నిజామాబాద్, వెలుగు: లోకల్‌బాడీస్ ఎన్నికల్లో బీసీల రిజర్వేషన్లు ఎలా ఉండాలనే అంశంపై ప్రజల అభిప్రాయాల మేరకు ప్రభుత్వానికి నివేదిక అందజేస్తామని బీసీ డెడికేటెడ్ కమిషన్ చైర్మన్ బూసాని వెంకటేశ్వర్రావు తెలిపారు. గురువారం నిజామాబాద్ కలెక్టరేట్లో ఉమ్మడి జిల్లా బీసీ కుల సంఘాలతో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఇప్పటి వరకు 8 ఉమ్మడి జిల్లాల్లో అభిప్రాయాలు సేకరించామని ఆదిలాబాద్, కరీంనగర్ ఉమ్మడి జిల్లాల విజిట్పూర్తయ్యాక సర్కార్‌కు నివేదిక అందజేస్తామని తెలిపారు.
బీసీల జనాభా ఆధారంగా రిజర్వేషన్లు వర్తింపజేయాలని కోరుతున్నారని కులాలను ఏ, బీ, సీ, డీగా విభజించి రిజర్వేషన్లు అమలు చేస్తే అన్ని కులాలకు ప్రాతినిధ్యం దక్కుతుందనే అభిప్రాయం వ్యక్తం చేస్తున్నట్లు చెప్పారు. స్థానిక సంస్థల్లో ఇప్పటి వరకు అసలు ప్రాతినిధ్యం లేని కులాల గురించి ప్రత్యేకంగా ప్రస్తావించినట్లు తెలిపారు. ప్రతీ అంశాన్ని పరిశీలించి సమగ్ర నివేదిక ప్రభుత్వానికి అందజేస్తామని చెప్పారు.
ముస్లింలకు 12.5 రిజర్వేషన్ కోసం వినతి
జనాభా ఆధారంగా ముస్లింలకు లోకల్‌బాడీస్‌లో 12.5 రిజర్వేషన్ ఇవ్వాలని ఆ వర్గం నేతలు చైర్మన్బూసాని వెంకటేశ్వర్రావును కోరారు. బాగ్బాన్కులానికి గుర్తింపు ఇవ్వాలని వినతిపత్రం అందించారు. ఇతర రాష్ట్రాల్లో మాదిరిగా మేదరి కులాన్ని ఎస్టీ జాబితాలో చేర్చాలని, కుల వృత్తులు చేసే వర్గాలను వర్గీకరిస్తేనే రిజర్వేషన్లుదక్కుతాయని మరికొందరు విజ్ఞప్తి చేశారు. నాయీబ్రాహ్మణ వృత్తికి ప్రమాదకరంగా మారిన కార్పొరేట్ వ్యవస్థను నియంత్రించి క్షౌర వృత్తిపై పేటెంట్హక్కులు ఇవ్వాలని ఆ వర్గం నేతలు కోరారు.
తమను ఎంబీసీలో చేర్చాలని పూసల కులస్తులు విజ్ఞప్తి చేశారు. విశ్వబ్రహ్మణ, బీసీ సంక్షేమ సంఘం, ముదిరాజ్, వడ్డెర, కుమ్మరి, యాదవ, రజక, వీరభద్రీయ, నకాషీ, వాల్మీకి, దూదేకుల, మేర, గాండ్ల, మత్స్యకారులు తమకు ఆర్థిక, సామాజిక, విద్య, ఉద్యోగ, రాజకీయ రిజర్వేషన్లు కావాలని వినతిపత్రాలు అందించారు. కమిటీ సెక్రటరీ బి.సైదులు, కలెక్టర్ రాజీవ్‌గాంధీ హనుమంతు, అడిషనల్ కలెక్టర్లు అంకిత్, కిరణ్‌కుమార్, ట్రైనీ కలెక్టర్ సంకేత్‌కుమార్, కామారెడ్డి జడ్పీ సీఈవో చందర్ రాథోడ్, స్టేట్ బీసీ వెల్ఫేర్ ఆఫీసర్ రమేశ్, బీసీ సంక్షేమ శాఖ అధికారి స్రవంతి తదితరులు పాల్గొన్నారు.