చేపలన్నీ వరద పాలు..!

  • భారీ వర్షాలతో నష్టపోయిన మత్స్యకారులు
  • అలుగులకు అడ్డుపెట్టిన జాలీలూ వరదలో గాయబ్
  • పాలేరులో కొట్టుకుపోయిన కేజ్ కల్చర్ యూనిట్లు 
  • రూ. 4.30 కోట్ల నష్టం జరిగిందని అధికారుల అంచనా
  • ప్రభుత్వం ఆదుకోవాలంటున్న మత్స్యకార సంఘాలు

ఖమ్మం జిల్లా పాలేరు రిజర్వాయర్​ లో కొన్నేళ్లుగా కేజ్​ కల్చర్​ పద్దతిలో చేపలను పెంచుతున్నారు. ఇక్కడ మొత్తం 11 యూనిట్లు ఏర్పాటుచేశారు. రెండు వారాల కింద వచ్చిన వరదల్లో ఇందులోని 8 యూనిట్లు కొట్టుకుపోయాయి. ఆ యూనిట్లలో ఉన్న చేపలతో కలిపి ఒక్కో యూనిట్ కు కనీసం రూ.6 లక్షల చొప్పున నష్టం వాటిల్లిందని మత్స్యకారులు వాపోతున్నారు. అంతేకాకుండా రిజర్వాయర్ లో ఉన్న చేపలు, రొయ్యలు కూడా కొట్టుకుపోయి తీవ్రంగా నష్టపోయారు. 

ఖమ్మం, వెలుగు: ఇటీవల జిల్లాలో భారీ వర్షాలు మత్స్యకారులను దారుణంగా దెబ్బతీశాయి. కొన్ని గంటల్లోనే ఊహించని విధంగా వచ్చిన వరదలు తీవ్ర నష్టాన్ని కలిగించాయి. ఖమ్మం జిల్లాలో మొత్తం 876 చెరువులు ఉండగా, 212 మత్స్యకార సొసైటీలున్నాయి. వీటిలో 16,460 మంది మత్స్యకారులు సభ్యులుగా ఉన్నారు. అధికారులు చెబుతున్న ప్రకారమే జిల్లాలో మత్స్యకారులకు4.30 కోట్ల వరకు నష్టం వాటిల్లింది. వాస్తవానికి అంతకంటే రెండింతల నష్టం జరిగిందని మత్స్యకార సంఘాలు చెబుతున్నాయి.

జిల్లాలో 41 చెరువులకు గండ్లు పడగా, 139 చెరువులు అలుగుపారాయి. దీంతో జిల్లాలో 3,500 టన్నుల చేపలు కొట్టుకుపోయాయని ఆఫీసర్లు లెక్కతేల్చారు. 400 వలలు, 150 తెప్పలు కూడా కొట్టుకుపోయాయి. చేపలు చెరువుల నుంచి బయటకు వెళ్లిపోకుండా ఏర్పాటుచేసిన జాలీలు కూడా వరదపాలయ్యాయి.  రెండు వారాల క్రితం కొన్ని గంటల వ్యవధిలోనే అన్ని చెరువులు, రిజర్వాయర్లలోకి భారీగా వరద నీరువచ్చి చేరింది.

Also Read :- ఆనాడూ ఇలాగే స్పందిస్తే బాగుండేది

దీంతో ప్రధానంగా పాలేరు, వైరా రిజర్వాయర్లలో ఎక్కువగా మత్స్యకారులకు నష్టం జరిగింది. ఒక్క పాలేరులోనే రూ.కోటి వరకు నష్టం జరిగిందని మత్స్యకారులు చెబుతున్నారు. ఇక వైరా రిజర్వాయర్​ లో రూ.30 లక్షల విలువ చేసే వలలు, చేపలు కొట్టుకుపోయాయి. 11 మండలాల్లో 39 చెరువులకు కట్టలు తెగడంతో చేపలంతా వరదతో పాటు బయటకు వెళ్లిపోయాయి. చేపలు పట్టేందుకు చెరువుల దగ్గరనే ఉంచిన వలలు, తెప్పలు కూడా కొట్టుకుపోయాయి. 

ప్రభుత్వమే మత్స్యకారులను ఆదుకోవాలి

వరదల కారణంగా మత్స్యకారులు ఆర్థికంగా తీవ్రంగా నష్టపోయారు. ప్రతి చెరువు, కుంటలకు చేపలు బయటికి పోకుండా అమర్చిన జాలీలు, వలలు కొట్టుకొని పోవటం వలన టన్నుల కొద్దీ చేపలు బయటకు వెళ్లిపోయాయి. మత్స్యకార సంఘాలన్నీ కోలుకోలేని పరిస్థితిలో ఉన్నాయి. ప్రభుత్వమే మత్స్యకారులను ఆదుకోవాలి. ప్రతి మత్స్యకారునికి రూ.పదివేల ఆర్థిక సహాయంతో పాటు, ప్రతి చెరువుకు జాలీలు, వలల నిమిత్తం రూ.30 వేల నుంచి రూ.50 వేల వరకు ఇవ్వాలి. - మామిడి వెంకటేశ్వర్లు, జిల్లా మత్స్య సహకార సంఘాల అడహాక్ కమిటీ అధ్యక్షుడు