గద్వాల జిల్లాలో బార్డర్ దాటుతున్న రేషన్ బియ్యం

  • కీలకంగా మారిన బినామీ డీలర్లు, రైస్  మిల్లర్లు
  • కేసులు నమోదు చేస్తున్నా భయపడని మాఫియా
  • ఆఫీసర్లు సహకరిస్తున్నారనే ఆరోపణలు

గద్వాల, వెలుగు: గద్వాల జిల్లాలో కొన్నాళ్లుగా సైలెంట్‌‌‌‌గా ఉన్న రేషన్‌‌‌‌ బియ్యం మాఫియా మళ్లీ రెచ్చిపోతోంది. ఇన్నాళ్లు ప్రజల నుంచి సేకరించి దందా చేసేవాళ్లు ఇప్పుడు బినామీ డీలర్ల ద్వారా కొత్తరూట్‌‌‌‌ను ఎంచుకున్నారు. వారి నుంచి బియ్యాన్ని సేకరించి రైస్‌‌‌‌మిల్లుకు తరలించి సీఎంఆర్‌‌‌‌ ‌‌‌‌కింద  సర్కారుకు అందజేస్తున్నారు. మిగిలిన బియ్యం లారీలు, డీసీఎంలలో బార్డర్  దాటిస్తున్నారు.  మాఫియాలో బినామీ డీలర్లు, రైస్ మిల్లర్లు కీలకంగా వ్యవహరిస్తున్నారు. వీరిని కట్టడి చేయాల్సిన పోలీసులు, ఎన్‌‌‌‌ఫోర్స్‌‌‌‌మెంట్‌‌‌‌ ఆఫీసర్లు మాఫియాకు సహకరిస్తున్నట్లు ఆరోపణలున్నాయి. మాఫియాపై అప్పుడప్పుడు కేసులు పెడుతున్నా దందా కొనసాగుతూనే ఉంది.

బినామీ డీలర్లదే హవా..

గద్వాల జిల్లాలో 333 రేషన్  షాపులున్నాయి. ఇందులో చాలా షాపులకు రెగ్యులర్‌‌‌‌‌‌‌‌ డీలర్లు లేరు. దీంతో ఒక్కొక్కరు 3 నుంచి 5 షాపులకు ఇన్‌‌‌‌చార్జిగా ఉన్నారు. 54 మంది ఇన్‌‌‌‌చార్జి డీలర్లుగా కొనసాగుతున్నారు. వీరిలో చాలా మంది ఇన్‌‌‌‌చార్జిల పేరిట బినామీలే షాప్‌‌‌‌ నిర్వహిస్తున్నారు. గతంలో రేషన్ షాపులకు మహిళా సంఘాల సభ్యులను డీలర్లుగా నియమించారు. కానీ, వారు నడపకుండా, బినామీలకు అప్పగించారు. వీరితో నేరుగా సంప్రదించి రేషన్  బియ్యాన్ని బల్క్​గా తీసుకొని డీసీఎంల ద్వారా రైస్  మిల్లులకు తరలిస్తున్నారు. రేషన్  దుకాణాల పక్కనే మరో షాపును అద్దెకు తీసుకొని అందులో బియ్యాన్ని నిల్వ ఉంచి.. ఈ వ్యవహారాన్ని నడిపిస్తున్నట్లు తెలుస్తోంది. 

 రైస్  మిల్లులే కీలకం..

గద్వాల టౌన్‌‌‌‌తో పాటు చుట్టుపక్కల ఉన్న  రైస్ మిల్లులు, అలంపూర్  నియోజకవర్గంలోని హైవే సమీపంలో ఉన్న రైస్​ మిల్లులే అడ్డాగా దందా నడిపిస్తున్నారు. ఈ మిల్లులను లీజ్‌‌‌‌కు తీసుకున్న మాఫియా బినామీ డీలర్ల నుంచి పట్టపగలే బియ్యం తరలించి డంప్‌‌‌‌ చేస్తున్నారు. వీటిలో నుంచే మిల్లర్లు సీఎంఆర్‌‌‌‌‌‌‌‌ ఇస్తున్నట్లు తెలుస్తోంది. మిగతా బియ్యాన్ని ఏపీ, కర్నాటక బార్డర్‌‌‌‌‌‌‌‌ దాటిస్తున్నారు. 

కేసులు పెడుతున్నా..

జోగులాంబ గద్వాల జిల్లాలో రేషన్  బియ్యం దందా చేస్తున్న వారిపై కేసులు పెడుతూనే ఉన్నారు. జింకలపల్లె గ్రామ శివారులోని పద్మావతి శ్రీనివాస రైస్  ఇండస్ట్రీలో అక్రమంగా నిల్వ చేసిన 50 క్వింటాళ్ల బియ్యాన్ని అక్టోబర్ 1న పట్టుకొని కేసు నమోదు చేశారు. సెప్టెంబర్ 30న 130 క్వింటాళ్ల బియ్యాన్ని ఉండవల్లి పోలీసులు పట్టుకొని కేసు పెట్టారు. రెండు రోజుల కింద మానవపాడు మండలంలోని పోతులపాడు గ్రామంలో 23 క్వింటాళ్ల బియ్యాన్ని బార్డర్  దాటిస్తుండగా పోలీసులు పట్టుకొని కేసు నమోదు చేశారు.

మాఫియా వెనుక పెద్దల హస్తం..

రేషన్ బియ్యం దందాలో కీలకంగా వ్యవహరించే వారికి పెద్దల సపోర్ట్​ ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. గద్వాలలో ఈ దందా ప్రారంభించిన మాఫియాలోని వ్యక్తులు ప్రస్తుతం జిల్లా అంతా తమ దందాను కొనసాగిస్తున్నారు. రైస్‌‌‌‌ మిల్లులను లీజ్‌‌‌‌కు తీసుకొని మరీ దందా చేస్తున్నారు. బియ్యం వెహికిల్స్‌‌‌‌ పట్టుబడుతున్నా తప్పుడు ట్రేడర్లు, రైస్‌‌‌‌ మిల్లుల పేర్ల మీద కేసు నమోదయ్యేలా చేసి తప్పించుకుంటున్నట్లు ఆరోపణలున్నాయి. ఎక్కడైనా రేషన్  బియ్యం పట్టుబడితే పోలీసులు ముందుగా ఎన్‌‌‌‌ఫోర్స్‌‌‌‌మెంట్‌‌‌‌ ఆఫీసర్లకు సమాచారం ఇవ్వాలి. 

వారు పంచనామా రిపోర్టు ఇచ్చాక, దాని ఆధారంగా పోలీసులు ఎఫ్ఐఆర్  నమోదు చేసి చర్యలు తీసుకోవాలి. కానీ, గద్వాల జిల్లాలో ఇందుకు భిన్నంగా జరుగుతోంది. రేషన్  బియ్యం పట్టుబడగానే పోలీసులు వెహికల్‌‌‌‌ను స్టేషన్‌‌‌‌కు తరలించి నిందితులపై ఎఫ్‌‌‌‌ఐఆర్‌‌‌‌‌‌‌‌ నమోదు చేస్తున్నారు. అందులో నమోదు చేసిన పేర్ల ఆధారంగానే ఎన్‌‌‌‌ఫోర్స్‌‌‌‌మెంట్‌‌‌‌ ఆఫీసర్లు చర్యలు తీసుకుంటుండడంతో అసలు నిందితులు తప్పించుకుంటున్నారు. అంతా ఒకే మాఫియాకు చెందిన వారే అయినా రైస్  మిల్లు పేర్లు, ట్రేడర్  పేర్లు మార్చి కేసులు పెడుతూ పీడీ యాక్ట్‌‌‌‌కు దొరకకుండా జాగ్రత్త పడుతున్నారని అంటున్నారు. 

అధికారుల సహకారం..

పోలీసులు, ఎన్‌‌‌‌ఫోర్స్‌‌‌‌మెంట్‌‌‌‌ ఆఫీసర్లు మాఫియా ఇచ్చే మామూళ్లకు అలవాటు పడిన ఆఫీసర్లు చూసీచూడనట్లు వ్యవహరిస్తున్నట్లు ఆరోపణలున్నాయి. వెహికిల్  చెకప్‌‌‌‌తో పాటు బార్డర్‌‌‌‌‌‌‌‌ చెక్‌‌‌‌పోస్టుల వద్ద పట్టుబడ్డ వెహికల్ ను బట్టి రూ.10 వేల నుంచి రూ.10 వేలు తీసుకొని వదిలేస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. కొన్ని రూట్లలో నెలనెలా మామూళ్లు తీసుకొని సహకరిస్తున్నట్లు తెలుస్తోంది. రేషన్  బియ్యం మాఫియాకు సపోర్ట్  చేస్తున్నాడనే ఆరోపణలతో  కృష్ణయ్య అనే కానిస్టేబుల్ ను అక్టోబర్ 4న ఎస్పీ సస్పెండ్  చేశారు. 

చర్యలు తీసుకుంటాం..

నేను ఇటీవల డ్యూటీలో జాయిన్ అయ్యాను. రేషన్  బియ్యం మాఫియాలో ఎంతటి వారు ఉన్నా కఠిన చర్యలు తీసుకుంటాం. స్పెషల్  ఫోర్స్  ఏర్పాటు చేసి  బియ్యం అక్రమ రవాణాను అడ్డుకుంటాం.  ప్రజలు కూడా ఎవరికీ రేషన్‌‌‌‌ బియ్యం అమ్మవద్దు.

 శ్రీనివాసులు, సీఐ గద్వాల