వ్యవసాయ భూముల్లో ప్లాటింగ్ పైనే రియల్టర్ల ఫోకస్

  • అప్రూవ్డ్ లేఔట్లు నిల్  ఫామ్ వెంచర్లు ఫుల్!
  • గుంటల్లోపు ఉన్నా ధరణిలో రిజిస్ట్రేషన్లు చేస్తున్న తహసీల్దార్లు 
  • లేఔట్, నాలా కన్వర్షన్ చార్జీల ఎగవేతకు సహకారం   
  • అర్బన్ డెవలప్ మెంట్ అథార్టీల ఆదాయానికి గండి

కరీంనగర్, వెలుగు : రాష్ట్రంలో ఏటేటా అప్రూవ్డ్ లే ఔట్లు తగ్గిపోతున్నాయి. మరోవైపు ఫామ్ ప్లాట్ల బిజినెస్ జోరుగా నడుస్తోంది. మూడేళ్లుగా డీటీసీపీ, హెచ్ఎండీఏ, కుడా, సుడా వంటి అర్బన్ డెవలప్ మెంట్ సంస్థల అప్రూవల్స్ తో వెంచర్లు చేయడం లేదు. చాలామంది రియల్టర్లు వ్యవసాయ భూములను ప్లాట్లుగా చేసి గుంటల లెక్కన అమ్మేస్తున్నారు. వీటికి మామూళ్లు ఫిక్స్ చేసి తహసీల్దార్లు కూడా రిజిస్ట్రేషన్లు చేసేస్తున్నారు. దీంతో సర్కార్ కు లే ఔట్ చార్జీలు, నాలా కన్వర్షన్ ఫీజుల కింద రావాల్సిన ఆదాయం తగ్గుతుంది. ఇలాంటి ఫామ్ ప్లాట్లలో భవిష్యత్ లో ఇల్లు కట్టుకోవాలంటే ఇబ్బందులు తప్పవని, నాలా కన్వర్షన్ తోపాటు ఎల్ఆర్ఎస్, ఓపెన్ స్పేస్ చార్జీలు చెల్లిస్తేనే పర్మిషన్లు వస్తాయని మున్సిపల్ అధికారులు పేర్కొంటున్నారు. 

ఫామ్ ప్లాట్లకూ రిజిస్ట్రేషన్లు 

వ్యవసాయ భూములను ఫామ్ ప్లాట్లుగా చేసి అమ్మడాన్ని అడ్డుకునేందుకు 2021 జులై 9న మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్ మెంట్ సర్క్యులర్ జారీ చేసింది. మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో 20 గుంటల్లోపు వ్యవసాయ భూములను రిజిస్ట్రేషన్  చేయొద్దని స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ల శాఖను కోరింది. అయితే.. ఇదే సర్క్యులర్   తహసీల్దార్లకు కాసులు కురిపిస్తోంది. లే ఔట్ పర్మిషన్ల కోసం సర్కార్ కు  ఫీజులు చెల్లించడంతో పాటు 33 ఫీట్ల రోడ్లు, ఓపెన్ స్పేస్ వంటి రూల్స్ ను మస్ట్ గా పాటించాల్సి ఉంటుంది.  దీంతో  కొందరు రియల్టర్లు ఫార్మ్ ల్యాండ్స్ పేరిట రెండు, మూడు గుంటల చొప్పున ప్లాట్లుగా చేసి అమ్ముతున్నారు. వీటికి రైతు బంధు, రైతు బీమా వస్తాయని కొనుగోలుదారులకు ఆశ చూపుతున్నారు. ఇక ఫార్మ్ ల్యాండ్స్ రిజిస్ట్రేషన్లు తహసీల్దార్లకు అదనపు ఆదాయంగా మారాయి. ముందుగా వీటిని రిజిస్ట్రేషన్ చేసే వీల్లేదని కొర్రీలు పెడుతున్నారు. ఆ తర్వాత ధరణి ఆపరేటర్లు, మీ సేవ  నిర్వాహకుల మధ్యవర్తిత్వంతో  ఒక్కో ప్లాట్ కు  రూ.10 వేలు – రూ.20 వేల వరకు తహసీల్దార్లు వసూళ్లకు పాల్పడుతున్నారు. తహసీల్దార్ ఆఫీసుల్లో రోజుకు ఐదారు రిజిస్ట్రేషన్లు అయితే.. అందులో మూడు ఫార్మ్ ల్యాండ్స్ రిజిస్ట్రేషన్లు ఉండడం గమనార్హం.

“కరీంనగర్ జిల్లా మానకొండూరు మండలం చెంజర్లలో ఓ రియల్టర్ నాన్ లే ఔట్ ఫామ్ వెంచర్ వేశారు. ఒక్కో ప్లాట్ ను 5 గుంటల నుంచి 10 గుంటల వరకు చేశాడు. ఇలా 55 ప్లాట్లుగా చేసి అమ్ముతున్నారు.  వెంచర్ మ్యాపు లో 30  ఫీట్లు, 33 ఫీట్ల రోడ్డు చూపించా రు. కానీ అక్కడ ఎలాంటి రోడ్ల నిర్మాణాల్లేవు. కేవలం చదును చేసిన ల్యాండ్, మ్యాప్ చూపెట్టి కొనుగోలు దారులకు అంటగడుతున్నారు. కరీంనగర్- వరంగల్ హైవేకు కిలోమీటరు దూరంలోని ఈ వెంచర్ కు ఎలాంటి అర్బన్ డెవలప్ మెంట్ అథారిటీ పర్మిషన్లు లేవు’’. 


 ఏడేండ్లలో సుడాలో ఆథరైజ్డ్ వెంచర్లు తొమ్మిదే.. 

2017లో శాతవాహన అర్బన్ డెవలప్ మెంట్ అథారిటీ(సుడా) ఏర్పాటైంది. ఏడేండ్లలో సుడా పర్మిషన్ పొందిన ఆథరైజ్డ్ వెంచర్లు తొమ్మిదే. కానీ నాన్ లేఔట్, ఫామ్ వెంచర్లు మాత్రం 200 వరకు ఉంటాయని అధికారుల అంచనా. గతేడాది కాలంలో లే ఔట్ అప్రూవల్ కు ఒక్క అప్లికేషన్ కూడా రాలేదు. 

పది శాతం రిజిస్ట్రేషన్ చేయించాలి

ఇక సబ్ రిజిస్ట్రార్ ఆఫీసులో పట్టా మార్పిడికి గుంటకు రూ.20 వేల వరకు చలానా చెల్లించాల్సి ఉంటుంది.  ప్రభుత్వ రూల్స్ ప్రకారం సుమారు 10 ఎకరాల్లో  వెంచర్  చేస్తే.. అందులో 10 శాతం(రోడ్లు, ఓపెన్ స్పేస్)  భూమిని పంచాయతీ లేదా మున్సిపాలిటీ లేదా కార్పొరేషన్ పేరుతో రిజిస్ట్రేషన్ చేయించాలి. 10 ఎకరాలకు 40 గుంటల స్థలాన్ని మార్టిగేజ్ చేయాలి. కానీ ఫామ్ వెంచర్ల రిజిస్ట్రేషన్లలో ఇవేమి పాటించడం లేదు. రోడ్లకు తీసిన స్థలాన్ని కూడా పట్టాదారు భవిష్యత్ లో ఇతరుల పేరిట రిజిస్ట్రేషన్ చేసే ప్రమాదముంది. లే ఔట్ లేని ప్లాటింగ్ వల్ల అర్బన్ డెవలప్ మెంట్ అథారిటీలకు కూడా డెవలప్ మెంట్, ప్రాసెసింగ్ చార్జీలు రావడంలేదు.  ఇటీవల అర్బన్ డెవలప్ మెంట్ అథారిటీల విస్తరణ, కొత్త అర్బన్ డెవలప్ మెంట్ అథారిటీల ఏర్పాటు నేపథ్యంలో నాన్ లేఔట్ వెంచర్లు, ధరణిలో ఫామ్ ప్లాట్ల రిజిస్ట్రేషన్లు చర్చనీయాంశంగా మారాయి.  

సర్కార్ ఆదాయానికి రూ.కోట్లలో గండి

గత సర్కార్ తెచ్చిన ధరణి పోర్టల్ కొందరు రియల్ ఎస్టేట్ వ్యాపారులకు వరంగా మారింది. అగ్రికల్చర్ భూములను ఎకరాల్లో కొనుగోలు చేసి ఫామ్ ప్లాట్ల పేరిట గుంటల్లో చేసి అమ్మేస్తున్నా రు. ప్లాటింగ్ మ్యాప్ ను కేవలం పేపర్ పైనే చూపించి రిజిస్ట్రేషన్ చేయించి కొనుగోలు దారుల చేతుల్లో పాస్ బుక్ లు  పెడుతున్నారు. తద్వారా ప్రభుత్వానికి చెల్లించాల్సిన నాలా కన్వర్షన్, లేఔట్ చార్జీలు ఎగవేస్తున్నారు. వ్యవసాయ  భూమిని వ్యవసాయేతర పనులకు వినియోగించాలంటే ముందుగా నాన్ అగ్రికల్చర్ ల్యాండ్ (నాలా) కన్వర్షన్ చేసుకోవాలి. ఇందుకు భూమి విలువలో 5 శాతం చలానాగా చెల్లించాలి. అనంతరం తహసీల్దార్ ఆఫీసులో అప్లై చేసుకోవాలి. ఎకరాకు మార్కెట్ వాల్యూ రూ.10 లక్షలు ఉంటే రూ.50 వేలు కట్టాల్సి ఉంటుంది. అప్లికేషన్ ను తహసీల్దార్ పరిశీలించి నాలా కన్వర్షన్ చేస్తారు. అలా చేయకుండా ధరణిలో రిజిస్ట్రేషన్లు చేస్తుండడం తో 5 శాతం సర్కార్ ఆదాయానికి గండిపడుతోంది.