డెడ్ బాడీ కోసం బంధువుల కొట్లాట

కరీంనగర్, వెలుగు: ఆత్మహత్య చేసుకున్న వ్యక్తి డెడ్​బాడీని తాము తీసుకెళ్తామంటే..తామే తీసుకువెళ్తామని అతడి పుట్టింటి, అత్తింటి తరఫు బంధువులు సోమవారం కరీంనగర్ జిల్లా ప్రభుత్వ హాస్పిటల్​లో పరస్పరం రాళ్ల దాడి చేసుకున్నారు. దీంతో పోలీసులు రంగ ప్రవేశం చేసి ఇరువర్గాలను చెదరగొట్టారు. ప్రత్యక్ష సాక్షుల కథనం ప్రకారం.. మహబూబాబాద్  జిల్లా పాకాల కొత్తగూడెం గ్రామానికి చెందిన వల్లపు స్వామి తన భార్య స్వాతి, ఇద్దరు పిల్లలతో కలిసి కొంతకాలంగా కరీంనగర్ చంద్రపూర్ కాలనీలో ఉంటున్నాడు. 

వడ్డెర కులవృత్తి చేస్తూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. కొద్దిరోజులుగా భార్యభర్తల మధ్య గొడవలు జరుగుతున్నాయి. ఈ క్రమంలోనే ఆదివారం రాత్రి కూడా మరోసారి గొడవ జరగ్గా మనస్తాపానికి గురైన స్వామి సోమవారం ఉదయం ఇంట్లో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. దీంతో అతడి మృతదేహాన్ని కరీంనగర్ జిల్లా ప్రభుత్వ దవాఖాన మార్చురీకి పోస్టుమార్టం కోసం తరలించారు.

అయితే, డెడ్ బాడీని తీసుకెళ్లే  విషయంలో స్వామి, స్వాతి తరఫు బంధువుల మధ్య ఘర్షణ జరిగింది. అంత్యక్రియల కోసం డెడ్ బాడీని తాము తీసుకువెళ్తామంటే..తామే తీసుకువెళ్తామని ఇరువర్గాలు రాళ్లతో కొట్టుకున్నారు. ఈ దాడిలో స్వాతితో పాటు పలువురు గాయపడ్డారు. దీంతో పోలీసులు అక్కడికి  చేరుకుని ఇరువర్గాలను చెదరగొట్టారు. డెడ్ బాడీని స్వామి తల్లిదండ్రులకు అప్పగించి బంధువులకు కౌన్సెలింగ్ ఇచ్చారు. ఈ దాడిలో జిల్లా హాస్పిటల్​కు చెందిన అంబులెన్స్ అద్దాలు కూడా ధ్వంసమయ్యాయి.