అధికారులపై దౌర్జన్యం చేసిన వ్యక్తికి రిమాండ్

కోటగిరి, వెలుగు : పోలీసు అధికారులపై దౌర్జన్యం చేసిన వ్యక్తిని అరెస్ట్​ చేసి కోర్టు ఆదేశాల మేరకు రిమాండ్​ తరలించారు.  కోటగిరి ఎస్ఐ సందీప్ తెలిపిన వివరాల ప్రకారం పోతంగల్ మంజీరా పరీవాహక ప్రాంతం నుంచి రాత్రి వేళలో  అక్రమంగా ఇసుకను రవాణా చేస్తున్నారు. ఇసుక రవాణాను అడ్డుకునేందుకు పోలీసులు, రెవెన్యూ సిబ్బందితో బోధన్ సబ్ కలెక్టర్ వికాస్ మహతో ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు.

ఈ సిబ్బంది రాత్రి వేళ  గస్తీ కాస్తున్నారు.  బుధవారం రాత్రి పోతంగల్ నుంచి ఇసుకను అక్రమంగా తరలిస్తున్న టిప్పర్ ను స్వాధీనం చేసుకున్నారు.  ఆ టిప్పర్​ను పోలీస్ స్టేషన్ కు తరలించే క్రమంలో గంధపు దత్తు అనే వ్యక్తి స్పెషల్ టీం అధికారులను అడ్డుకొని టిప్పర్​ను అక్కడి నుంచి పంపించాడు.  దీంతో అధికారులు టిప్పర్​లో  ఇసుకను లోడ్ చేసిన జేసీబీని స్వాధీనం చేసుకొని  పోలీస్​ స్టేషన్ కు తరలించారు.

ఈ విషయమై రెవెన్యూ అధికారులు పోలీస్ స్టేషన్లో ఇచ్చిన ఫిర్యాదు మేరకు విచారణ జరిపిన పోలీసులు అధికారుల విధులకు ఆటంకం కలిగించిన గంధపు దత్తును శుక్రవారం అరెస్టు చేసి కోర్టు ఆదేశాలకు జైలుకు తరలించారు.