విమోచనాన్ని విస్మరించడం అసాధ్యం!

జనగాం దగ్గరున్న కొలనుపాక గొప్ప జైనక్షేత్రం.  ఆ ప్రాంతంలో నవాబ్‌ తురాబ్‌ యార్‌జంగ్‌ అనే జాగీర్దారు చేసే దాష్టీకాలకు అంతేలేదు.  దళితులను ముస్లింలుగా మార్చే మతమార్పిడికి అతడు పూనుకున్నాడు. అప్పటికే ఆ ప్రాంతంలో వెట్టిచాకిరి విముక్తికి, అధిక పన్నుల నిరోధానికి వ్యతిరేకంగా ఉద్యమం నడుస్తూ ఉంది. అయితే అతని మతమార్చిడికి వ్యతిరేకంగా ఆర్యసమాజం శుద్ధి కార్యక్రమం నిర్వహిస్తే, దానికి వెన్నుదన్నుగా కొలనుపాకకు చెందిన, కమ్యూనిస్టు పార్టీలో ప్రసిద్ధులైన ఆరుట్ల రామచంద్రారెడ్డి, ఆరుట్ల లక్ష్మీనరసింహారెడ్డి అండగా నిలచి జాగీర్దారు అరాచకాలకు అడ్డుకట్ట వేశారు.  

విచిత్రం ఏమిటంటే ఈ రోజు “భారతీయ జనతాపార్టీ అధికారంలోకి రావద్దని, “విమోచన దినాన్ని విసృత గాథగా మార్చాలని ‘కమ్యూనిస్టు స్కూల్‌ ఆఫ్‌ థాట్‌’ చేస్తున్న ‘గతి తార్మికవాదం' ఆశ్చర్యాన్ని కలిగిస్తున్నది. 1940 తర్వాత జరిగిన దేశ మత విభజన రాజకీయాల్లో ముస్లింలీగ్‌ జిన్నా సిద్ధాంతాన్ని గుడ్డిగా సమర్థించింది.  హజ్‌యాత్ర కూడా చేయని మహ్మదాలీ జిన్నా వీళ్ల దృష్టిలో గొప్ప వ్యక్తి! అధికారికంగా 18 మంది కొడుకులు 19 మంది కూతుళ్లను కని రాచరిక వ్యవస్థను విలాసవంతంగా గడిపిన మీర్‌ ఉస్మాన్‌ అలీఖాన్‌ దురంతాలు కనబడకుండా కళ్లకు గంతలు కట్టుకోలేం కదా! 

తెలుగు రద్దు

ఇక్కడున్న తెలుగు, మరాఠా, కన్నడ ప్రజల మనోభావాలను పట్టించుకోకుండా 11 శాతం ఉర్దూ మాట్లాడేవారి కోసం ఫర్మానా జారీ చేసిన సర్‌ అక్బర్‌ హైదరీ ఉద్దేశాలు ఏమిటో చరిత్రను దాచాలనుకుంటున్న అపర మేధావులు చెప్పగలరా? 1929లో  బాలికల కోసం నారాయణగూడలో ఓ పాఠశాల స్థాపిస్తే తెలుగు బోధనా మాధ్యమం అంటూ రద్దు చేసిన విషయం ఇప్పుడు భాష  కోసం గొంతుచించుకొని 'హిందీ దక్షిణాదిపై రుద్దుతున్నారని అరిచేవాళ్లకైనా తెలుసా? సూర్యాపేటలో స్థాపించిన ఆంధ్ర ప్రకాశినీ గ్రంథాలయాన్ని తాలూక్‌దారు పర్యటనకు వచ్చి చూసి వెంటనే మూసేయాలని ఆజ్ఞ ఇచ్చాడు. ఈ లోపు వరంగల్‌ అదాలత్‌ నాజింసా నుంచి ఇంకో ఆజ్ఞ (నిషాన్‌ 23 తేదీ 12 మెహర్‌ 1333 ఫ) ఎందుకు జారీ అయిందో చెప్పరు!  

కాళోజీని కాలగర్భంలో కలిపేద్దామా?

‘మన అన్నలను జంపిన, మన చెల్లెల్లను చెరిచిన  మానవాధములను, మండలాధీశులను  మరిచిపోకుండగ గుర్తుంచుకోవాలె’ అన్న కాళోజీని కాలగర్భంలో  ఎవరూ కల్పలేరు! ‘ఓరి నిజాం పిశాచమా’ అని గొంతెత్తి నినదించిన దాశరథిని మన మాయల మరాఠీ చరిత్రలో దాచలేం!  'విలస తామ్ర శాసనం” పేరు కనీసం వినకున్నా..  కమ్యూనిస్టు యోధుడు చండ్ర రాజేశ్వరరావు రచించిన ‘చారిత్రాత్మక తెలంగాణ పోరాటం’, నిఖార్సయిన కాంగ్రెస్‌ను అభిమానించిన వెల్దుర్తి మాణిక్యరావు రాసిన ‘హైదారాబాద్‌ సంస్థానంలో స్వాతంత్రోద్యమం’,  తెలంగాణ కాంగ్రెస్‌లో పోరాటయోధుడైన స్వామి  రామానందతీర్థ రచించిన ‘హైదరాబాదు స్వాతంత్ర్య పోరాటం’, వందేమాతరం రామచంద్రరావు సోదరులు రాసిన ‘హైదరాబాద్‌ పోలీసు చర్య’  పుస్తకం అన్నా ఒక్కసారి చదివి చూడండి. 

పోనీ, మనం ప్రత్యేక తెలంగాణ తెచ్చుకున్నాక 2014లో ఈ ప్రభుత్వం తెలుగు అకాడమీ ద్వారా ముద్రించిన వెలపాటి రామారెడ్డి 'తెలంగాణ సాయుధ పోరాటం’ అయినా పరిశీలించండి. సరే! వీళ్లంతా హిందువులు అని వద్దనుకుంటే మగ్ధూం మొహియుద్దీన్‌, హీరాలాల్‌ మోరియా వంటి వాళ్ల కవిత్వమన్నా చదవండి ప్లీజ్‌! యూదులపై కత్తిగట్టి నాజీలు సాగించిన నరమేధం కన్నా తెలంగాణలో నిజాం పాలనలో రజాకార్లు సాగించిన ఊచకోతలు తీవ్రస్థాయి కలవి. జర్నలిస్ట్‌  షోయబుల్లాఖాన్‌ ‘ఇమ్రోజ్‌’ పత్రిక నడిపి ఖాసీం రజ్వీకి వ్యతిరేకంగా రాసినందుకు హైదరాబాద్‌ నడ్డిబొడ్డున ప్రాణం పోగొట్టుకొన్నాడు. ఇదే హైదరాబాద్‌లో సాక్షాత్తు ప్రెస్‌క్లబ్‌లో రచయిత్రి తస్లీమా నస్రీన్‌పై దాడి జరిగింది. ఈ సంతుష్టీకరణ జాడ్యం సమాజానికి శాపంగా మారకూడదు.

 మేధావులు సంయమనం పాటించాలి

చారిత్రక తప్పిదాలు చేయడం ఈ దేశంలో వామపక్షాలకు అలవాటే. అది తెలుసుకుని లెంపలేసుకోవడం అలవాటుగా మారింది.  ‘ఇంగువ’ను గుడ్డలో దాస్తే దాని వాసన ఎక్కడికి పోతుంది? కనీసం తప్పో, ఒప్పో  సాయుధపోరాటం చేసినవారి ఆత్మలైనా శాంతించాలి గదా! వరంగల్‌లో  డా. నారాయణరెడ్డి హత్య జరిగాక కోర్టులో ఇత్తెహాదుల్‌  ముసల్మీన్‌ స్థానిక అధ్యక్షుడు, కార్యదర్శి మధ్య 'నేను కూర్చోలేనని వీళ్ల వద్ద పచ్చి నెత్తురు వాసన వస్తుందని’ నిరసన తెలిపిన కాళోజీ ఆత్మఘోషనైనా పట్టించుకోండి.    

 ఇలా చెప్తూ పోతే  తెలంగాణ విమోచనకు ముందు అంతా రక్తపు మరకలే .   ఇప్పటికైనా చరిత్రను చెరిపివేయాలని ప్రయత్నించకుండా మేధావులు సంయమనం పాటించాలి. నాజీల చరిత్రను, కిరాతకాలను జర్మన్లు దాచిపెట్టలేదు. నాజీల దురంతాలను యూరప్‌ ఏనాడూ మెచ్చుకోలేదు. హిట్లర్‌ గొప్పవాడని వాళ్ల పుస్తకాల్లో రాసుకోలేదు. చలనచిత్రాలు తీసి ప్రజలను ఏమార్చలేదు. కానీ, ఈ గడ్డపై జరిగిన దమనకాండను విస్మరించడం చారిత్రక ద్రోహమవుతుంది..

ఎందరో పోరాట యోధులు

15 ఏప్రిల్‌ 1938 నాటి ధూల్‌పేట ఘటనలో బహదూర్‌ మార్‌జంగ్‌ రజాకార్లను అక్కడి ప్రాంతంపైకి ఉసిగొల్పాడు. అక్కడి లోధ్‌ క్షత్రియులు, ప్రజలు తిరగబడితే బహదూర్‌ యార్‌జంగ్‌ ఇద్దరు కొడుకులు మరణించారు. విశ్వవిద్యాలయాల్లో తిష్టవేసినవారు ధర్మాపూర్‌ పడమటి తాండా లంబాడీల పోరాటం మరిచిపోలేం. 1948లో గిరిజన మహిశ పూలమ్మ ఒంటరిగా ఉన్నపుడు రజాకార్లు చెరచబోతే వారి కళ్లల్లో కారం చల్లి,  ఓ రజాకార్‌ ను నరికేసిన తెగువ సామాన్యమా?  నిజాం రజాకార్లకు వ్యతిరేకంగా పోరాడినవాళ్లలో వరంగల్‌ నారాయణరెడ్డి, జనగాం శఠగోపాలాచారి, చాకలి ఐలమ్మ, మొగిలయ్య గౌడ్‌, వందేమాతరం రాంచంద్రరావు, స్వామి రామానందతీర్థ, గడియారం రామకృష్ణశర్మ, పాగ పుల్లారెడ్డి, నారాయణరావ్‌ పవార్‌, షోయబుల్లాఖాన్‌, గడ్డం సాంబయ్య, ఇలా అన్ని వర్గాలవారున్నారు. అలాంటప్పుడు ఈ లిబరల్స్‌ ఒక వర్గాన్నే టార్గెట్​ చేయడమేంది  ?

- డా. పి. భాస్కరయోగి