రిమోట్ బాంబు బ్లాస్ట్: స్కూల్ పిల్లలు సహా ఏడుగురు మృతి

ఇస్లామాబాద్: పాకిస్తాన్‌‌లోని బలూచిస్తాన్ ప్రావిన్స్‌‌లో టెర్రరిస్టులు శుక్రవారం బాంబు దాడికి పాల్పడ్డారు. మ‌‌స్తాంగ్ జిల్లాలో పోలీసులు ప్రయాణిస్తున్న వ్యాన్‌‌ను లక్ష్యంగా చేసుకుని రిమోట్ కంట్రోల్డ్ బ్లాస్ట్ చేశారు. ఈ ఘటనలో ఐదుగురు స్కూల్ పిల్లలు, ఓ పోలీసు సహా ఏడుగురు మృతిచెందారు. మరో 17 మంది గాయపడ్డారు. సివిల్ హాస్పిటల్ చౌక్‌‌లోని ఓ గర్ల్స్ హైస్కూల్ సమీపంలో బైక్ పార్క్ చేసిన టెర్రరిస్టులు.. దానికి ఇంప్రూవైజ్డ్ ఎక్స్‌‌ప్లోజివ్ డివైజ్(ఐఈడీ) అమర్చినట్లు అధికారులు తెలిపారు. ఉదయం 8.35 గంటలకు పోలీస్ వ్యాన్ అక్కడికి చేరుకోగానే రిమోట్‎తో పేల్చేశారని వెల్లడించారు.

పేలుడు ధాటికి పోలీసు వ్యాన్‎తో పాటు పలు ఆటోలు ధ్వంసమయ్యాయన్నారు. ఘటనలో ఐదుగురు పాఠశాల విద్యార్థులు, ఒక పోలీసు అధికారి, ఒక పౌరుడు మరణించాడని వివరించారు. స్కూల్ ఏరియాలో పేలుడు జరగడంతో చిన్నారులు ఎక్కువ మంది చనిపోయారని చెప్పారు. గాయపడిన17 మందిలో కూడా స్కూల్ పిల్లలే ఎక్కువగా ఉన్నారని వెల్లడించారు. వారందరిని చికిత్స నిమిత్తం క్వెట్టా ట్రామా సెంటర్‌‌కు తరలించినట్లు తెలిపారు.