ట్రిపుల్ఆర్ అలైన్​మెంట్​ మార్చాలని రైతుల ఆందోళన

  • అవార్డు మీటింగ్​లకు బహిష్కరించిన రైతులు 
  • నేల పైనే భోజనం చేసి నిరసన 
  • నేటితో ముగిసిన అవార్డ్ మీటింగ్ లు
  • డాక్యుమెంట్లు ఇచ్చింది కొందరే 
  • ఇవ్వని రైతులు, ప్లాట్ల యజమానులే ఎక్కువ

యాదాద్రి, వెలుగు: అలైన్​మెంట్​మార్చాలనే డిమాండ్​తో రైతుల ఆందోళనలు.. నిరసనలు.. బహిష్కరణలతో రీజినల్​రింగ్​రోడ్డు (ట్రిపుల్​ఆర్​) అవార్డు మీటింగ్​లు ముగిశాయి. యాదాద్రి జిల్లాలో వారం రోజులుగా జరిగిన  మీటింగ్​లకు కొందరు రైతులు మాత్రమే హాజరై.. డాక్యుమెంట్లు అందించారు. మెజార్టీ రైతులు ఇవ్వలేదు. ఆపై అవార్డు మీటింగ్​లను కూడా బహిష్కరించారు. 

యాదాద్రి జిల్లాలోనే ఆందోళనలు

సంగారెడ్డిలో ప్రారంభమయ్యే ట్రిపుల్ ఉత్తర భాగం మెదక్​, సిద్దిపేట జిల్లాల మీదుగా యాదాద్రి జిల్లాలోని చౌటుప్పల్​లో ముగుస్తుంది. మొత్తం 164 కిలోమీటర్ల రోడ్డుకు అవసరమైన 5 వేల ఎకరాలకు భూ సేకరణ కోసం అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. త్రి ఏ నుంచి త్రి జీ నోటిఫికేషన్లు రిలీజై అవార్డు మీటింగ్​లు సైతం జరిగాయి. భూ సేకరణ కోసం ఏర్పాటు చేసిన ఎనిమిది 'కాలా'ల్లో ఎక్కడ జరగని విధంగా యాదాద్రి జిల్లా చౌటుప్పల్, భువనగిరి 'కాలా'ల్లో రైతులు తీవ్ర స్థాయిలో నిరసనలు వ్యక్తం చేశారు. ఈనెల 21 నుంచి 25 వరకూ చౌటుప్పల్​ లో నిర్వహించిన అవార్డు మీటింగ్​లో నిరసనలు మొదలయ్యాయి.

 వలిగొండ మండలం పహిల్వాన్​ పూర్​కు చెందిన కొందరు రైతులు హాజరై డాక్యుమెంట్లు అందించారు. వీరు మినహా మిగిలిన 10 గ్రామాల రైతులు, ఖాళీ ప్లాట్ల ఓనర్లు హాజరు కాలేదు. అయితే.. ఐదు రోజుల పాటు చౌటుప్పల్​ఆర్డీవో, తహసీల్దార్​ఆఫీసుల ఎదుట ఆందోళనలు చేశారు. హైదరాబాద్​- విజయవాడ  హై పై రాస్తారోకో చేపట్టారు. ఈ నెల 25 నుంచి భువనగిరి పరిధిలోని ఆరు గ్రామాలకు సంబంధించి అవార్డు మీటింగ్​లు ప్రారంభమై బుధవారం వరకు నిర్వహించిన అవార్డు మీటింగ్​లకు కేవలం ఇద్దరు రైతులు మాత్రమే హాజరై  డాక్యుమెంట్లను అందించారు. మిగిలిన రైతులందరూ మీటింగ్​లను బహిష్కరించారు. 

ఉదయం నుంచి ఆందోళన

అవార్డు మీటింగ్​లో భాగంగా బుధవారం భువనగిరి మండలం రాయగిరికి చెందిన అవార్డు మీటింగ్​ను ఆర్డీవో ఆఫీసులో ఏర్పాటు చేశారు.  అయితే రైతులు మాత్రం ఎవరూ మీటింగ్​వద్దకు రాలేదు. ఆర్డీవో ఆఫీసు ప్రధాన గేటు వద్ద బైఠాయించిన రైతులు సాయం త్రం వరకూ ఆందోళన కొనసాగించారు. ట్రిపుల్​ఆర్​అలైన్​మెంట్​మార్చాలని డిమాండ్​ చేస్తూ నినాదాలు చేశారు.

 ఖాళీ ప్లాట్ల యజమానులు కొందరు తమ స్థలాల డాక్యుమెంట్లను ఇవ్వడానికి ఆర్డీవో ఆఫీసుకు వచ్చారు. దీంతో వారిని రైతులు ఆపి..  ఆందోళన కు మద్దతు ఇవ్వాలని, డాక్యుమెంట్లు ఇవ్వొద్దని కోరారు. దీంతో కొందరు వెనక్కి వెళ్లిపోయారు. మధ్యాహ్నం భోజనం తెప్పించుకొని ఆర్డీవో ఆఫీసు ఎదుటే కింద కూర్చొని తిని తమ నిరసన తెలిపారు. ఇలా వారం రోజులుగా జరిగిన అవార్డు మీటింగ్​లు బుధవారంతో ముగిశాయి.