ప్రజావాణి పై పట్టింపేది !

  • ఫిర్యాదులు పట్టించుకోని ఆఫీసర్లు
  • అర్జీలు ఎక్కువ.. పరిష్కారం తక్కువ
  • కాలయాపనతో.. నెలల తరబడి ఫిర్యాదుదారుల నిరీక్షణ

యాదాద్రి, సూర్యాపేట, వెలుగు : ప్రజావాణి ఫిర్యాదుల పరిష్కారం స్లోగా సాగుతోంది. వందలు, వేల సంఖ్యలో ఫిర్యాదులు వస్తుంటే పదుల సంఖ్యలో పరిష్కారం చూపుతున్నారు. దీంతో ప్రజావాణిలో ఫిర్యాదు చేస్తే పరిష్కారం అవుతుందన్న నమ్మకం లేకుండా పోయింది. వీటి పరిష్కారంపై రివ్యూ కూడా జరగడం లేదు.  గ్రామాలు, మండల స్థాయిలో ప్రజా సమస్యలకు పరిష్కారం లభించడం లేదు. దీంతో ప్రజలు కలెక్టరేట్లో ప్రతి సోమవారం నిర్వహించే ప్రజావాణికి వచ్చి ఫిర్యాదు చేస్తున్నారు.

రెగ్యులర్​గా ప్రజావాణి నిర్వహించే ఆఫీసర్లు వాటి పరిష్కారాన్ని మాత్రం పట్టించుకోలేదు. దీంతో నెలల తరబడి ఫిర్యాదులు పెద్ద సంఖ్యలో పేరుకొని పోతున్నాయి. ప్రతీ ప్రజావాణి నిర్వహణ అనంతరం సాయంత్రం గత వారం ఫిర్యాదుల పరిష్కారంపై డిపార్ట్​మెంట్లవారీగా ఆఫీసర్లతో చర్చించాల్సి ఉంటుంది. కానీ రివ్యూ మీటింగ్ నిర్వహిస్తున్న దాఖలాలు లేవు. పైగా సమస్యలపై ఫిర్యాదు చేసిన వారికి అవి ఎందుకు పరిష్కారం కాదో 15 రోజుల్లో ఆఫీసర్ల నుంచి సమాచారం అందించాల్సి ఉంది. ఇలా సమాచారం ఇస్తున్న దాఖలాలు కూడా కన్పించడం లేదు. సమస్యలు మాత్రం నెలల తరబడి పరిష్కారం కావడం లేదు. దీంతో ఫిర్యాదులు చేసిన వారు నిరాశకు లోనవుతున్నారు.

యాదాద్రిలో ఫిర్యాదులు 605, పరిష్కారం 59

అసెంబ్లీ, లోక్​సభ ఎన్నికల కోడ్​కారణంగా ప్రజావాణి సరిగా నిర్వహించలేదు. యాదాద్రి జిల్లాలో ఈ ఏడాది జూన్ నుంచి ఈనెల 9 వరకు పలుమార్లు నిర్వహించిన ప్రజావాణికి 600 ఫిర్యాదులు వచ్చాయి. వీటిలో భూ సంబంధింత సమస్యలకు సంబంధించి 440 వరకు ఉన్నాయి. వీటిలో ఇప్పటివరకు కేవలం 44 మాత్రమే పరిష్కరించగా, మిగిలినవి పెండింగ్​లోనే ఉన్నాయి. అదేవిధంగా మిగిలిన 43 డిపార్ట్​మెంట్లకు 165 ఫిర్యాదులు వచ్చాయి. వీటిలో 15 మాత్రమే పరిష్కరించారు. మిగతా వన్నీ పెండింగ్​లోనే ఉన్నాయి. ఎంప్లాయిమెంట్, ఎడ్యుకేషన్, మున్సిపాలిటీలకు వచ్చిన ఫిర్యాదుల్లో ఒక్కటి కూడా పరిష్కరించలేదు. 

సూర్యాపేట జిల్లాలో..

జిల్లాలో ఇప్పటివరకు వివిధ శాఖలకు సంబంధించి గత డిసెంబర్ నెల నుంచి ఈనెల 23 వరకు 659 ఫిర్యాదు వచ్చాయి. వీటిలో భూ సంబంధిత సమస్యలే ఎక్కువగా ఉన్నాయి. ఈ ఫిర్యాదుల్లో 266 మాత్రమే పరిష్కరించారు. మరో 393 అర్జీలు పెండింగ్‌‌లో ఉన్నాయి. గ్రీవెన్స్‌‌లో కలెక్టర్లు సంబంధిత శాఖల అధికారులను ఆదేశించినప్పటికీ కొన్ని దరఖాస్తులు పరిష్కారానికి నోచుకోవడం లేదు. ఫిషరీస్ డిపార్ట్ మెంటుకు 16 ఫిర్యాదులు రాగా, ఒక్కటి కూడా పరిష్కరించలేదు. సివిల్ సప్లయ్ 12, ట్రైబల్ వెల్ఫేర్ 10, ఇరిగేషన్ డిపార్ట్​మెంట్ 28, జిల్లా పంచాయతీ డిపార్ట్​మెంట్​​కు 68 వచ్చినా వాటిని పరిష్కరించకుండా పెండింగ్ లోనే పెడుతున్నారు. 

Also Read :- రుణమాఫీ కాని రైతులకు మంత్రి పొన్నం కీలక సూచన

ఫిర్యాదులు సత్వరమే పరిష్కరించాలి.. 

యాదాద్రి, సూర్యాపేట, నల్గొండ అర్బన్​: ప్రజావాణికి వచ్చిన ఫిర్యాదులను సత్వరమే పరిష్కరించాలని యాదాద్రి, సూర్యాపేట, నల్గొండ కలెక్టర్లు హనుమంతు జెండగే, తేజస్​ నందలాల్​ పవార్, నారాయణరెడ్డి ఆదేశించారు. ఆయా కలెక్టరేట్లలో సోమవారం నిర్వహించిన ప్రజావాణికి పెద్ద ఎత్తున ఫిర్యాదులు వచ్చాయి. వాటిని స్వీకరించిన కలెక్టర్లు డిపార్ట్​మెంట్ల వారీగా పంపించి సాధ్యమైనంత త్వరగా పరిష్కరించాలని ఆదేశించారు. యాదాద్రి జిల్లా హన్మాపురంలో ప్రభుత్వ భూమికి హద్దులు ఏర్పాటు చేయాలని సీపీఐ ఫిర్యాదు చేసింది. సర్కారు ఉద్యోగం ఉన్నా తన కొడుకు తిండి పెట్టడం లేదని సూర్యాపేటకు చెందిన వల్దాస్ లింగమ్మ కలెక్టర్ ను కలిసి ఫిర్యాదు చేసింది. నల్గొండ జిల్లా పెద్దదేవులపల్లి పంచాయతీలో జరిగిన నిధుల దుర్వినియోగంపై చర్యలు తీసుకోవాలని ఫిర్యాదు చేశారు. రుణమాఫీ అందరికీ అమలు చేయాలని కోరారు. యాదాద్రిలో 99 ఫిర్యాదులు రాగా, సూర్యాపేటలో 159 ఫిర్యాదులు అందాయి.