వేసవి కాలంలో ఎన్ని కూరలు చేసినా... చారు, రసంలాంటివి లేకపోతే తినాలి అనిపించదు. అలాగని ఒకటే రకం చారు లేదా రసం రోజూ తినలేం కదా! అందుకే ఈ వారం కిచెన్‌లో వెరైటీ రసాలు ఎలా చేయొచ్చో చదివి, చేసేయండి.
ఉడుప్పి
కావాల్సినవి :
నూనె - ఐదు టేబుల్ స్పూన్లు
ధనియాలు - రెండున్నర కప్పులు
సోంపు - ముప్పావు కప్పు
మెంతులు - పావు కప్పు
పిప్పలి (పొడవు మిరియాలు) - ఒక టీస్పూన్ (మార్కెట్లో దొరుకుతాయి)
ఇంగువ - చిటికెడు
ఎండు మిర్చి - పదిహేను
కరివేపాకు - కొంచెం
కందిపప్పు - పావు కప్పు
పసుపు - అర టీస్పూన్
టొమాటో ముక్కలు - ఒక కప్పు
చింతపండు గుజ్జు - అర టీస్పూన్
కొత్తిమీర - పావు కప్పు
తయారీ : నూనె వేయకుండా కరివేపాకు వేగించాలి. తర్వాత నూనె వేడి చేసి, అందులో ధనియాలు, మెంతులు, జీలకర్ర, సోంపు, మిర్చి ఒక్కోటి వేసి వేగించాలి. అవన్నీ చల్లారాక మిక్సీజార్‌లో వేసి, పిప్పలి కూడా వేసి కచ్చాపచ్చాగా గ్రైండ్ చేయాలి.
పాన్‌లో కంది పప్పు వేసి నీళ్లు పోసి ఉడికించాలి. పాన్‌లో నూనె వేడి చేసి ఆవాలు, పచ్చిమిర్చి, పసుపు, కరివేపాకు వేగించాలి. అందులో టొమాటోలు కూడా వేసి ఉడికించాలి. తర్వాత మూడు కప్పుల నీళ్లు పోసి వేడి చేయాలి. తర్వాత చింతపండు గుజ్జులో రెండు కప్పులు నీళ్లు పోయాలి. ఐదు నిమిషాలు కాగబెట్టాలి. ఉడికించిన పప్పు నీళ్లతో పాటు పోసి పది నిమిషాలు పెద్ద మంట మీద ఉడికించాలి. తర్వాత తయారుచేసిన రసం పొడి వేయాలి. అందులోనే ఒక కప్పు వేడి నీళ్లు పోసి ఉప్పు, ఇంగువ వేసి కలపాలి. చివరిగా కొత్తిమీర చల్లితే ఉడుప్పి రసం రెడీ.
క్యారెట్‌తో...
కావాల్సినవి :
క్యారెట్, టొమాటో - ఒక్కోటి
ఉల్లిగడ్డ - ఒకటి
కందిపప్పు - రెండు టేబుల్ స్పూన్లు
నూనె, ఉప్పు - సరిపడా
ఎండు మిర్చి - రెండు
కొత్తిమీర, కరివేపాకు - కొంచెం
పసుపు, కారం, చింతపండు గుజ్జు - ఒక్కో టీస్పూన్
మెంతులు - పావు టీస్పూన్
జీలకర్ర, ఆవాలు - ఒక్కోటి అర టీస్పూన్
తయారీ : ప్రెజర్ కుక్కర్లో కందిపప్పు, క్యారెట్, టొమాటో ముక్కలు వేయాలి. నీళ్లు పోసి మూత పెట్టి ఉడికించాలి. నూనె వేడి చేసి ఆవాలు, జీలకర్ర, మెంతులు, కరివేపాకు, ఎండు మిర్చి వేగించాలి. ఉల్లిగడ్డ తరుగు వేసి ఒక నిమిషం వేగించాక అందులో ఉడికించిన పప్పు, కూరగాయలు వేసి బాగా కలపాలి. చింతపండు గుజ్జు వేసి రెండు కప్పులు నీళ్లు పోయాలి. నాలుగు నిమిషాలు ఉడికించాక కొత్తిమీర చల్లితే యమ్మీ క్యారెట్ రసం తినేయడమే.
వెల్లుల్లి రసం
కావాల్సినవి :
వెల్లుల్లి పాయ - ఒకటి
మిరియాలు - రెండు టీస్పూన్లు
ధనియాలు, పసుపు, ఆవాలు - ఒక్కో టీస్పూన్
ఎండు మిర్చి - రెండు
చింతపండు గుజ్జు - ఒక టేబుల్ స్పూన్
కరివేపాకు - కొంచెం
ఉప్పు - సరిపడా
మెంతులు - అర టీస్పూన్
నూనె - ఒక టేబుల్ స్పూన్
తయారీ : చింతపండు నానబెట్టి గుజ్జు తీయాలి. మిక్సీజార్‌లో వెల్లుల్లి రెబ్బలు, జీలకర్ర, మిరియాలు, ధనియాలు, టొమాటో ముక్కలు, కరివేపాకు వేసి కచ్చాపచ్చాగా గ్రైండ్ చేయాలి. నూనె వేడి చేసి మెంతులు, ఆవాలు, ఎండు మిర్చి వేగించాలి. అందులోనే గ్రైండ్ చేసిన పేస్ట్ వేగించాలి. తరువాత చింతపండు గుజ్జు, పసుపు, కరివేపాకు, ఉప్పు వేసి నీళ్లు పోసి కలిపి ఐదు నిమిషాలు ఉడికించాలి.
పచ్చి మామిడి రసం
కావాల్సినవి :
మామిడి కాయ ముక్కలు - ఒక కప్పు
ఉల్లిగడ్డ తరుగు - రెండు టీస్పూన్లు
కొత్తిమీర, కరివేపాకు - కొంచెం
జీలకర్ర - ఒక టీ స్పూన్
పచ్చిమిర్చి, ఎండు మిర్చి - ఒక్కోటి
పసుపు - అర టీస్పూన్
ఉప్పు, నూనె - సరిపడా
ఇంగువ - చిటికెడు
తయారీ : పాన్‌లో నీళ్లు పోసి మామిడి కాయ ముక్కల్ని ఉడికించాలి. తర్వాత ఆ నీళ్లు ఒంపేసి, మామిడి కాయ ముక్కల్ని మిక్సీజార్‌లో వేసి మెత్తగా గ్రైండ్ చేయాలి. పాన్‌లో నూనె వేడి చేసి ఆవాలు, కరివేపాకు, జీలకర్ర, పసుపు, పచ్చిమిర్చి, ఎండు మిర్చి, ఇంగువ వేగించాలి. అందులో ఉల్లిగడ్డ తరుగు వేసి ఒక నిమిషం వేగించాక మామిడి పేస్ట్ వేసి, నీళ్లు పోసి కలపాలి. చివరిగా ఉప్పు, కరివేపాకు వేస్తే సరి.
టొమాటో కడీ
కావాల్సినవి :
టొమాటో - ఒకటి
పచ్చిమిర్చి - మూడు
ఎండు మిర్చి - ఒకటి
కరివేపాకు - కొంచెం
మెంతులు, జీలకర్ర, ఇంగువ - ఒక్కోటి పావు టీస్పూన్ చొప్పున
కొబ్బరి తురుము, పెరుగు - ఒక్కోటి పావు కప్పు
బెల్లం, నూనె, ఉప్పు - సరిపడా
తయారీ : నూనె వేడి చేసి మెంతులు, జీలకర్ర, కరివేపాకు, పచ్చిమిర్చి, టొమాటో ముక్కలు వేగించాలి. తర్వాత వాటిని మిక్సీజార్‌లో వేయాలి. అందులో కొబ్బరి తురుము వేసి నీళ్లు పోసి మెత్తగా గ్రైండ్ చేయాలి. ఆ తర్వాత ఉప్పు, బెల్లం కలపాలి. నూనె వేడి చేసి జీలకర్ర, ఆవాలు, కరివేపాకు, ఎండు మిర్చి, ఇంగువ వేగించాలి. తరువాత గ్రైండ్ చేసిన మిశ్రమం అందులో వేస్తే టేస్టీ టొమాటో కడీ రెడీ.
నిమ్మకాయతో...
కావాల్సినవి :
టొమాటోలు, పచ్చిమిర్చి - రెండేసి చొప్పున
కందిపప్పు - ఒక కప్పు
అల్లం - చిన్న ముక్క
వెల్లుల్లి రెబ్బలు - ఐదు
నీళ్లు - రెండు కప్పులు
రసం పొడి - రెండు టీస్పూన్లు
పసుపు - ఒక టీస్పూన్
నిమ్మకాయ - ఒకటి
ఉప్పు - సరిపడా
జీలకర్ర, ఆవాలు - ఒక్కోటి అర టీస్పూన్
కరివేపాకు, కొత్తిమీర - కొంచెం
తయారీ : మిక్సీజార్‌లో టొమాటో ముక్కలు, అల్లం, వెల్లుల్లి వేసి మెత్తగా గ్రైండ్ చేయాలి. ఆ పేస్ట్‌ని ఒక గిన్నెలో వేగించాలి. అందులో పసుపు, రసం పొడి, ఉప్పు, పచ్చిమిర్చి వేసి నీళ్లు పోసి ఉడికించాలి. మరో పాన్‌లో నెయ్యి వేడి చేసి ఆవాలు, జీలకర్ర, కరివేపాకు, కొత్తిమీర వేగించాలి. ఆ తాలింపును ఇందులో వేయాలి. చివరిగా అందులో నిమ్మరసం కలపాలి.