ఇన్​చార్జి బాధ్యతలు ఇంకెన్నాళ్లు..!

  • ఎంఈవోలు పనిచేసేది ఒక జిల్లాలో.. స్కూల్స్ పర్యవేక్షణ బాధ్యతలు మరోజిల్లాలో
  • కోర్టులో కేసుతో ఇబ్బందులు తప్పడం లేదంటున్న ఆఫీసర్లు
  • హైకోర్టులో కౌంటర్ వేయడంలో శ్రద్ధ చూపని రాష్ట్ర స్థాయి అధికారులు

మహబూబాబాద్, వెలుగు: జిల్లాలో ప్రభుత్వ పాఠశాలల పర్యవేక్షణ బాధ్యత చూసే దిక్కులేకుండా పోతోంది. రెగ్యులర్​ఎంఈవోలు లేకపోవడమే ఇందుకు కారణంగా చెప్పవచ్చు. గతేడాది సెప్టెంబర్​లో జరిగిన బదిలీల్లో మహబూబాబాద్ జిల్లా నుంచి ముగ్గురు, జనగామ జిల్లాలో ఇద్దరితోపాటు మిగతా జిల్లాల్లో విధులు నిర్వహిస్తున్న కొంతమంది ఎంఈవోలను ఇతర జిల్లాలకు బదిలీచేశారు. కానీ, కోర్టులో కేసు ఉండడంతో ఇప్పటికీ పాత జిల్లాల్లోనే మండల విద్యాధికారులుగా విధులు నిర్వహిస్తున్నారు.

ఒక్కొక్క ఎంఈవో 5 నుంచి 8 మండలాల బాధ్యతలతోపాటు వారు పని చేసే స్కూల్లో హెచ్​ఎంగా బాధ్యతలను నిర్వహిస్తున్నారు. ఉమ్మడి వరంగల్ జిల్లాలో 78 మండలాలుండగా ఒక్క రెగ్యులర్ ఎంఈవో లేడు. ఇక మొత్తంగా 21 మంది పీజీ హెచ్ఎంలు ఆయా మండలాలకు ఇన్ చార్జి ఎంఈవోలుగా కొనసాగుతున్నారు. దీంతో క్షేత్రస్థాయిలో ఇబ్బందులు తప్పడం లేదు. రాష్ట్ర స్థాయిలోని ఆఫీసర్లు కోర్టులో సరియైన కౌంటర్ దాఖలు చేస్తే తప్ప కొలిక్కిరాదని అధికారులు చెబుతున్నారు.

అదనపు బాధ్యతలతో ఇబ్బందులు

ప్రభుత్వ ఉన్నత పాఠశాలల్లో విధులు నిర్వహించే గెజిటెడ్ ప్రధానోపాధ్యాయులకు ఇన్ చార్జి ఎంఈవోలుగా అడిషనల్ బాధ్యతలు అప్పజెప్పడంతో వివిధ ఫైళ్లపై సంతకాలు పెట్టడానికి సైతం ఇబ్బందులు తప్పడం లేదు. ఉమ్మడి వరంగల్ జిల్లాలో 21 మందికి 78 మండలాల బాధ్యతలు ఎంఈవోలుగా కొనసాగుతుండగా, బదిలీపై ఇతర జిల్లాలకు వెళ్లినా పాత మండలాలను వారే చూడాల్సిన దుస్థితి నెలకొన్నది. పని ఒత్తిడితో పాఠశాలల పర్యవేక్షణ కుంటుపడుతున్నది.

మహబూబాబాద్ జిల్లాలో 18 మండలాలకు ముగ్గురు, వరంగల్ జిల్లాలో 13 మండలాలకు నలుగురు, హనుమకొండ జిల్లాలో14 మండలాలకు నలుగురు, జనగామ జిల్లాలో 12 మండలాలకు ఇద్దరు, జయశంకర్ భూపాలపల్లిలో 12 మండలాలకు ఇద్దరు, ములుగు జిల్లాలో 9 మండలాలకు ఇద్దరు, మొత్తం 78 మండలాలకు 21 మంది ఇన్ చార్జి ఎంఈవోలుగా విధులు నిర్వహిస్తున్నారు..

రెగ్యులర్ ఎంఈవోలను నియమించాలి..

ప్రతీ మండలానికి రెగ్యూలర్ ఎంఈవో లేకపోవడంతో పూర్తిస్థాయిలో పాఠశాలల సందర్శన చేయలేకపోతున్నారు. పాఠశాలల పర్యవేక్షణతోపాటు నిర్ణీత సమయంలో ఉపాధ్యాయుల సమస్యలు కూడా పరిష్కరించడంలో కాలయాపన జరుగుతుంది. ఒక్కో ఎంఈవోకు 5 నుంచి 8 మండలాల బాధ్యతలు ఇవ్వడం వల్ల పనిఒత్తిడికి లోనవుతున్నారు. - సూరం ఉపేందర్​రెడ్డి, టీపీటీఎఫ్, జిల్లా నాయకుడు