Good News For Jio Users:  హమ్మయ్య.. ఆ రీఛార్జ్ ప్లాన్ను జియో మళ్లీ తెచ్చింది.. ధర కూడా తగ్గించింది..! 

టెలికాం దిగ్గజం రిలయన్స్ జియో 999 రూపాయల రీఛార్జ్ ప్లాన్ను మళ్లీ అందుబాటులోకి తెచ్చింది. జులై 3, 2024న ఇదే రీఛార్జ్ ప్లాన్లో టారిఫ్ పెంపులో భాగంగా 1,199 రూపాయలకు పెంచింది. అయితే ఈ ఒక్క ప్లాన్ విషయంలో రిలయన్స్ జియో వ్యూహాత్మకంగా ధరను తగ్గించింది. తిరిగి 999 రూపాయలకే, పాత ధరకే ప్లాన్ను యూజర్లకు అందుబాటులోకి తెచ్చింది. అయితే వ్యూహాత్మకంగా రోజువారీ డేటాల కోత విధించింది. వ్యాలిడిటీని పెంచి కస్టమర్లకు కొంత మేలు చేసింది. గతంలో రిలయన్స్ జియో 999 రూపాయల ప్రీపెయిడ్ ప్లాన్ 84 రోజుల వ్యాలిడిటీతో అందుబాటులో ఉండేది. రోజుకు 3జీబీ హై స్పీడ్ డేటాను యూజర్లు పొందేవారు. అయితే.. ఇప్పుడు ఇదే 999 రూపాయల రీఛార్జ్ ప్లాన్ వ్యాలిడిటీలో రిలయన్స్ జియో మార్పులుచేర్పులు చేసింది. 14 రోజులను అదనంగా జోడించి 98 రోజుల వ్యాలిడిటీని ప్రకటించింది. వ్యాలిడిటీ వ్యవధిని పెంచి గతంలో రోజువారీ ఇచ్చే 3జీబీ డేటాను 2జీబీకి కుదించింది.

అంటే.. గతంలో 84 రోజులకు గానూ ఈ ప్లాన్ లో భాగంగా 252 జీబీ వినియోగదారులు పొందేవారు. ఇప్పుడు 999 రూపాయల ప్లాన్ రీఛార్జ్ చేసుకుంటే 192జీబీ మాత్రమే పొందగలరు. రోజువారీ డేటా పరిమితిని కుదించినప్పటికీ కొంతలో కొంత మేలు జరిగే అవకాశం రిలయన్స్ జియో 5జీ యూజర్లకు ఇప్పటికీ ఉంది. రూ.999 రీఛార్జ్ ప్లాన్లో భాగంగా అన్ లిమిటెడ్ 5జీ డేటా పొందే వెసులుబాటును రిలయన్స్ జియో కల్పించింది. ఇటీవల ప్రముఖ టెలికాం కంపెనీలన్నీ రీఛార్జ్ ప్లాన్ల ధరలను పెంచి యూజర్లకు షాకిచ్చిన సంగతి తెలిసిందే.

జియో, ఎయిర్ టెల్, వీఐ టెలికాం యూజర్లలో కొందరు ఈ పెంచిన ధరల భారాన్ని మోయలేక బీఎస్ఎన్ఎల్కు పోర్ట్ పెట్టుకుని మారిపోయారు. రీఛార్జ్ ప్లాన్ల ధరలు పెంచినప్పటికీ మెజారిటీ యూజర్లు ఇప్పటికీ సేమ్ టెలికాం నెట్ వర్క్స్లోనే కొనసాగుతున్నారు. రిలయన్స్ జియో 999 రూపాయల ప్లాన్ లో మార్పులుచేర్పులు చేయగా ఎయిర్ టెల్ 979 రూపాయల ప్లాన్ ను పోటీగా తీసుకొచ్చింది. 84 రోజుల వ్యాలిడిటీతో రోజుకు 2జీబీ హై స్పీడ్ డేటాతో ఎయిర్ టెల్ ప్లాన్ అందుబాటులో ఉంది. అన్ లిమిటెడ్ వాయిస్ కాలింగ్, రోజుకు 100 ఎస్ఎంఎస్లు పంపుకునే అవకాశం ఈ ప్లాన్ రీఛార్జ్ చేసుకునే యూజర్లకు ఉంది. ఎయిర్ టెల్ 979 రూపాయల ప్లాన్లో మరో బెన్ఫిట్ ఏంటంటే..56 రోజుల అమెజాన్ ప్రైమ్ మెంబర్ షిప్ బెన్ఫిట్స్ 56 రోజుల పాటు ఈ ప్లాన్లో భాగంగా పొందొచ్చు. జియోకు పోటీగా ఎయిర్టెల్ రీఛార్జ్ ప్లాన్స్లో మార్పులుచేర్పులు చేస్తూ గట్టి కాంపిటీషన్ ఇచ్చే ప్రయత్నం చేస్తున్న సంగతి తెలిసిందే. రీఛార్జ్ ప్లాన్ల ధరలు పెంచినప్పటికీ యూజర్లు చేజారిపోకుండా కాపాడుకునే ప్రయత్నాల్లో రిలయన్స్ జియో, భారతి ఎయిర్ టెల్ గట్టిగానే  ట్రై చేస్తున్నాయి.