పురాతన ఆలయాల పునర్నిర్మాణం చేపట్టాలి : కన్నెకంటి వెంకటరమణ

చారిత్రాత్మక వేయిస్తంభాల ఆలయంలోని కల్యాణ మండపం పునర్నిర్మాణం జరిగి ఇటీవలే ప్రారంభించడంతో రాష్ట్రంలో ఇదే మాదిరి పునర్నిర్మాణానికై  చేపట్టి నిర్లక్ష్యంగా వదిలివేసిన అనేక పురాతన చారిత్రక కట్టడాల నిర్మాణం వెంటనే చేపట్టాలి. 2005 లో ప్రారంభమైన కల్యాణ మండపం పునర్నిర్మాణ పనులు రెండు దశాబ్దాల అనంతరం భారతీయ పురాతత్వ శాఖ పూర్తి చేసి 2024 మార్చి 8వ తేదీన ప్రారంభించింది.

ఆలస్యమయినా, దీని పునర్నిర్మాణ పనులు పూర్తికావడం పట్ల హర్షామోదాలు వ్యక్తం చేస్తున్న చరిత్ర కారులు ఒక్క వరంగల్ జిల్లాలోనే పునర్నిర్మాణానికి  విప్పదీసి  నిర్లక్ష్యంగా పడవేసిన దాదాపు ఐదు పురాతన ఆలయాలలో  ములుగు మండలంలోని జాకారం శివాలయం,  రామానుజాపూర్ పంచకూట ఎరుకల నాంచారమ్మ గుడి,  రఘునాధ్ పల్లి మండలం మీదికొండ త్రికూటాలయం, ములుగు ఘనపురం కోటగుళ్లు, రెడ్డి గుడి,  కరీంనగర్ జిల్లాలోని నంగునూరు శివాలయాలు,  హుజూరాబాద్ మండలంలోని గొడిశాల, నల్లగొండ జిల్లాలోని నాగులపాడు ఇలా పదుల సంఖ్యలో చారిత్రక ఆలయాలను పునర్నిర్మాణం పేరుతో పూర్తిగా విప్పదీశారు.

ఈ విప్పదీసిన  ఆలయాలకు చెందిన స్తంభాలు,  విలువైన శిల్పాలు అన్యాక్రాంతం కావడం, గృహ నిర్మాణ అవసరాలకు తీసుకెళ్లడం లాంటివి చేస్తున్నారు. తెలంగాణలో అలంపూర్ దేవాలయాలు, వరంగల్ ఫోర్ట్ (1993 ), ఇటీవల పూర్తైన వేయి స్తంభాల ఆలయం కల్యాణ మండపంలను మాత్రమే పునర్నిర్మాణం చేశారు. ప్రస్తుత కొత్త ప్రభుత్వంలోనైనా ఈ తొలగించిన ఆలయాలను పునర్నించడానికి తగు నిధులు కేటాయించాలి.

వీటి పునర్నిర్మాణం, పునరుద్ధరణతో పర్యాటకులు పెరగడంతోపాటు, స్థానికంగా వ్యాపారాభివృద్ది జరిగి ఉపాధి అవకాశాలు కూడా మెరుగవుతాయి. వీటి పునర్నిర్మాణంతో కొన్ని వేల సంవత్సరాల క్రితం నిర్మించిన మన వారసత్వ సంపదను కాపాడుకోవడం ద్వారా ముందు తరాలకు అందించేవాళ్లమవుతాం.

- కన్నెకంటి వెంకటరమణ, హైదరాబాద్