బాధితులకు భరోసా..నెలలో రెండు రోజులు పోలీస్​ స్టేషన్లలో మకాం

  • సామాన్యుల సమస్యలపై గద్వాల ఎస్పీ ఫోకస్
  • నెలలో రెండు రోజులు పోలీస్​ స్టేషన్లలో మకాం
  • ప్రజల నుంచి నేరుగా ఫిర్యాదులు స్వీకరణ

గద్వాల, వెలుగు : అన్యాయానికి గురవుతున్న సామాన్యులు పోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోకపోవడం, వివిధ కారణాలతో న్యాయం లభించని వారికి భరోసా కల్పించడంపై జోగులాంబ గద్వాల ఎస్పీ రితిరాజ్​ దృష్టి పెట్టారు. జిల్లాలో లా అండ్  ఆర్డర్ ను పర్యవేక్షిస్తూనే పోలీస్ స్టేషన్లను విజిట్​ చేస్తూ నేరుగా ప్రజల నుంచి కంప్లైంట్లు స్వీకరిస్తున్నారు. ఏకంగా ఎస్పీ వచ్చి తమ కంప్లైంట్లు తీసుకొని, సమస్య పరిష్కరిస్తామని భరోసా ఇవ్వడంతో సామాన్యులు సంతోషిస్తున్నారు. మరోవైపు కింది స్థాయి సిబ్బంది బాధ్యతను గుర్తు చేస్తూ వారి పనితీరును మార్చే ప్రయత్నం చేస్తున్నారు.

నెలలో రెండు పోలీస్ స్టేషన్లలో నేరుగా ప్రజలను కలిసేందుకు ఏర్పాట్లు చేసుకున్నారు. మార్చి 15న అయిజ పోలీస్ స్టేషన్​లో ప్రజావాణి నిర్వహించగా, 17 మంది బాధితులు ఎస్పీకి నేరుగా ఫిర్యాదు చేసి తమ సమస్యను వివరించారు. ఈ నెల 28న శాంతినగర్  పోలీస్ స్టేషన్ లో ప్రజలకు అందుబాటులో ఉండి కంప్లైంట్లు స్వీకరిస్తారని ఎస్పీ ఆఫీస్  వర్గాలు తెలిపాయి. అలాగే జిల్లాలో ఇల్లీగల్  యాక్టివిటీస్ పై కూడా ప్రత్యేక దృష్టి పెట్టారు. పీడీఎస్  రైస్, లిక్కర్, మట్టి, ఇసుక అక్రమ రవాణా, పేకాటను అరికట్టేందుకు ప్రత్యేకంగా 18 మంది సిబ్బందితో ఫోర్స్  ఏర్పాటు చేసి దాడులు చేయిస్తున్నారు. 

ప్రజల వద్దకే ఎస్పీ..

చాలా మంది బాధితులు ఎస్పీ ఆఫీస్  వరకు రాలేరనే ఉద్దేశంతో, ప్రజల వద్దకు తాను వెళ్లాలని నిర్ణయించారని అంటున్నారు. పోలీస్  స్టేషన్లలో పైరవీలు పెరిగిపోవడంతో సామాన్యులకు న్యాయం జరగడం లేదనే ఆరోపణలున్నాయి. వాటిని తిప్పికొట్టేందుకు పెండింగ్  ఫిర్యాదులపై బాధితులతో ఎస్పీ నేరుగా మాట్లాడుతున్నారు. ఫిర్యాదు చేసినా కేసు నమోదు కాకపోవడం వంటి సమస్యలు ఉంటే తన దృష్టికి వస్తాయనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం చేపట్టారు.

ఉదయం నుంచి సాయంత్ర వరకు స్టేషన్ లో ఉండి పరిసరాలను పరిశీలించడంతో పాటు రికార్డులను తనిఖీ చేస్తున్నారు. ప్రజలు వచ్చి తనకు కంప్లైంట్  చేసుకునేలా ముందుగానే సమాచారం ఇస్తున్నారు. స్టేషన్ కు వచ్చిన ఫిర్యాదులను నిర్లక్ష్యం  చేస్తే, ఈ విషయం ఎస్పీ దృష్టికి వెళ్లే అవకాశం ఉంది. దీంతో పోలీస్​ ఆఫీసర్లు, సిబ్బంది పనితీరులో మార్పు వచ్చే చాన్స్​ ఉందని అంటున్నారు. 

ఇల్లీగల్ యాక్టివిటీస్ పై నజర్..

ఇటీవల జిల్లాలో పీడీఎస్  రైస్, మట్టి, ఇసుక దందా పెరిగిపోయింంది. వీటిని అరికట్టేందుకు లీడర్లు అడ్డుపడుతుండడంతో పోలీసులు ఏం చేయలేని పరిస్థితి ఉంది. లీడర్ల పైరవీలతో పోస్టింగ్​ తెచ్చుకున్న పోలీస్​ ఆఫీసర్లు ఇల్లీగల్  దందాలపై పెద్దగా దృష్టి పెట్టడం లేదనే విమర్శలున్నాయి. దీంతో నేరుగా ఎస్పీ రంగంలోకి దిగి, 18 మందితో స్పెషల్  ఫోర్స్  ఏర్పాటు చేశారు. ఇల్లీగల్  యాక్టివిటీస్ పై నిఘా పెట్టి, అక్కడి పోలీసులకు తెలియకుండానే దాడులు చేయిస్తున్నారు.

మట్టి, ఇసుక మాఫియాపై దాడులు చేసి నాలుగు టిప్పర్లు, జేసీబీ, 9 ట్రాక్టర్లను సీజ్  చేసి కేసులు నమోదు చేశారు. పీడీఎస్  రైస్  అక్రమ రవాణా చేస్తున్న వారిపై దాడులు చేసి కేసులు నమోదు చేశారు. నాలుగు చోట్ల పేకాట ఆడుతున్న వారిపై దాడులు చేసి, వారిని అదుపులోకి తీసుకున్నారు. ఇలా ఇల్లీగల్  యాక్టివిటీస్ పై స్పెషల్  ఫోర్స్  ద్వారా దాడులు చేయిస్తూ దడ పుట్టిస్తున్నారు.