అల్లు అర్జున్, కేటీఆర్ క్వాష్​ పిటిషన్లు వేశారు.. గుర్తుందా..? బెయిల్​ అంత సులభమా ?

తమ మీద క్రిమినల్​ కేసు నమోదు కాగానే దానిని రద్దు చేయమని హైకోర్టుకి చాలా మంది ప్రముఖులు వెళుతున్నారు.  ఆ విధంగా వెళ్లడం వాళ్ల హక్కు. అయితే ఎఫ్​ఐఆర్​ రద్దు అనేది సాధారణంగా జరగదు. ప్రాథమికంగా చూసినపుడు ఎలాంటి ఆధారాలు లేనపుడు మాత్రమే హైకోర్టులు ఎఫ్​ఐఆర్​ని రద్దు చేస్తాయి.

ప్రథమ సమాచార నివేదికను కొట్టివేసే అధికారం రాష్ట్ర హైకోర్టులకు, సుప్రీంకోర్టుకు ఉన్నది. ఈ విషయాన్ని సుప్రీంకోర్టు చాలా కేసుల్లో స్పష్టం చేసింది. ప్రథమ సమాచార నివేదికలోని ఆరోపణలు పూర్తిగా పరిశీలించనప్పటికీ ఎలాంటి కాగ్నిజబుల్​ నేరం లేనపుడు మాత్రమే దాన్ని రద్దు చేసే అధికారం కోర్టులకి ఉంటుంది. న్యాయ హితాన్ని కాపాడడానికి ఈ అధికారం కోర్టులకి ఉంది.

క్రిమినల్​ ప్రొసీజర్​ కోడ్​లోని సె. 482(కొత్త నిబంధన 528)ని ఉపయోగించి హైకోర్టు ఈ ఎఫ్​ఐఆర్​లని కొట్టివేయ వచ్చు. ఎఫ్​ఐఆర్​ని పరిశీలించినపుడు, అది ఎలాంటి నేరాన్ని చూపించలేనపుడు దాన్ని రద్దు చేసే అధికారం హైకోర్టుకు ఉంటుంది. దేశ పౌరుణ్ణి అన్యాయంగా కేసుల్లో ఇరికించకుండా ఉండడానికే, వాళ్లు ఇబ్బంది పడకుండా ఉండటానికి హైకోర్టు తన స్వయం సిద్ధ అధికారాలను ఉపయోగించి ఎఫ్​ఐఆర్​లని కొట్టివేయవచ్చు. 

క్వాష్​ పిటిషన్లకు వెళుతున్నారు
కొంత మంది రాజ్యాంగంలోని ఆర్టికల్​ 226, 227 ప్రకారం రిట్​ పిటిషన్లని దాఖలు చేసి తమ మీద ఉన్న కేసులని కొట్టివేయమని హైకోర్టుకు వెళ్తున్నారు.  ఇంతవరకు బాగానే ఉంది. అరెస్టు అయిన తరువాత బెయిల్​ దరఖాస్తులని దాఖలు చేసుకోకుండా హైకోర్టులో రిట్​ పిటిషనో, క్వాష్​ పిటిషనో దాఖలు చేసి బెయిల్​ అడుగుతున్నారు. ఈ విధంగా ఉన్నత న్యాయస్థానాలకు వెళ్లే అవకాశం ప్రముఖులకే ఉంటుంది. కోర్టులు వాళ్లకి ఉదారంగా బెయిల్స్​ని మంజూరు చేస్తున్నాయి. ఆ విధంగా బెయిల్స్​ మంజూరు చేసే అధికారం హైకోర్టులకి ఉందా?

బెయిల్ ను ఏవిధంగా మంజూరు చేస్తున్నాయి?
బెయిల్​ పొందడానికి కొత్త క్రిమినల్​ ప్రొసీజర్​ కోడ్​ (బీ.ఎన్​.ఎస్​.ఎస్​)లో అధ్యాయం 35లో సె.478 నుంచి సె. 483 వరకు ఉన్న నిబంధనల్లో చెప్పారు. సె.480 ప్రకారం నాన్​బెయిలబుల్​ కేసుల్లో బెయిల్​ పొందవచ్చు. ఈ అధికారం మేజిస్ట్రేట్​ కోర్టులకి ఉంటుంది. కొన్ని ప్రత్యేకమైన సందర్భాలలో పోలీసులు కూడా మంజూరు చేయవచ్చు. అదే విధంగా సె. 483 ప్రకారం సెషన్స్​ కోర్టు గానీ, హైకోర్టుగానీ బెయిల్​ మంజూరు చేయవచ్చు, ముందస్తు బెయిల్​ కోసం సె. 482 ప్రకారం హైకోర్టుకి కానీ, సెషన్స్​ కోర్టుకు కానీ వెళ్లవచ్చు. ఈ నిబంధనల ప్రకారం మాత్రమే బెయిల్​ మంజూరు చేసే అవకాశం ఉంది తప్ప మరో విధంగా లేదు.చట్టం ఈవిధంగా ఉన్నపుడు హైకోర్టులు బెయిల్​ని ఏవిధంగా మంజూరు చేస్తున్నాయి? అరెస్టు చేయవద్దని పోలీసులని ఏవిధంగా ఆదేశిస్తున్నాయి? ఇది లక్ష డాలర్ల ప్రశ్న. 

క్వాష్​ పిటిషన్​ వేసి బెయిల్​ కోరే అవకాశం లేదు
ముద్దాయిని  మేజిస్ట్రేట్​ కోర్టు రిమాండ్​ చేసినా తరువాత అతను ఆ సంబంధిత కోర్టులో బెయిల్​ కోసం దరఖాస్తు చేసుకోవాలి. అది సె.480 ప్రకారం, 482 ప్రకారం ఉంటుంది. అంతేతప్ప రిట్​ పిటిషన్​లో గానీ, క్వాష్​ పిటిషన్​లో కానీ పొందడానికి వీల్లేదు. అదేవిధంగా  ఒక వ్యక్తి మీద కేసు నమోదైతే అతను దాన్ని క్వాష్ కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. కానీ బెయిల్​ ఇవ్వమని హైకోర్టుని కోరడానికి చట్ట ప్రకారం అవకాశం లేదు. ఆ వ్యక్తి ముందస్తు బెయిల్​ కోసం హైకోర్టుని గానీ, సెషన్స్​ కోర్టుని గానీ సంప్రదించవచ్చు.  అంతేకానీ క్వాష్​ పిటీషన్​వేసి బెయిల్​ కోరడానికి అవకాశం  లేదు. సె. 528 (పాత సెక్షన్​ 482) ప్రకారం హైకోర్టుకి స్వయం సిద్ద అధికారాలు ఉన్నాయి. అయితే అపరిమిత స్వయం సిద్ద అధికారాలకు సుప్రీంకోర్టు పరిమితులను విధించింది. 

హబీబ్​ అబ్దుల్​ కేసులో సుప్రీం తప్పుపట్టింది
స్టేట్​ ఆఫ్​ తెలంగాణ వర్సెస్​ హబీబ్​ అబ్దుల్లా జిలానీ (2017) – ఎస్​.సీ.సీ. 779 కేసులో ముద్దాయిని అరెస్టు చేయవద్దని ఉత్తర్వులు జారీ చేయడాన్ని తప్పుపట్టింది. ఎఫ్​ఐఆర్​ క్వాష్​ చేయడాన్ని నిరాకరిస్తూ, ముద్దాయిని అరెస్టు చేయకూడదన్న ఉత్తర్వులు జారీ చేయడం అంటే సె.438 ప్రకారం బెయిల్​ మంజూరు చేయడం లాంటిదే. సుప్రీంకోర్టు ఈ విధంగా పేరా16లో అభిప్రాయపడింది. “ఎప్​ఐఆర్​లోని ఆరోపణల్లో, దర్యాప్తులో ఉన్న పురోగతిని హైకోర్టు ఉదహరిస్తూ, కేసు పురోగతిలో ఉందని అభిప్రాయపడింది.  అందుకని దర్యాప్తుని నిలువరించడానికి నిరాకరించింది. ఆవిధంగా సె.482 ప్రకారం దాఖలైన కేసుని స్టే చేయలేదు. కానీ ముద్దాయిని అరెస్టు చేయకూడదని ఆదేశాలను జారీ చేసింది. ఇలాంటి  ఉత్తర్వులు సె. 438 క్రిమినల్​ ప్రొసీజర్​ కోడ్ ప్రకారం ముందస్తు బెయిల్​ చేయడం లాంటిదే. ఇలాంటి ఉత్తర్వులని చట్టప్రకారం అమోదించడానికి వీల్లేదు..

వేదుల వెంకటరమణ కేసులో..
ప్రత్యామ్నాయ ఉపశమనాలు పొందడానికి వీల్లేని కేసుల్లో అవసరమైన కేసుల్లో హైకోర్టు అరెస్టు చేయకూడదన్న ఆదేశాలు జారీ చేయవచ్చని సుప్రీంకోర్టు తీర్పులని ఉదహరిస్తూ తెలంగాణ హైకోర్టు వేదుల వెంకట రమణ వర్సెస్​ స్టేట్​ ఆఫ్​ తెలంగాణ కేసులో అలాంటి ఆదేశాలను జారీ చేసింది. ఆ కేసులో ముద్దాయిపై ఉన్న కేసులు షెడ్యూల్డ్​ కులాలు, షెడ్యూల్డ్​ తెగల (అత్యాచార నిరోధక) చట్టం, 1989 ప్రకారం ఉన్నవి. అందులో ముందస్తు బెయిల్​ నిబంధన లేదు. అందుకని ముద్దాయిని అరెస్టు చేయకూడదన్న ఉత్తర్వులు జారీ చేయవచ్చని తెలంగాణ హైకోర్టు పేర్కొంది.  అది కూడా సరైంది కాదని నా అభిప్రాయం.

మార్గదర్శకాలకు విరుద్దంగా..
ఈ మధ్య అలాంటి కేసులలో నిమిత్తం కేకుండా హైకోర్టులు అరెస్టు చేయవద్దని, వ్యక్తిగత పూచీకత్తు మీద విడుదల చేయమని సె.528, ఆర్టికల్​226 కింద దాఖలైన కేసుల్లో ఉత్తర్వులను  జారీ చేస్తున్నాయి.  అవి సుప్రీంకోర్టు చెప్పిన నజ్మా వర్సెస్​ జావెద్​, ​ స్టేట్​ ఆఫ్​ తెలంగాణ వర్సెస్​ హబీబ్​ అబ్దుల్లా జిలానీ కేసులో చెప్పిన మార్గదర్శాలకు విరుద్ధంగా అనిపిస్తున్నాయి. ఈ తీర్పులను హైకోర్టు దృష్టికి ప్రభుత్వ న్యాయవాదులు తీసుకొని వెళ్తున్నారా లేదా అన్నది అనుమానం. కోర్టులకు ఈ విషయాలు తెలిసి అలాంటి ఉత్తర్వులు జారీ చేస్తున్నాయా అన్నది మరో అంశం.

శాశ్వత న్యాయమూర్తులు తప్పులు చేస్తే సుప్రీంకోర్టు తమ అసంతృప్తిని వెలువరించడం తప్ప ఏమీ చేయలేదు. ఎక్కువలో ఎక్కువ ఒక రాష్ట్రం నుంచి మరో రాష్ట్రానికి బదిలీకై సిఫార్సు చేయవచ్చు. అది అమలు కావడానికి ఎంత కాలం పడుతుందో చెప్పలేం. అలాంటి న్యాయమూర్తులకు కోర్టు పనిని నిరాకరించవచ్చు. అలాంటి సంఘటనలు గతంలో జరిగినట్టు అనిపించడంలేదు.

మార్గదర్శకాలకు పర్యవేక్షక విభాగం అవసరం
సుప్రీం కోర్టు ఉత్తర్వులను,మార్గదర్శకాలను హైకోర్టు న్యాయమూర్తులు పాటించకపోతే, హైకోర్టు ఉత్తర్వులను కార్యనిర్వహక వ్యవస్థ పాటిస్తుందా? ఏమైనా సుప్రీంకోర్టు, హైకోర్టు ఉత్తర్వులు మార్గదర్శకాలు అమలు గురించి పర్యవేక్షించడానికి ఓ స్వతంత్ర విభాగం ఆవశ్యకత కనిపిస్తున్నది. ఈ దిశగా సుప్రీంకోర్టు, హైకోర్టు, ప్రభుత్వాలు ఆలోచించాల్సిన సమయం మాత్రం వచ్చింది.

సుప్రీంకోర్టు పరిమితులు
ఈ విషయం గురించి సుప్రీంకోర్టు చాలా కేసుల్లో ప్రస్తావించింది.  హైకోర్టులు బెయిల్స్​ మంజూరు చేస్తున్న విషయాలను, తీసుకుంటున్న పరిగణనల పట్ల చాలా విచారాన్ని వెలిబుచ్చింది. ఆ కేసులని కొన్నింటిని పరిశీలిద్దాం. నజ్మా వర్సెస్​ జావెద్​@ అంజుమ్​ (తీర్పు తేదీ 19 అక్టోబర్ 2012) కేసులో సుప్రీంకోర్టు ఈవిధంగా అభిప్రాయపడింది.

‘‘ సుప్రీంకోర్టు విస్పష్టంగా చెప్పినప్పటికీ హైకోర్టులు తమ అధికార పరిధిని దాటుతున్నాయి. రాజ్యాంలోని ఆర్టికల్స్​ 226, 227ల ప్రకారం దాఖలైన కేసుల్లో అరెస్టు చేయవద్దని తాత్కాలిక ఆదేశాలను జారీ చేస్తున్నాయి. అదే విధంగా క్రిమినల్​ ప్రొసీజర్​ కోడ్​లోని సె.482 ప్రకారం అరెస్టు చేయవద్దని, కొన్ని సందర్భాలలో బెయిల్స్​ని మంజూరు చేస్తున్నాయి. ఈ ఆర్టికల్స్​ కింద సెక్షన్​ కింద ఆదేశాలను జారీ చేయడమనేది అరుదైన విషయం. బెయిల్​ మంజూరు చేయడం, తిరస్కరించడం అనేది సాధారణ క్రిమినల్​ కోర్టు చేసే పని. అది కూడా కోర్టు విచక్షణాధికారాన్ని ఉపయోగించి చేయాల్సి ఉంటుంది.’’ అని సుప్రీంకోర్టు అభిప్రాయపడింది.

డా. మంగారి రాజేందర్, జిల్లా జడ్జి (రిటైర్డ్​)