నాగర్ కర్నూల్ జిల్లాలో ఆ గ్రామాల్లో మళ్లీ ఎన్నికలు

  • అచ్చంపేట మున్సిపాలిటీ నుంచి విలీన పంచాయతీలకు విముక్తి
  • గ్రామ పంచాయతీల వారీగా ఓటర్ల తుది జాబితా విడుదల

నాగర్​కర్నూల్, వెలుగు: నాగర్​కర్నూల్​ జిల్లా అచ్చంపేట నియోజకవర్గంలోని అచ్చంపేట, బల్మూరు మండలాలకు చెందిన పల్కపల్లి, లింగోటం, నడింపల్లి, పుల్జాల, లక్ష్మాపూర్, గుంపన్​పల్లి, తోటపల్లి, పోలిశెట్టిపల్లి గ్రామపంచాయతీలను 2018లో అచ్చంపేట మున్సిపాలిటీలో విలీనం చేశారు. విలీనాన్ని తీవ్రంగా వ్యతిరేకించిన ఏడు గ్రామాల ప్రజలు అప్పటి మంత్రులు, ఉన్నతాధికారులతో తమ గ్రామాలను మినహాయించాలని మొర పెట్టుకున్నారు.

అచ్చంపేట పర్యటనకు వచ్చిన అప్పటి మున్సిపల్​ మంత్రి కేటీఆర్​ మున్సిపాలిటీలో ఏడు గ్రామాల విలీనం రద్దు చేస్తామని హామీ ఇచ్చారు. అయినప్పటికీ విలీనం రద్దు ప్రక్రియ లేట్​ కావడంతో ఆ తర్వాత జరిగిన గ్రామపంచాయతీ ఎన్నికల్లో ఈ 8 గ్రామాలను నోటిఫై చేయలేదు. ఈ గ్రామాల్లో ఎన్నికలు నిర్వహించలేదు. దాదాపు ఆరేండ్లు ఈ గ్రామపంచాయితీలకు సర్పంచులు లేక మున్సిపాలిటీ లెక్కల్లో లేక అభివృద్ది జరగలేదు. అయితే ఓటర్ల జాబితాలో గ్రామ పంచాయతీలుగా 8 గ్రామపంచాయతీలను గుర్తించారు. సర్పంచ్, వార్డ్​ మెంబర్​ ఎన్నికల నిర్వహణకు ఏర్పాట్లు చేస్తున్నారు.  

పురుషులే ఎక్కువ..

జిల్లాలోని గ్రామ పంచాయతీల ఓటర్ల తుదిజాబితాను అధికారులు ప్రకటించారు. చేరికలు, తొలగింపు, అభ్యంతరాల అనంతరం తుది జాబితా విడుదలైంది. జిల్లాలోని 20 మండలాలు, 464 గ్రామపంచాయతీల్లోని 4,140 వార్డుల్లో 6,46,407 ఓటర్లు నమోదైనట్లు డీపీవో ప్రకటించారు. వీరిలో 3,23,705 పురుషులు,3,22,689 మహిళలు, 13 మంది థర్డ్​ జండర్​ ఓటర్లు ఉన్నారు. అచ్చంపేట మండలంలో 36,360, అమ్రాబాద్​లో 28,342, బల్మూరులో 34,951, బిజినేపల్లిలో 61,618, చారకొండలో 20,621, కల్వకుర్తిలో 30,962, కోడేరులో 35,900, కొల్లాపూర్​లో 27,157, లింగాలలో 30,907, నాగర్​ కర్నూల్​లో 34,114, పదరలో 17,044, పెద్దకొత్తపల్లిలో 48,064, పెంట్లవెల్లిలో17,574, తాడూరులో 30,173, తెల్కపల్లిలో45,031, తిమ్మాజీపేటలో 32,530, ఉప్పునుంతలలో 30,603, ఊర్కొండలో17,719, వంగూరులో 33,120, వెల్డండ మండలంలో 33,527 మంది ఓటర్లు ఉన్నారు.

గద్వాలలో మహిళలే ఎక్కువ

గద్వాల: పంచాయతీ ఎన్నికలకు ఓటర్ల జాబితాను జిల్లా ఆఫీసర్లు రెడీ చేశారు. జిల్లాలో 3,88,195 మంది ఓటర్లు ఉన్నట్లు నిర్ధారించారు. 255 గ్రామ పంచాయతీలు ఉండగా, 3,88,195 ఓటర్లు ఉన్నారు. 1,91,313 పురుషులు, 1,96,875 మహిళలు, ఏడుగురు ట్రాన్స్​జెండర్లు ఉన్నారు.

అలంపూర్ లో 8,549 పురుషులు, 8,721 మహిళలు, ధరూర్ లో 18,825 పురుషులు, 19,669, గద్వాలలో 17049 పురుషులు, 17,652 మహిళలు, గట్టులో 23,052 పురుషులు, 24,004 మహిళలు, అయిజలో 22,500 పురుషులు, 22,916 మహిళలు, ఇటిక్యాలలో 20,592 పురుషులు, 20,936 మహిళలు, కేటిదొడ్డిలో 13,940 పురుషులు, 21,580 మహిళలు, మల్దకల్ లో 20,820 పురుషులు, 21, 580 మహిళలు, మానవపాడులో 11,860 పురుషులు, 12,404 మహిళలు, రాజోలిలో 13,640 పురుషులు, 13,580 మహిళలు, ఉండవెల్లిలో 11,624 పురుషులు, 12,065 మహిళలు, వడ్డేపల్లి మండలంలో 8,228 మంది పురుషులు, 8,320 మంది మహిళా ఓటర్లు ఉన్నట్లు నిర్ధారించారు. గద్వాల జిల్లాలో పురుషుల కంటే 5 వేల మంది మహిళా ఓటర్లు ఎక్కువగా ఉన్నారు.

వనపర్తి లోనూ మహిళలే ఎక్కువ..

వనపర్తి: వనపర్తి జిల్లాలోని 14 మండలాల్లో రూపొందించిన పంచాయతీ ఓటర్ల తుది జాబితాను ప్రకటించారు. జిల్లాలో 3,567,521 మంది ఓటర్లుండగా, అందులో 1,83,382 మంది పురుషులు, 1,84,135 మంది మహిళా ఓటర్లు ఉన్నారు. పాన్​గల్​ మండలంలో అత్యధికంగా 41,467 మంది ఉండగా, అత్యల్పంగా అమరచింత మండలంలో 13,836 మంది ఉన్నారు. 14 మండలాలకు గాను, 9 మండలాల్లో మహిళా ఓటర్లు ఎక్కువగా ఉండడం గమనార్హం. 753 మంది మహిళా ఓటర్లు ఎక్కువగా ఉన్నారు.