- జపాన్ నుంచి వచ్చిన టెక్నీషియన్
- పనులు పూర్తి కావడానికి రెండు నెలలు పట్టే అవకాశం
హాలియా, వెలుగు : నాగార్జునసాగర్ జల విద్యుత్ కేంద్రంలో పనిచేయని రెండో యూనిట్ రిపేర్లు ఎట్టకేలకు ప్రారంభం కానున్నాయి. ఈ యూనిట్ కు రిపేర్లు చేసేందుకు జపాన్ కు చెందిన టెక్నీషియన్ శుక్రవారం సాగర్ కు చేరుకున్నారు. సాగర్ పవర్ హౌజ్ లో మొత్తం 8 యూనిట్లు ఉండగా ఏడాది నుంచి రెండో యూనిట్ పనిచేయడం లేదు. ఈ యూనిట్ లో రిపేర్లు చేసేందుకు జపాన్ నుంచి టెక్నీషియన్ రావాల్సి ఉండడంతో అది ఇంతకాలం నిరుపయోగంగానే ఉంది. ఈ సీజన్ లో సాగర్ కు భారీ వరద వచ్చినప్పటికీ పూర్తిస్థాయిలో విద్యుత్ ఉత్పత్తి జరగలేదు.
రెండో యూనిట్ పనిచేయని కారణంగా రోజుకు 100 మెగావాట్ల చొప్పున మొత్తం 7,500 మెగావాట్ల విద్యుత్ ను కోల్పోవాల్సి వచ్చింది. ప్రస్తుతం జపాన్ కు చెందిన టెక్నీషియన్ సాగర్ కు చేరుకోవడంతో రెండో యూనిట్ కు రిపేర్లు ప్రారంభం అయ్యాయి. పనులు పూర్తై, విద్యుత్ ఉత్పత్తి ప్రారంభం కావడానికి రెండు నెలలు పట్టే అవకాశం ఉందని జెనోకో ఆఫీసర్లు తెలిపారు.