జనవరి 6లోపు ‘ముక్కోటి’ పనులు పూర్తి కావాలి

  • భద్రాచలం ఆర్డీవో దామోదర్​ 

భద్రాచలం, వెలుగు : సీతారామచంద్రస్వామి దేవస్థానంలో జరిగే ముక్కోటి ఏకాదశి ఉత్సవాల కోసం చేపడుతున్న పనులన్నీ జనవరి 6 లోపు పూర్తి కావాలని ఆర్డీవో దామోదర్ ​అధికారులను ఆదేశించారు. భద్రాచలం ఆర్డీవో ఆఫీసులో శనివారం నిర్వహించిన ముక్కోటి వైకుంఠ ఏకాదశి ఉత్సవ ఏర్పాట్ల రివ్యూ మీటింగ్​లో ఆయన మాట్లాడారు. ఆఫీసర్లంతా అప్పగించిన విధులను సకాలంలో పూర్తి చేయాలన్నారు. ఉత్సవాల పర్యవేక్షణ, బందోబస్తు ఏర్పాట్లు పోలీసులతో సమన్వయం చేసుకుని నిర్వహిస్తామన్నారు. 

లాడ్జి, హోటల్​ యజమానులతో సమావేశం నిర్వహించి ధరలు నిర్ణయించామని చెప్పారు. తెప్పోత్సవం కోసం ఏర్పాటు చేసిన హంస వాహనాన్ని తనిఖీ రిపోర్టు ఇవ్వాలని ఇరిగేషన్​ ఈఈకి సూచించారు. భద్రాచలం, పర్ణశాలల్లో శానిటేషన్​ ఎంపీడీవో, తహసీల్దార్లు చూసుకోవాలని చెప్పారు. 

భక్తులకు రైలు, బస్సు సమయాలను, జిల్లాలోని ప్రముఖ దర్శనీయ స్థలాలను తెలియజేసేలా సమాచార కేంద్రాలను ఏర్పాటు చేయాలన్నారు.  భక్తులెవరికైనా గుండెపోటు వస్తే సీపీఆర్​ చేయడానికి పోలీసులు, గ్రామపంచాయతీ సిబ్బందికి ఈనెల 27న స్పెషల్ ట్రైనింగ్​ ఇవ్వాలని డీఎం హెచ్​వో కు సూచించారు. ఇన్​చార్జ్ డీఎస్పీ రవీందర్​రెడ్డి, దేవస్థానం ఈవో రమాదేవి వివిధ శాఖల ఆఫీసర్లు మీటింగ్​లో పాల్గొన్నారు.