదుదారుడు కావొచ్చు. ముద్దాయి కావొచ్చు. బాధితులు కావొచ్చు. వీరి బాధలను ఈ సంహిత ఏవిధంగా నివారిస్తుంది. క్రిమినల్​ ప్రొసీజర్​ కోడ్​కి మించి వీరికి ఎలాంటి రక్షణను ఈ సంహిత కల్పిస్తుందో అర్థం కాదు. శాసనాలు ప్రధానంగా రెండు రకాలు. సబ్ స్టాన్టివ్​ లా,  ప్రొసీజర్​ లా.  మొదటి శాసనంలో నేరం అంటే ఏమిటి, దానికి ఉన్న శిక్షలు ఏమిటీ అన్న విషయాలతోపాటు హక్కులను తెలియజేస్తోంది. 

కాలయాపన జరిగే అవకాశం

పాత ప్రొసీజర్​ కోడ్​లోని నిబంధనలూ అనుకూలంగాలేవని పోలీసులు కొత్త నిబంధనలను అమలుని కోరవచ్చు. అదేవిధంగా కొన్ని సందర్భాల్లో ముద్దాయి కూడా కొత్త నిబంధనలను ఆశ్రయించవచ్చు. ఎవరు ఆశ్రయించినా విచారించే కోర్టు ఏదో ఒక నిర్ణయాన్ని ప్రకటించాల్సి ఉంటుంది. ఆ నిర్ణయంతో ఏకీభవించని పార్టీలు హైకోర్టుకు వెళ్లే అవకాశం ఉంది. కాలయాపన ఎక్కువ జరిగే అవకాశం ఏర్పడుతుంది. ప్రాసిక్యూటర్లు, పోలీసు అధికారులు కొత్త ప్రొసీజర్​ నిబంధనలను అదేవిధంగా  ముద్దాయిలు పాత నిబంధనలను కోరవచ్చు. ఏది ఏమైనా ఓ గందరగోళ పరిస్థితి ఏర్పడే అవకాశం ఉంది. హైకోర్టు, సుప్రీంకోర్టులు వ్యాఖ్యానం కోసం వేచి చూడాల్సి వస్తుంది. అంతేకాదు కొన్ని విచిత్రమైన పరిస్థితులను పోలీసులు, కోర్టులు ఎదుర్కోవాలి. ఉదాహరణకు జూన్​ నెలలో ఒక వ్యక్తి కత్తిపోటుకి గురైనాడని అనుకుందాం. అప్పుడు కేసు ఇండియన్​ పీనల్​ కోడ్​ ప్రకారం నమోదు అవుతుంది. ఆ వ్యక్తి  జులై 2024  చివరిలో ఆ  కత్తిపోటు వల్ల చనిపోయాడని అనుకుందాం. అప్పుడు కేసులో తీవ్రత పెరుగుతుంది. దర్యాప్తు అధికారికి సందేహం వస్తుంది. సె.302 ఐపీసీ కేసును మార్చాలా లేక 103 (1) బీఎన్ఎస్​ ప్రకారం మార్చాలని అని మొదటి సందేహం వస్తుంది. ఇక్కడితో అయిపోదు.  క్రిమినల్​ ప్రొసీజర్​ కోడ్​లో చెప్పినవిధంగా దర్యాప్తు కొనసాగించాలా,  సంహితలో చెప్పినట్లు కొనసాగించాలా అని మరో సందేహం తలెత్తుతుంది. 

కొత్త క్రిమినల్ చట్టాలపై..సమగ్ర చర్చ జరగలే

మూడో ఉదాహరణకి వస్తే జూన్​ 30 రాత్రి 11గంటల ప్రాంతంలో ఐదుగురు దుండగులు ఒక ఇంటిలో ప్రవేశించి దోపిడీ చేశారు.  ఆ దోపిడీ చేసే క్రమంలో ఆ ఇంటిలో ఉన్న యువతిపై సామూహిక అత్యాచారం చేశారు. ఈ సంఘటన 12 గంటల నుంచి రాత్రి ఒంటిగంట మధ్య జరిగింది. అనంతరం ఆ అమ్మాయిని రాత్రి రెండుగంటల ప్రాంతంలో హత్య చేశారు. ఇదీ నేర సంఘటన. ఈ నేర సమాచారం పోలీసులుకు జులై 1, 2024 ఉదయం 7గంటలకు అందింది. దోపిడీ నేరం జరిగింది జూన్​ 30 రాత్రి 11గంటల ప్రాంతంలో అప్పుడు వర్తించే చట్టం భారతీయ శిక్షాస్మృతి, క్రిమినల్​ ప్రొసీజర్​ కోడ్​, సామూహిక అత్యాచారం, హత్యా నేరాలు జరిగింది జులై1, 2024లో. అంటే కొత్త చట్టాలు అమల్లోకి వచ్చిన తరువాత. ఈ పరిస్థితుల్లో కేసుని ఏవిధంగా  నమోదు చేయాలి? ఏ విధంగా పరిశోధన చేయాలి. భారతీయ శిక్షాస్మృతి, క్రిమినల్​ ప్రొసీజర్​ కోడ్​ ప్రకారమా లేక భారతీయ న్యాయసంహిత, భారతీయ నాగరిక్​ సురక్షా సంహితల ప్రకారమా? ఇవన్నీ మిలియన్​ డాలర్ల ప్రశ్నలు. వీటికి సమాధానాలు కొత్త చట్టాల్లో లేవు. వీటిమీద సుప్రీంకోర్టు, హైకోర్టులు ఇచ్చే భాష్యం కోసం వేచి చూడటం తప్ప మరో మార్గం కనిపించడం లేదు. క్రిమినల్​ ప్రొసీజర్​ కోడ్​ 1973 రావడానికి ఐదు లా కమిషన్లు 13 సంవత్సరాలు పనిచేసి తీసుకువచ్చారు. ఈ కొత్త క్రిమినల్​ చట్టాలపై సమగ్ర చర్చ జరగకుండా తీసుకువచ్చారు. దీని ఫలితాలు  ప్రజలు అనుభవించక తప్పదు. 

దర్యాప్తుపై చట్టంలో స్పష్టత లేదు

సంహిత ప్రకారం కొనసాగిస్తే పోలీసులు ముద్దాయిని మొదటి 15రోజుల్లో కాకుండా ఆ తరువాత కూడా పోలీసు కస్టడీకి తీసుకునే అవకాశం ఉంది. కోర్టు ఏ నిర్ణయం తీసుకున్నా, ఆ ఉత్తర్వులపై పై కోర్టులకు వెళ్లే అవకాశం ఉంది.  దానివల్ల కేసుల దర్యాప్తులో, అదేవిధంగా విచారణలో కూడా జాప్యం జరిగే అవకాశం ఏర్పడుతుంది.  రెండో ఉదాహరణ ప్రకారం జూన్​ నెలలో ఓ మహిళపై అత్యాచారం జరిగిందనుకుందాం. రకరకాల కారణాల వల్ల ఆ నేర సమాచారాన్ని పోలీసులకు జూన్​ నెలలో ఇవ్వలేదు. ఆ తర్వాత అంటే కొత్త క్రిమినల్​ చట్టాలు అమల్లోకి వచ్చిన తరువాత జులై నెలలో ఆ రేప్​ నేర సమాచారాన్ని బాధిత మహిళ పోలీసులకు తెలిపిందనుకుందాం. అప్పుడు పోలీస్​ అధికారి క్రిమినల్​ ప్రొసీజర్​ కోడ్​లో చెప్పిన పద్ధతుల్లో దర్యాప్తు కొనసాగించాలా లేక సంహిత ప్రకారం కొనసాగించాలో చట్టంలో స్పష్టత లేదు. సె.531 సంహిత ప్రకారం పెండింగ్​లో విచారణలకి, దర్యాప్తులకి మాత్రమే క్రిమినల్​ ప్రొసీజర్​ కోడ్​ వర్తిస్తుంది. పెండింగ్​లో లేనివాటికి వర్తించదు.  ఈ విషయం కోర్టు పరిశీలనకు వచ్చి కోర్టు తనకు తోచిన ఉత్తర్వులను జారీ చేస్తే అది కూడా పై కోర్టులకు వెళ్లి కేసు దర్యాప్తుకి జాప్యం జరుగుతుంది.

పాత సీఆర్​పీసీ కూడా వర్తిస్తుంది

నేరాలకు శిక్షలు విధించే చట్టం అమల్లోకి వచ్చిన తేదీ నుంచి శిక్షలు అమల్లోకి వస్తాయి. దీనికి రాజ్యాంగ భద్రత ఉంది. ఆర్టికల్ 20లో ఈ విషయం చెప్పారు.  ప్రొసీజర్​అనేది ఆవిధంగా కాదు. ఇప్పడు కొత్తగా వచ్చిన చట్టం కూడా, ఆ చట్టం అమల్లోకి రాకముందు ఉన్న నేరాలకు కూడా వర్తింపచేయవచ్చు. అయితే ఈ సంహితలోని సె.531 అనేది ముఖ్యమైనది. ఈ నిబంధన ప్రకారం క్రిమినల్​ ప్రొసీజర్​ కోడ్​ 1973ని తొలగించారు. అయితే, ఈ సంహిత అమల్లోకి రాకముందు విచారణల్లో ఉన్న అప్పీళ్లు, అప్లికేషన్లు, కేసు విచారణలు, ఎంక్వైరీలు, పోలీసుల దర్యాప్తులు అన్నింటికీ క్రిమినల్​ ప్రొసీజర్ కోడ్ (సీఆర్​పీసీ)​ వర్తిస్తుంది. ఈ సంహిత అమల్లోకి రానట్టుగా భావించి వాటి విచారణలను, దర్యాప్తులను కొనసాగించాల్సి ఉంటుంది.  అదేవిధంగా అప్పటి నియమాలు, ప్రకటనలు అన్నీ క్రిమినల్​ ప్రొసీజర్​ కోడ్​ ప్రకారమే వర్తిస్తాయి. శిక్షలు కూడా అదేవిధంగా ఎక్కడైనా అనుమతులు అవసరం ఉంటే అవే వర్తిస్తాయి.  ఒక్కమాటలో చెప్పాలంటే 1జులై 2024కి ముందు జరిగిన నేరాల దర్యాప్తు, విచారణలు క్రిమినల్​ ప్రొసీజర్​ కోడ్​ ప్రకారమే జరుగుతాయి. దీనివల్ల ఈ చట్ట ఉద్దేశ్యమే దెబ్బతినే అవకాశం కనిపిస్తోంది.

- డా. మంగారి రాజేందర్​, జిల్లా జడ్జి (రిటైర్డ్​)